Ravichandran Ashwin : టెస్ట్ క్రికెట్లో సరికొత్త చరిత్ర సృష్టించిన రవిచంద్రన్ అశ్విన్.. మరొకటి సాధిస్తే అతడే నెంబర్ వన్..

టీమిండియా స్టార్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన రెండు టెస్టుల సిరీస్లో అద్భుతమైన ప్రతిభ చూపి ఆకట్టుకున్నాడు.. ఈ క్రమంలో అరుదైన ఘనతకు ఒక్క అడుగు దూరంలో నిలిచాడు.

Written By: Anabothula Bhaskar, Updated On : October 1, 2024 4:52 pm

Ravichandran Ashwin

Follow us on

Ravichandran Ashwin : బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన తొలి టెస్ట్ లో రవిచంద్రన్ అశ్విన్ తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ చేశాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు రవీంద్ర జడేజాతో కలిసి 199 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఆ తర్వాత రెండవ ఇన్నింగ్స్ లో ఆరు వికెట్లు సొంతం చేసుకున్నాడు. మొత్తంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారాన్ని దక్కించుకున్నాడు. వాస్తవానికి కీలక ఆటగాళ్లు వెంట వెంటనే అవుట్ కావడంతో రవిచంద్రన్ రవీంద్ర జడేజాతో కలిసి అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించాడు. బంగ్లా బౌలర్లను ధైర్యంగా ఎదుర్కొంటూ టీమ్ ఇండియా స్కోర్ ను పరుగులు పెట్టించారు. 144/6 వద్ద ఉన్న జట్టు స్కోరు ను 343/7 దాకా తీసుకెళ్లారు. వీరిద్దరూ దూకుడుగా బ్యాటింగ్ చేయడం వల్ల టీమిండియా పటిష్ట స్థితిలో నిలిచింది. ఇక రెండవ ఇన్నింగ్స్ లో రవిచంద్రన్ అశ్విన్ బంతితో రెచ్చిపోయాడు. ఏకంగా తన సొంత మైదానంపై ఆరు వికెట్లను పడగొట్టాడు. ఆ మ్యాచ్ లో టీమిండియా గెలవడంలో రవిచంద్రన్ అశ్విన్ కీలక పాత్ర పోషించాడు. ఫలితంగా అతనికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం లభించింది.

మరొకటి సాధిస్తే అతడే నెంబర్ వన్

ఇక కాన్పూర్ వేదికగా జరిగిన రెండో టెస్టులో అశ్విన్ తొలి ఇన్నింగ్స్ లో రెండు వికెట్లు సాధించాడు. రెండవ ఇన్నింగ్స్ లో మూడు వికెట్లు సొంతం చేసుకున్నాడు. అయితే ఈ మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్ లలో హాఫ్ సెంచరీలు చేసిన టీమిండియా యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం లభించింది. తొలి టెస్ట్ లో సెంచరీ, ఆరు వికెట్లు, రెండవ టెస్టులో ఐదు వికెట్లు పడగొట్టిన రవిచంద్రన్ అశ్విన్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సిరీస్ పురస్కారం లభించింది. రవిచంద్రన్ అశ్విన్ 11 మ్యాన్ ఆఫ్ ది సిరీస్ పురస్కారాలు దక్కించుకొని ముత్తయ్య మురళీధరన్ సరసన చేరాడు. ముత్తయ్య మురళి ధరన్ కూడా 11 ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ పురస్కారాలను దక్కించుకొని ఇప్పటివరకు తొలి స్థానంలో కొనసాగాడు. వీరిద్దరి తర్వాత దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు జాక్వెస్ కల్లిస్ 9 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారాలు దక్కించుకున్నాడు. సర్ రిచర్డ్ హ్యాడ్లీ 8 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సిరీస్ పురస్కారాలు దక్కించుకున్నాడు. ఇమ్రాన్ ఖాన్, షేన్ వార్న్ కూడా 8 మ్యాన్ ఆఫ్ ది సిరీస్ పురస్కారాలను సొంతం చేసుకున్నారు.. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ దక్కించుకున్న తర్వాత అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు..” ఈ మ్యాచ్ లో గెలవడం మాకు అత్యంత ముఖ్యం. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్ లో భాగంగా మేము ఈ సిరీస్ ఆడుతున్నాం. ఇందులో గెలుపు మాకు చాలా అవసరం. మేము నాణ్యమైన క్రికెట్ ఆడాం. అటాకింగ్ బౌలింగ్ ద్వారా ఫలితాలను రాబట్టామని” అశ్విన్ వ్యాఖ్యానించాడు.