Homeక్రీడలుArgentina vs Canada: మిల మిల మెరిసిన మెస్సీ.. కోపా అమెరికా ఫుట్ బాల్ కప్...

Argentina vs Canada: మిల మిల మెరిసిన మెస్సీ.. కోపా అమెరికా ఫుట్ బాల్ కప్ సెమీస్ లో అర్జెంటీనా సంచలనం..

Argentina vs Canada: 2022 ఖతార్ లో జరిగిన సాకర్ ఫుట్ బాల్ కప్ టోర్నీ ఫైనల్ మ్యాచ్ లో ఫ్రాన్స్ పై విజయం సాధించి అర్జెంటీనా విశ్వవిజేతగా ఆవిర్భవించింది. ఆ మ్యాచ్ లో మెస్సీ తన మాయాజాలాన్ని ప్రదర్శించాడు. ఫ్రాన్స్ జట్టుకు కల్లోల రాత్రిని మిగిల్చాడు. సరిగ్గా రెండు సంవత్సరాల తర్వాత అదే స్థాయిలో ఆటను ప్రదర్శించాడు. కోపా అమెరికా ఫుట్ బాల్ కప్ టోర్నీలో తన మాయాజాలాన్ని ప్రత్యర్థి జట్టుకు రుచి చూపించాడు. ఫలితంగా నువ్వా నేనా అన్నట్టుగా జరిగిన సెమీస్ లో కెనడా జట్టును అర్జెంటీనా 2-0 తేడాతో ఓడించి.. ఫైనల్ దూసుకెళ్లింది. ఆట 54 నిమిషంలో మెస్సి కళ్ళు చెదిరే గోల్ సాధించడంతో అర్జెంటీనా తిరుగులేని విజయాన్ని అందుకుంది. ఈ గోల్ ద్వారా అంతర్జాతీయ 109వ గోల్ ను తన ఖాతాలో వేసుకున్నాడు మెస్సీ. అంతర్జాతీయ ఫుట్ బాల్ కప్ చరిత్రలో అత్యధిక గోల్ సాధించిన ఆటగాడిగా క్రిస్టియానో రొనాల్డో (130) మాత్రమే మెస్సీ కంటే ముందున్నాడు. మరో 28 గోల్స్ చేస్తే చాలు రొనాల్డో ను మెస్సీ అధిగమిస్తాడు. ప్రస్తుత ఫామ్ ప్రకారం చూసుకుంటే మెస్సీ రొనాల్డో ను అధిగమించడం పెద్ద కష్టం కాదని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.

ఇక కెనడాతో జరిగిన మ్యాచ్లో అర్జెంటీనా పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఆట ప్రారంభం నుంచి చివరిదాకా బంతిపై అద్భుతమైన నియంత్రణను కొనసాగించింది. ప్రత్యర్థి జట్టు గోల్ పోస్ట్ పై పదేపదే దాడులు చేసింది. ఆట 22వ నిమిషంలో జులియన్ అల్వారేజ్ గోల్ చేయడంతో.. అర్జెంటీనా ఖాతాను మొదలుపెట్టింది. ప్రత్యర్థి ఆటగాళ్ల వైఫల్యాన్ని తనకు అనుకూలంగా మలుచుకుంటూ.. పెనాల్టీ ప్లేస్ నుంచి మెరుపు కిక్ తో అల్వారేజ్ గోల్ సాధించాడు. మెరుపు వేగంతో అతడు కిక్ కొట్టడంతో ప్రత్యర్థి ఆటగాళ్లు చూస్తూ ఉండిపోయారు. వాస్తవానికి అతడు తన్నిన బంతి ప్రత్యర్థి జట్టు గోల్ కీపర్ కాళ్ళ సందులో నుంచి నెట్స్ లోకి వెళ్లిపోవడం విశేషం.

తొలి గోల్ సాధించిన అనంతరం అర్జెంటీనా మరింత వేగంగా ఆడింది. బంతి పై పూర్తిస్థాయిలో నియంత్రణను సాధించింది. ముఖ్యంగా ఆటగాళ్లు మైదానంలో అత్యంత వేగంగా పరిగెత్తారు.. డ్రిబ్లింగ్ నైపుణ్యాలతో ఆకట్టుకున్నారు. మెస్సి అయితే తనకు మాత్రమే సాధ్యమైన కిక్ లతో అభిమానులను అలరించాడు.. ఈలోగా తొలి అర్ధభాగం పూర్తయింది. ఇక రెండవ అర్ద భాగంలో మెస్సీ తన విశ్వరూపాన్ని చూపించాడు. కిక్, డ్రిల్లింగ్ తో ప్రత్యర్థి ఆటగాళ్లను ఉక్కిరి బిక్కిరి చేశాడు. బంతి పై పూర్తిస్థాయిలో పట్టు సాధించి గోల్ సాధించాడు. గోల్డ్ పోస్ట్ కు దగ్గర నుంచే బంతిని లోపలికి పంపించి.. మెస్సి తన జట్టుకు తిరుగులేని ఆధిక్యాన్ని అందించాడు. దీంతో అర్జెంటీనా 2-0 తేడాతో కెనడాపై ఘనవిజయం సాధించింది.

ఈ మ్యాచ్లో కెనడా జట్టు నుంచి అర్జెంటీనా జట్టుకు తీవ్ర ప్రతిఘటన ఎదురవుతుందని అందరూ అనుకున్నారు. వాస్తవానికి కెనడా జట్టు ఈమధ్య ఆడిన మ్యాచ్ లలో వరుస విజయాలు సాధించి, అద్భుతమైన ఫామ్ లో ఉంది. ఈ నేపథ్యంలో ఆ జట్టు అర్జెంటీనాను ఓడించడం ఖాయమని విశ్లేషకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కానీ అవన్నీ తప్పని అర్జెంటీనా ఆటగాళ్లు నిరూపించారు. మెస్సీ మైదానంలో చిరుత పులిలాగా కదులుతుంటే.. మిగతా ఆటగాళ్లు కూడా అతడినే అనుకరించారు.. ఇక ఈ గెలుపుతో వరుసగా అర్జెంటీనా పదవ విజయం సాధించింది. కెనడాపై గోల్ చేయడం ద్వారా.. అర్జెంటీనా తరఫున గత 25 మ్యాచ్ లలో 28 గోల్స్ చేసిన చరిత్రను మెస్సీ తన పేరు మీద లిఖించుకున్నాడు. కోపా అమెరికా టోర్నీలో మెస్సీ కి ఇది 14వ గోల్. ఈ విజయం ద్వారా కోపా అమెరికా ఫుట్ బాల్ టోర్నీలో అర్జెంటీనా ఫైనల్ వెళ్ళింది. ఇక గురువారం జరిగే రెండో సెమీస్ మ్యాచ్ లో ఉరుగ్వే – కొలంబియా జట్లు తలపడతాయి.. ఇందులో గెలిచిన జట్టుతో అర్జెంటీనా ఫైనల్ మ్యాచ్ ఆడుతుంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular