Arshdeep Singh: టి20 వరల్డ్ కప్ లో నిప్పులు చెరుగుతున్నాడు.. రాసి పెట్టుకోండి భారత్ భవిష్యత్తు ఆశాకిరణం అతడే..

తొలి బంతికే వికెట్ తీయడం టి20 చరిత్రలో ఇది 71వ సారి. భారత బౌలర్ ఈ ఘనత సాధించడం మాత్రం ఇదే ప్రథమం.. ఇక టి20 ప్రపంచ కప్ చరిత్రలో ఇన్నింగ్స్ మొదటి బంతికి వికెట్ పడగొట్టడం ఇది ఐదవ సారి.

Written By: Anabothula Bhaskar, Updated On : June 13, 2024 3:37 pm

Arshdeep Singh

Follow us on

Arshdeep Singh: టి20 వరల్డ్ కప్ లో బౌలర్లు పండగ చేసుకుంటున్నారు. వికెట్ల మీద వికెట్లు తీస్తూ అదరగొడుతున్నారు. ఇందులో భారత బౌలర్ అర్ష్ దీప్ సింగ్ రెచ్చిపోయి బౌలింగ్ చేస్తున్నాడు. ప్రస్తుత టి20 వరల్డ్ కప్ లో మూడు మ్యాచ్లలో 7 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు.. ముఖ్యంగా బుధవారం అమెరికాలో జరిగిన మ్యాచ్లో బుమ్రా వంటి బౌలర్ తేలిపోగా.. సిరాజ్ చేష్టలుడిగి చూడగా..అర్ష్ దీప్ సింగ్ మాత్రం అదిరిపోయే రేంజ్ లో బౌలింగ్ వేసాడు. ఏకంగా తొమ్మిది పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. అద్భుతమైన లైన్, లెంగ్త్ తో బౌలింగ్ వేస్తూ అమెరికన్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. అమెరికన్ ఇన్నింగ్స్ లో.. తొలి బంతికే వికెట్ తీసి అర్ష్ దీప్ సింగ్ ఔరా అనిపించాడు. అమెరికన్ ఓపెనర్ షయన్ జహంగీర్ (0) ను వికెట్ల ముందు బోల్తా కొట్టించి, గోల్డెన్ డక్ గా వెనక్కి పంపించాడు. ఈ వికెట్ ద్వారా అంతర్జాతీయ టి20లో ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్ కు వికెట్ తీసిన తొలి భారతీయ బౌలర్ గా అర్ష్ దీప్ సింగ్ వినతికెక్కాడు. టీమిండియా టి20ల్లోకి 18 సంవత్సరాల క్రితం ఎంట్రీ ఇచ్చింది. ఇందులో 222 మ్యాచులు పూర్తి చేసుకుంది. ఇప్పటివరకు ఏ బౌలర్ అందుకోలేని ఘనత అర్ష్ దీప్ సింగ్.. తొలి బంతికే వికెట్ తీసిన రికార్డ్ సొంతం చేసుకోవడం విశేషం.

తొలి బంతికే వికెట్ తీయడం టి20 చరిత్రలో ఇది 71వ సారి. భారత బౌలర్ ఈ ఘనత సాధించడం మాత్రం ఇదే ప్రథమం.. ఇక టి20 ప్రపంచ కప్ చరిత్రలో ఇన్నింగ్స్ మొదటి బంతికి వికెట్ పడగొట్టడం ఇది ఐదవ సారి. 2014 t20 ప్రపంచ కప్ లో బంగ్లాదేశ్ బౌలర్ మోర్తాజా తొలిసారి ఈ ఘనత సాధించాడు. ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్ మహమ్మద్ షహజాద్ ను తొలి బంతికి అవుట్ చేశాడు. ఇక ఇదే టోర్నీలో షాపూర్ జెడ్రాన్ అనే బౌలర్ ఈ ఘనతను నమోదు. 2021 లో నమిబియా బౌలర్ రూబెన్ ఈ ఘనత సొంతం చేసుకున్నాడు.. ఇక టి20 వరల్డ్ కప్ లో మరోసారి నమీబియా బౌలర్ రూబెన్, భారత పేస్ బౌలర్ అర్ష్ దీప్ సింగ్ ఈ ఫీట్ అందుకున్నారు.. ఇది మాత్రమే కాకుండా t20 ప్రపంచ కప్ లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన భారత బౌలర్ గా అర్ష్ దీప్ సింగ్ రికార్డు సృష్టించాడు.. రవిచంద్రన్ అశ్విన్ 4/11, హర్భజన్ సింగ్ 4/12, ఆర్పి సింగ్ 4/13, జహీర్ ఖాన్ 4/19, ప్రజ్ఞాన్ ఓఝా 4/21 ల ఘనతలను బ్రేక్ చేసి..అర్ష్ దీప్ సింగ్ సరికొత్త రికార్డు సృష్టించాడు.

అర్ష్ దీప్ సింగ్ వేగంగా బంతులు వేయడం, వికెట్లను గురి చూసి సంధించడంతో భారత జట్టుకు మరో బుమ్రా దొరికాడని అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు..”అతడి బౌలింగ్ చూస్తుంటే ముచ్చటేస్తోంది. వేగంగా బంతులు వేస్తుంటే ఆనందం అనిపిస్తోంది. ఇతగాడు తన ప్రతిభకు మరింత పదును పెట్టుకుంటే ఇంకా ఎక్కువ రాటు తేలుతాడు. అప్పుడు టీమిండియా కు పెద్దగా ఇబ్బంది ఉండదు. ఇలాంటి ఆటగాళ్లే భారత పేస్ దళాన్ని ముందుండి నడిపించాలని” అభిమానులు సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యానిస్తున్నారు..”రాసి పెట్టుకోండి..అర్ష్ దీప్ సింగ్ భారత బౌలింగ్ కు భవిష్యత్తు ఆశా కిరణంగా నిలుస్తాడని” కామెంట్స్ చేస్తున్నారు..