https://oktelugu.com/

Anil Kumble: ఐపీఎల్ 2009 ఫైనల్ : ఆర్సీబీ పాత గాయాన్ని మళ్లీ గుర్తు చేసిన అనిల్ కుంబ్లే

దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో గిల్ క్రిస్ట్ నేతృత్వంలోని హైదరాబాద్ జట్టు ఆరు వికెట్లకు 143 పరుగులు చేసింది.. ఈ మ్యాచ్లో బెంగళూరు బౌలర్ అనిల్ కుంబ్లే అద్భుతంగా బౌలింగ్ చేశాడు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : April 25, 2024 / 02:59 PM IST

    Anil Kumble

    Follow us on

    Anil Kumble: ఐపీఎల్ 16 సీజన్లు పూర్తయ్యాయి. 17వ సీజన్ విజయవంతంగా కొనసాగుతోంది. ఈ 16 సీజన్లలో ఇంతవరకూ ఐపీఎల్ కప్ దక్కించుకోని జట్లు ఏవైనా ఉన్నాయంటే అవి పంజాబ్, బెంగళూరు మాత్రమే. ఈ రెండు జట్లల్లో బెంగళూరు 2009, 2016లో ఫైనల్ చేరినప్పటికీ, కప్ దక్కించుకోలేకపోయింది. ముఖ్యంగా 2009లో దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో హైదరాబాద్ చేతిలో బెంగళూరు ఓడిపోయింది. ఈ ఓటమిని తలచుకుని ఆ జట్టు కెప్టెన్ అనిల్ కుంబ్లే ఇప్పటికి బాధపడుతూనే ఉంటాడు. ఆ మ్యాచ్ కు సంబంధించి అనిల్ కుంబ్లే.. ప్రముఖ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ తో యూ ట్యూబ్ చాట్ లో పలు కీలక విషయాలు వెల్లడించాడు.

    దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో గిల్ క్రిస్ట్ నేతృత్వంలోని హైదరాబాద్ జట్టు ఆరు వికెట్లకు 143 పరుగులు చేసింది.. ఈ మ్యాచ్లో బెంగళూరు బౌలర్ అనిల్ కుంబ్లే అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కేవలం 16 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అయినప్పటికీ హైదరాబాద్ ఆ మ్యాచ్లో గెలిచింది. ఈ మ్యాచ్లో హైదరాబాద్ విజయం సాధించిందని చెప్పేకంటే.. బెంగళూరు చేజేతులా ఓడిపోయిందనడం సబబు. “నాకు ఇప్పటికీ గుర్తుంది. మాకు అందివచ్చిన అవకాశాలను మొత్తం దూరం చేసుకున్నాం. ప్రవీణ్ కుమార్ 5 వైడ్లు వేశాడు. అతని బౌలింగ్ వల్ల మాకు తీరని నష్టం వాటిల్లింది. అయినప్పటికీ మేము హైదరాబాద్ చేసిన స్కోర్ ను చేజ్ చేయాలనుకున్నాం. చివరి ఓవర్లో మా విజయానికి 15 రన్స్ కావాల్సి వచ్చింది. నేను స్ట్రైక్ లో ఉన్నాను. మరో ఎండ్ లో రాబిన్ ఊతప్ప ఉన్నాడు. ఆర్పీ సింగ్ బౌలింగ్ చేశాడు. తొలి బంతిని నేను ఎదుర్కొన్నాను. సింగిల్ తీసి ఊతప్పకు స్ట్రైకింగ్ ఇచ్చాను. అతడు ఎందుకనో కనెక్ట్ కాలేకపోయాడు. రెండు బాల్స్ ను డాట్ గా మిగిల్చాడు. నేను ఇప్పటికీ రాబిన్ ఊతప్పను చూసినప్పుడల్లా రాబ్స్… ఆ సిక్స్ అంటాను.. కనీసం నాకు స్ట్రైకింగ్ ఇచ్చినా ఏదో విధంగా బ్యాటింగ్ చేసేవాన్ని. నేను అప్పటికి అతనికి చెబుతూనే ఉన్నాను.. ఒకానొక దశలో వేడుకున్నాను.. స్కూప్ చేయవద్దని విన్నవించుకున్నాను. కానీ అతడు వినిపించుకోలేదు. నాకు స్ట్రైక్ ఇస్తే స్లాగ్ చేస్తానని కూడా అన్నాను. కానీ అలా జరిగిపోయింది. చివరికి ఆరు పరుగుల తేడాతో ఓడిపోయామని” అనిల్ కుంబ్లే రవిచంద్రన్ అశ్విన్ తో పేర్కొన్నాడు.

    ఇక ప్రస్తుత సీజన్లో బెంగళూరు వరుసగా ఐదు మ్యాచ్లు ఓడిపోయింది. 8 మ్యాచ్ లు ఆడిన ఆ జట్టు కేవలం ఒకే ఒక విజయాన్ని అందుకుంది. పాయింట్ల పట్టికలో దిగువ స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటికే ప్లే ఆఫ్ అవకాశాలను ఆ జట్టు కోల్పోయింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలలో పటిష్టంగా కనిపిస్తున్నప్పటికీ.. ఆ జట్టును దురదృష్టం వెంటాడుతోంది. ఈ ఏడాది జరిగిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో బెంగళూరు మహిళల జట్టు కప్ గెలుచుకుంది. ఈ నేపథ్యంలో పురుషుల జట్టు కూడా కప్ సాధిస్తుందని అందరూ భావించారు. కానీ, వారందరి అంచనాలను డూ ప్లేసిస్ ఆధ్వర్యంలోని పురుషుల జట్టు అందుకోలేకపోయింది. దారుణమైన ఆటతీరుతో అభిమానులను నిరాశ పరుస్తోంది.