Paris Olympics 2024: ఒలంపిక్ క్రీడలకు టెన్నిస్ టాప్ సీడ్స్ రాం రాం.. కారణమేంటంటే

మరో 15 రోజుల్లో ప్యారిస్ వేదికగా ఒలంపిక్స్ ప్రారంభం కానున్నాయి. ఈ విశ్వ క్రీడలకు మహిళ టాప్ టెన్నిస్ సీడ్స్ డుమ్మా కొడుతున్నారు. వరల్డ్ నెంబర్ 3 అరీనా సబలంక(aryna sabalenka), ఎమ్మా రాడు కాను (Emma Raducanu) టోర్నీలో ఆడబోమని స్పష్టం చేశారు..

Written By: Anabothula Bhaskar, Updated On : June 19, 2024 10:38 am

Paris Olympics 2024

Follow us on

Paris Olympics 2024: ఒలంపిక్స్.. ఈ పేరు వినిపిస్తే చాలు.. క్రీడాకారులకు ఎక్కడా లేని ఉత్సాహం వస్తుంది. విశ్వ వేదికపై తమ ప్రతిభను చూపించేందుకు అవకాశం లభించిందనే ఆనందం వారిలో ఉంటుంది. అందుకే చాలామంది క్రీడాకారులు ఒలంపిక్స్ కోసం.. అందులో పతకాలు దక్కించుకునేందుకు ఏళ్లుగా కసరత్తులు చేస్తుంటారు. కొందరైతే మెరుగైన శిక్షణ కోసం ఇతర దేశాలకు కూడా వెళ్తుంటారు. అయితే అలాంటి విశ్వ క్రీడలకు టెన్నిస్ విభాగంలో కొంతమంది క్రీడాకారిణులు దూరంగా ఉంటున్నారు. విశ్వ వేదికపై ప్రతిభ నిరూపించుకోవాల్సిన సమయంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. దీంతో ఒలంపిక్ క్రీడలు కళ తప్పే ప్రమాదం ఉందని క్రీడా విశ్లేషకులు అంటున్నారు.

మరో 15 రోజుల్లో ప్యారిస్ వేదికగా ఒలంపిక్స్ ప్రారంభం కానున్నాయి. ఈ విశ్వ క్రీడలకు మహిళ టాప్ టెన్నిస్ సీడ్స్ డుమ్మా కొడుతున్నారు. వరల్డ్ నెంబర్ 3 అరీనా సబలంక(aryna sabalenka), ఎమ్మా రాడు కాను (Emma Raducanu) టోర్నీలో ఆడబోమని స్పష్టం చేశారు.. వైదొలిగామనే సంకేతాలు ఇచ్చేశారు. వీటితోపాటు ట్యూనియషియా సంచలన క్రీడాకారిణి ఒన్స్ జబెర్(Ons jubeur) కూడా టోర్నీకి దూరంగా ఉంటున్నట్టు ప్రకటించింది. ఇలా టాప్ సీడ్ క్రీడాకారిణులు టోర్నీకి దూరంగా ఉంటే టెన్నిస్ క్రీడలో మజా ఉండదని అభిమానులు వాపోతున్నారు..” నాకు ఆరోగ్యం బాగో లేదు. ప్యారిస్ లో పరిస్థితులకు నేను అలవాటు పడలేను. నా మోకాలి గాయం తీవ్రంగా ఉంది. ఇలాంటి సమయంలో నా ఆరోగ్యాన్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేను. అందు వల్లే ఒలంపిక్స్ లో పాల్గొనడం లేదని” జబేర్ అంటోంది. మరోవైపు జూలై 1 నుంచి పారిస్ వేదికగా ఒలంపిక్స్ మొదలుకానున్నాయి. జూలై 17 నుంచి ఆగస్టు 4 వరకు టెన్నిస్ పోటీలు జరుగుతాయి..

ఆస్ట్రేలియన్ ఓపెన్ లో సంచలన విజయం సాధించిన సబలెంక.. ఫ్రెంచ్ ఓపెన్ లో సెమీస్ వరకే ఆగిపోయింది. వాస్తవానికి ఆమె ఫ్రెంచ్ ఓపెన్ గెలుస్తుందని అభిమానులు అంచనా వేశారు. కానీ వారి అంచనాలను అందుకోవడంలో ఆమె పూర్తిగా విఫలమైంది. అనారోగ్యం, ఇతర గాయాల వల్ల ఒలంపిక్స్ లో పాల్గొనకూడదని సబలెంక నిర్ణయం తీసుకుంది. ఇదే విషయాన్ని ఆమె బెర్లిన్ లో కొంతమంది జర్నలిస్టులకు చెప్పింది. అందుకు సంబంధించిన వీడియోలను కొంతమంది సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేశారు. మరో వైపు బ్రిటన్ క్రీడాకారిణి రాడు కాను వైల్డ్ కార్డు ఎంట్రీ సాధించింది. ఈమె కూడా ఒలంపిక్స్ లో ఆడేందుకు ఆసక్తి చూపించడం లేదు. యూఎస్ ఓపెన్ లో రాడు కాను పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. ప్రారంభ మ్యాచ్ లోనే ఇంటికి వచ్చేసింది. ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న రాడు కాను పూర్తిస్థాయిలో పూర్వపు లయను అందుకునేందుకు కసరత్తు చేస్తున్నట్టు చెప్పింది. అందువల్లే ఒలంపిక్స్ కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు వెల్లడించింది. కీలక క్రీడాకారిణులు ఒలంపిక్స్ కు దూరంగా ఉండడంతో టెన్నిస్ అభిమానులు నిరాశలో కూరుకుపోయారు.