Asia Cup 2023: ఆసియా కప్ సూపర్ ఫోర్ మ్యాచ్‌లు ప్రారంభమయ్యాయి. తొలి మ్యాచ్ బంగ్లాదేశ్, పాకిస్తాన్ మధ్య బుధవారం జరిగింది. ఇందులో పాక్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక ఈనెల 10 భారత్, పాకిస్తాన్ తలపడనున్నాయి. తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై 5వ స్థానంలో ఆడి సత్తా చాటిన ఇషాన్ కిషన్.. మిడిల్ ఆర్డర్‌లో గట్టి ప్రభావం చూపించాడు. దీంతో సెప్టెంబర్ 10న జరిగే భారత్ వర్సెస్ పాక్ సూపర్ 4 మ్యాచ్‌లో మిడిల్ ఆర్డర్‌లో ఎవర్ని బరిలోకి దింపాలో అర్థంకాని పరిస్థితి నెలకొంది. తుది జట్టు ఎంపిక కెప్టెన్ రోహిత్, కోచ్ ద్రవిడ్‌కు తల నొప్పిగా మారింది.
రాహుల్ స్థానం ఎక్కడ?
టీమిండియా బ్యాటింగ్ లైనప్‌లో కేఎల్ రాహుల్ ఉన్నప్పుడు ఓపెనింగ్ విషయంలో టీమ్ ఎంత పటిష్టంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ వెన్ను గాయంతో ఈ స్టార్ బ్యాటర్ జట్టుకు దూరమైన తర్వాత యంగ్ ప్లేయర్స్ ఈ బెర్తు కోసం పోటీ పడుతున్నారు. అయితే రాహుల్ ఆసియా కప్ టోర్నీకి సెలక్ట్ అయి.. జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. మొదటి రెండు మ్యాచ్‌లకు దూరమైనా, సూపర్–4 మ్యాచ్‌లకు ఈ స్టార్ బ్యాటర్ అందుబాటులోకి వచ్చాడు. అయితే ఇతడిని ఏ స్థానంలో ఆడించాలో తెలియక రోహిత్, ద్రవిడ్ తలలు పట్టుకుంటున్నారు.
రాహుల్ వర్సెస్ అయ్యర్..
వన్డేల్లో ఇషాన్ కిషన్ ఇటీవల మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఎప్పుడు బరిలోకి దిగినా సత్తా చాటుతున్నాడు. ప్రస్తుతం టీమ్ ఇండియా కీలక ప్లేయర్లలో ఇషాన్ ఒకడు. ఆసియా కప్‌లో పాక్‌తో ఆడిన మ్యాచ్‌లో 81 బంతుల్లో 82 పరుగులు చేశాడు. దీంతో భారత్ మంచి స్కోర్ చేయగలిగింది. గత 4 వన్డేల్లో ఇషాన్ నాలుగు హాఫ్ సెంచరీలు చేశాడు. చాలా గ్యాప్ తర్వాత కేఎల్ రాహుల్ జట్టులోకి తిరిగి రానున్నాడు. అతడి ఫిట్‌నెస్‌పై కూడా స్పష్టత లేదు. దీంతో కిషన్‌కే వికెట్ కీపింగ్ బాధ్యతలు అప్పగించాలని టీమ్ ఇండియా భావించవచ్చు. రాహుల్‌ను ఆడించాలని భావిస్తే, శ్రేయస్ బెంచ్‌కే పరిమితం కావాల్సి ఉంటుంది.
గవాస్కర్ ఇలా..
మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కూడా ఆసియా కప్ 2023 సూపర్ 4లో స్థానం కోసం కేఎల్.రాహుల్, శ్రేయస్ అయ్యర్ మధ్య పోటీ ఉంటుందన్నారు. ఇండియా టుడేతో మాట్లాడుతూ ఈ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆసియా కప్ సూపర్ ఫోర్ మ్యాచ్‌ల్లో కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ మధ్య పోరు ఉంటుంది. పాకిస్తాన్‌పై ఇషాన్ కిషన్ మంచి ఫామ్‌తో ఆకట్టుకున్నాడు. రాహుల్, ఇషాన్ ఇద్దరూ ఆడితే.. ఇషాన్‌ను కీపర్‌గా ఆడించాలి. ఎందుకంటే రాహుల్ గాయం నుంచి కోలుకున్నా కీపింగ్ చేసేంత ఫిట్‌గా ఉండకపోవచ్చు. అందుకే ఇషాన్ వికెట్లు కాపాడుకోవాలి’ అని గవాస్కర్ చెప్పారు.
జట్టును మారుస్తుందా..
అయితే ఇప్పటికే సెట్ అయిన టీమ్‌ను మేనేజ్‌మెంట్ మారుస్తుందా అనేది చూడాలి. కేఎల్ రాహుల్ కోసం ఇషాన్ కిషన్ లేదా శ్రేయస్ అయ్యర్‌లలో ఎవర్ని తప్పించినా రోహిత్, ద్రవిడ్ విమర్శలు ఎదుర్కోక తప్పదు. పూర్తిగా ఫిట్ లేని కేఎల్ రాహుల్ కోసం ఇంతలా టీమిండియా ఎందుకు తాపత్రాయపడుతుందో అని ఫ్యాన్స్ విమర్శిస్తున్నారు.