Homeక్రీడలుAsia Cup 2023: కలిసిరాని వేదికపై పాక్ తో భారత్ రెండు మ్యాచ్ లు.. ఏం...

Asia Cup 2023: కలిసిరాని వేదికపై పాక్ తో భారత్ రెండు మ్యాచ్ లు.. ఏం జరుగనుంది?

Asia Cup 2023: ఆసియా కప్ నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్ బుధవారం విడుదల కానుంది. ఆసియా కప్ క్రికెట్ పోటీలను పాకిస్తాన్ ఈసారి నిర్వహిస్తోంది. అయితే, భారత్, పాకిస్తాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డుల మధ్య ఉన్న గొడవల వల్ల ఆసియా కప్ కు సంబంధించిన షెడ్యూల్ ఇప్పటి వరకు విడుదల కాలేదు. ఈ గొడవలను రెండు క్రికెట్ బోర్డులు ఇప్పుడిప్పుడే సరిదిద్దుకుని.. ముందుకు వెళుతున్నాయి. దీంతో ఆసియా కప్ నిర్వహణకు సంబంధించి మార్గాలన్నీ సుగమయ్యాయి. లాహోర్ లో బుధవారం సాయంత్రం 7:45 గంటలకు ఆసియా కప్ షెడ్యూల్ విడుదల చేస్తున్నట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది.

పాకిస్తాన్ లో ఇబ్బందికర పరిస్థితులు ఉండడంతో ఆ దేశానికి భారత జట్టును పంపించేందుకు బీసీసీఐ అంగీకరించలేదు. దీంతో చాలా కాలంపాటు ఆసియా కప్ నిర్వహణకు సంబంధించి బీసీసీఐ, పిసిబి మధ్య వాగ్వాదం నడిచింది. బీసీసీఐ ఎట్టి పరిస్థితుల్లోనూ జట్టును పాకిస్తాన్ పంపించేందుకు అంగీకరించకపోవడంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు హైబ్రిడ్ మోడల్ ను తెరపైకి తీసుకువచ్చింది. ఇందులో భాగంగా భారత్ ఆడే మ్యాచ్లు శ్రీలంకలో నిర్వహించనుంది. దీంతో మొత్తంగా మ్యాచులకు శ్రీలంక, పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈ హైబ్రిడ్ మోడల్ పై పిసిబి నూతన చీఫ్ గా ఎన్నికైన జాకా అస్రాఫ్ కూడా అసహనం వ్యక్తం చేశాడు. దీంతో ఆసియా కప్ జరగదేమో అని అభిమానులు ఆందోళన చెందారు. అయితే అందుకు విరుద్ధంగా పిసిబి హైబ్రీడ్ మోడల్ పై ముందుకు వెళ్లేందుకు అంగీకరించి ఆసియా కప్ నిర్వహణకు మార్గం సుగమం చేసింది. దీంతో ఆసియా కప్ పోటీలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలకు పాకిస్తాన్ బోర్డు సిద్ధమవుతోంది. ఆసియా కప్ లో భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్, నేపాల్ జట్లు పోటీ పడనున్నాయి.

ఆ వేదికల విషయంలో భారత్ ఆందోళన..

భారత్, పాకిస్తాన్ జట్లు ఈ టోర్నీలో భాగంగా రెండుసార్లు తలపడనున్నాయి. ఈ రెండు జట్లు అదే మ్యాచ్లను శ్రీలంకలోని డంబుల్లాలో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ వేదిక విషయంలో భారత్ కు మెరుగైన రికార్డు లేదు. ఈ వేదికపై ఆడిన అనేక మ్యాచ్ ల్లో భారత జట్టు ఓటమిపాలు కావడంతో ఇప్పుడు అభిమానులను ఆందోళనకు గురి చేస్తుంది. ఇక్కడ ఆడిన 20 వన్డేల్లో 80 శాతం మ్యాచుల్లో భారత జట్టు ఓటమి మాటగట్టుకుంది. అటువంటి స్టేడియంలోనే పాకిస్థాన్ తో భారత జట్టు రెండు మ్యాచ్లు ఆడాల్సి వస్తుండడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే గత రికార్డులను బద్దల కొడుతూ భారత జట్టు విజయాలను నమోదు చేస్తుందని పలువురు అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ఆసియా కప్ లో భారత జట్టుకు సరైన పోటీ ఇచ్చే జట్లే లేవంటూ పలువురు పేర్కొంటున్నారు.

Exit mobile version