Indian Football Team : ప్రస్తుతం మన జట్టు ఇంటర్ కాంటినెంటల్ కప్ లో తలపడుతోంది. 20 సంవత్సరాల తర్వాత హైదరాబాద్ వేదికగా ఈ టోర్నీ జరుగుతోంది. టోర్నీలో హాట్ ఫేవరెట్ గా భారత్ రంగంలోకి దిగింది.. అయితే తొలి మ్యాచ్ లోనే భారత్ పూర్తిగా నిరాశపరిచింది. పసి కూన మారిషస్ జట్టుతో జరిగిన తొలి మ్యాచ్ ను భారత్ 0-0 తేడాతో డ్రాగా ముగించింది.. నిస్సారమైన ఆట తీరుతో మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకులను భారత ఆటగాళ్లు నిరాశపరిచారు. అంతర్జాతీయ ఫుట్ బాల్ సమాఖ్య ర్యాంకింగ్స్ లో భారత్ 124వ స్థానంలో కొనసాగుతోంది. మారిషస్ 174 స్థానంలో ఉంది. ఇలాంటి క్రమంలో ఏకపక్షంగా విజయం సాధించాల్సిన భారత జట్టు ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది. మ్యాచ్ ప్రారంభమైన నాటి నుంచి ముగిసే వరకు బంతిని పూర్తిస్థాయిలో భారత జట్టు తన నియంత్రణలో ఉంచుకుంది. గోల్ చేయడానికి అవకాశాలు లభించినప్పటికీ ఉపయోగించుకోలేకపోయింది.. దీంతో భారత క్రీడాకారులపై అభిమానులు మండిపడుతున్నారు. “అనామక జట్టుపై ఒక్క గోల్ కూడా చేయలేకపోయారు. పైగా ఆడుతోంది స్వదేశంలో. దిగ్గజ ఆటగాళ్లు ఉన్నప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. చేతుల్లోకి వచ్చిన అవకాశాలను కనీసం వినియోగించుకోలేకపోయారు. ఇలా అయితే భారత ఫుట్ బాల్ జట్టుకు మంచి రోజులు ఎప్పుడు వస్తాయని” సోషల్ మీడియా వేదికగా అభిమానులు మండిపడుతున్నారు.
ఈ టోర్నీలో శుక్రవారం సిరియా – మారిషస్ మధ్య రెండో మ్యాచ్ జరగనుంది. సెప్టెంబర్ 9న చివరి మ్యాచ్ భారత్ – సిరియా మధ్య జరుగుతాయి . 2018లో జరిగిన ఈ టోర్నీలో భారత్ విజేతగా నిలిచింది. గత ఏడాది టోర్నీలోనూ విజేతగా ఆవిర్భవించింది. ఈ టోర్నీ గచ్చిబౌలి స్టేడియంలో జరుగుతోంది. ఫిఫా సమానాలకు తగ్గట్టుగా ఈ స్టేడియాన్ని రూపొందించారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ 15 కోట్ల దాకా ఖర్చు చేశాయి. ఆటగాళ్లు, అధికారుల కోసం ప్రత్యేకంగా డ్రెస్సింగ్ రూమ్ లను నిర్మించారు. కొత్తగా ఫ్లడ్ లైట్స్ ఏర్పాటు చేశారు. 18 వేల బకెట్ సీట్లు ఏర్పాటు చేశారు. ఈ టోర్నీని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. హైదరాబాదులో ఈ కప్ నిర్వహించడం తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం అన్నారు. ఈ అవకాశం ఇచ్చిన ఆల్ ఇండియా ఫుట్ బాల్ ఫెడరేషన్ కు ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులోనూ ఇతర క్రీడలను హైదరాబాదులో నిర్వహిస్తామని ప్రకటించారు. అంతర్జాతీయ పోటీలకు కూడా హైదరాబాద్ నగరాన్ని వేదికగా మార్చుతామని స్పష్టం చేశారు.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read More