India vs Pakistan Highlights: ప్రత్యర్థిని ఓడించాలంటే బలమైన ప్రణాళిక అవసరం. అదే బలమైన ప్రత్యర్థిని మట్టి కరిపించాలంటే అంతకంటే బలమైన ప్రణాళిక కావాలి. పాపం పాకిస్తాన్ దీనిని మర్చిపోయినట్టుంది. ఇటీవల కాలంలో యూఏఈ వేదికగా జరిగిన ముక్కోణపు సిరీస్ ను టీమిండియా సొంతం చేసుకుంది. అదే ఊపు ఆసియా కప్ లో కూడా కొనసాగుతుందని అందరూ అనుకున్నారు. భారత జట్టుతో జరిగే మ్యాచ్లో గట్టి పోటీ ఇస్తుందని ఊహించారు. కానీ వాస్తవంలో పరిస్థితి అందుకు విరుద్ధంగా చోటు చేసుకుంది. పహల్గాం దాడి.. బాయ్ కాట్ పిలుపులు.. సోషల్ మీడియాలో ఉద్యమాలు ఇన్నింటి నడుమ భారత్ రెచ్చిపోయింది. పాకిస్తాన్ కు చుక్కలు చూపించింది. దాయాది జట్టుకు ఏమాత్రం అవకాశమే ఇవ్వకుండా.. పరుగులు తీయడానికి స్కోప్ ఇవ్వకుండా.. వికెట్లు తీసే సమయం లేకుండా దూకుడుగా ఆడింది. ఏకంగా ఏడు వికెట్ల తేడాతో అద్భుతమైన విజయాన్ని దక్కించుకుంది.
ఈ మ్యాచ్లో భారత్ ముందుగా బౌలింగ్ తో రెచ్చిపోయింది. ఆ తర్వాత బ్యాటింగ్లో మంటలు మండించింది. యూఏఈ లో ఆడుతున్నప్పటికీ.. సొంత మైదానంలో తలపడుతున్నట్టుగా సత్తా చూపించింది. పైగా టీమిండియా అభిమానులు కూడా భారీగా రావడంతో మన ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శన చూపించారు.. ఈ మ్యాచ్లో గెలిచి భారత్ ఏకంగా సూపర్ 4 లోకి ఎంట్రీ ఇచ్చింది. గ్రూపు ఏ లో మరో స్థానం కోసం పాకిస్తాన్, యూఏఈ, ఒమన్ జట్ల మధ్య పోటీ ఉంది. ఒకవేళ యూఏఈ పై విజయం సాధిస్తే పాకిస్తాన్ సూపర్ 4 లోకి ప్రవేశిస్తుంది.
ఈ మ్యాచ్లో పాకిస్తాన్ అనేక తప్పులు చేసింది. అందులో ప్రధానమైనది ఆ జట్టు కెప్టెన్ తీసుకున్న నిర్ణయం. ఈ విషయాన్ని పాకిస్థాన్ అభిమానులే ఒప్పుకుంటున్నారు. ప్రస్తుతం ఆసియా కప్ దుబాయ్ లో జరుగుతోంది. ఇది ఎడారి ప్రాంతం కావడంతో సహజంగానే పగటిపూట ఎండలు అధికంగా ఉంటాయి. అలాంటప్పుడు రాత్రిపూట డ్యూ అనేది కచ్చితంగా ఉంటుంది. దీన్ని ముందుగా అంచనా వేసిన జట్టు కెప్టెన్ ఎవరైనా సరే టాస్ గెలిస్తే బౌలింగ్ ఎంచుకుంటాడు. కానీ పాకిస్తాన్ కెప్టెన్ మాత్రం బ్యాటింగ్ ఎంచుకున్నాడు.. ఇదే విషయాన్ని సూర్యకుమార్ యాదవ్ కూడా స్పష్టం చేశాడు. ఒకవేళ తాము గనుక టాస్ గెలిచి ఉంటే కచ్చితంగా ఫీల్డింగ్ ఎంచుకునే వాళ్ళమని సూర్యకుమార్ యాదవ్ పేర్కొన్నాడు.. డ్యూ ఉన్నచోట టాస్ గెలిచి మొదటి బ్యాటింగ్ తీసుకోవడం ఏంటి అని పాకిస్తాన్ ప్లేయర్లను ఆ జట్టు అభిమానులు విమర్శిస్తున్నారు. మీరు ఓడిపోయేందుకే ఇలాంటి నిర్ణయం తీసుకొని ఉంటారని పాకిస్తాన్ అభిమానులు పేర్కొంటున్నారు. ఒకవేళ గనుక యూఏఈ ఈ సిరీస్లో తన చివరి రెండు మ్యాచ్లను గెలిస్తే మాత్రం.. పాకిస్తాన్ సూపర్ 4 వెళ్లకుండా.. స్వదేశానికి ప్రయాణం అవుతుంది.