Asia Cup 2025 India Squad: అనేక ఉత్కంఠలు.. రకరకాల ప్రశ్నల మధ్య మొత్తానికి భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆసియా కప్ లో పోటీపడే జట్టును ప్రకటించింది. అందరూ ఊహించినట్టుగానే జట్టును సూర్య కుమార్ యాదవ్ ముందుండి నడిపించనున్నాడు. సంజు, పాండ్యా, శివం దుబే, తిలక్ వర్మ, జితేష్, రింకు, చక్రవర్తి వంటి వారికి స్థానం కల్పించినట్టు మేనేజ్మెంట్ ప్రకటించింది.
సూర్య సారధి అయినప్పటికీ ఉపసారధిగా అక్షర్ పటేల్ ను కొనసాగిస్తారా? లేదా గిల్ కు అవకాశం ఇస్తారా అనే ప్రశ్నలు కొద్దిరోజుల నుంచి జాతీయ మీడియాలో వినిపిస్తున్నాయి. గిల్ కు స్ట్రైక్ రేట్ సరిగా లేకపోవడం వల్ల అతనికి అవకాశం ఇవ్వాలని వార్తలు వినిపించాయి. అయితే ఇటీవలి ఆంగ్ల జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్లో గిల్ అద్భుతమైన బ్యాటింగ్ చేసిన నేపథ్యంలో.. దానిని పరిగణలోకి తీసుకొని మేనేజ్మెంట్ అతడికి ఉపసారధిగా అవకాశమిచ్చింది. అంతేకాదు సీనియర్ ప్లేయర్లు హార్దిక్ పాండ్యా, సంజు కు కూడా చోటు కల్పించింది.. గత కొంతకాలంగా స్థిరమైన ఇన్నింగ్స్ ఆడుతున్న అభిషేక్ శర్మ, తిలక్ వర్మ కూడా జట్టులో చోటు లభించింది. ఐపీఎల్ లో ఆకట్టుకున్న రింకు, చక్రవర్తికి కూడా అవకాశం లభించింది. అందరూ ఊహించినట్టుగా శ్రేయస్ అయ్యర్ కు మాత్రం చోటు లభించలేదు..
Also Read: బ్యాట్ కు బాల్ తగలలేదు.. అయినా 6 రన్స్.. ఏం ఆటరా ఇదీ
శివం దుబే, జితేష్, చక్రవర్తి, కులదీప్, అర్ష్ దీప్, హర్షిత్ రాణా వంటి వారికి చోటు కల్పించిన మేనేజ్మెంట్ శ్రేయస్ విషయంలో ఎందుకు అలా వ్యవహరించిందనేది అర్థం కావడం లేదు. అయ్యర్ ఇటీవల ఐపిఎల్ లో పంజాబ్ జట్టుకు తిరుగులేని విజయాలు అందించాడు. ఫైనల్ దాకా తీసుకెళ్లాడు. ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ కు జట్టులో స్థానాలు ఖాళీ లేవని ఎంపిక చేయలేదు. కానీ ఇప్పుడేమో అతడిని పక్కనపెట్టి మిగతా ప్లేయర్లకు అవకాశం కల్పించారు. మరి దీనిపై మేనేజ్మెంట్ ఎటువంటి సమాధానం చెబుతుందో చూడాల్సి ఉంది.
భారత జట్టు
సూర్య కుమార్ యాదవ్ (కెప్టెన్), గిల్(వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, శివం దూబే, జితేష్, రింకు, చక్రవర్తి, అక్షర్ పటేల్, బుమ్రా, కులదీప్ యాదవ్, ఆర్ష్ దీప్ సింగ్, హర్షిత్ రాణా.