Women’s Odi World Cup 2025: క్రికెట్లో మొన్నటివరకు పురుషుల ఆధిపత్యం కొనసాగేది. వాస్తవానికి ఈ క్రీడలోకి మహిళలు ఎప్పుడో ప్రవేశించినప్పటికీ.. వారి ఆటకు అంతగా ప్రాధాన్యం లభించేది కాదు. అయితే ఐసీసీ మహిళల క్రికెట్ ను కూడా ప్రోత్సహించడం మొదలుపెట్టడంతో పరిస్థితి ఒకసారి గా మారిపోయింది. దీనికి తోడు పురుషులతో తగ్గట్టుగానే ప్రైజ్ మనీ ప్రకటిస్తుండడంతో మహిళల క్రికెట్ కు కూడా ఆదరణ పెరుగుతోంది. వర్ధమాన మహిళా క్రికెటర్లకు అవకాశాలు పెరుగుతున్నాయి. కార్పొరేట్ కంపెనీలు మహిళల క్రికెట్ కు స్పాన్సర్ చేయడానికి ముందుకొస్తున్నాయి.
ఈనెల 30 నుంచి మహిళల వన్డే వరల్డ్ కప్ జరగనుంది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఈ టోర్నీ కి ఆతిధ్యం ఇస్తున్నాయి. అయితే ఈసారి అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలి సరికొత్త నిబంధనలను తెరపైకి తీసుకువచ్చింది. ఈ టోర్నీలో అంపైర్లు, మ్యాచ్ రిఫరల్ గా మహిళలు మాత్రమే ఉంటారు. దీంతో ఈ వరల్డ్ కప్ మొత్తం మహిళలతోనే నిర్వహిస్తున్నారు. గతంలో టి20 వరల్డ్ కప్ జరిగినప్పుడు.. కామన్వెల్త్ గేమ్స్ లో అంపైర్లు, రిపరిలుగా మహిళలనే నియమించారు. అదే విధానాన్ని ప్రస్తుత వన్డే వరల్డ్ కప్ లో కొనసాగించనున్నారు. భారత్, శ్రీలంక ఆతిథ్యంలో వరల్డ్ కప్ సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ రెండు వరకు కొనసాగుతుంది.
మహిళల ఆధ్వర్యంలోనే వన్డే వరల్డ్ కప్ నిర్వహించడం ద్వారా సరికొత్త చరిత్రకు ఐసీసీ శ్రీకారం చుడుతోంది. దీనివల్ల మహిళల ఆటలో పురుషుల పెత్తనం లేకుండా చూస్తోంది. దీనివల్ల అంపైర్లకు, రిఫరీలకు ఉపాధి లభిస్తుందని ఐసిసి అంచనా వేస్తోంది. ఇప్పటికే మహిళ అంపైర్లకు, రిఫరీలకు శిక్షణ ఇచ్చినట్టు తెలుస్తోంది.. ఈ వరల్డ్ కప్ లో మహిళ అంపైర్లు, రిఫరీలు వారి బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తే.. భవిష్యత్ కాలంలో నిర్వహించే టోర్నీలు వారి ఆధ్వర్యంలోనే సాగుతాయని ఐసీసీ చెబుతోంది. “మహిళలు అన్ని రంగాలలో రాణించాలనేదే మా ఉద్దేశం. అందువల్లే అవకాశాలు కల్పిస్తున్నాం. ఈ వరల్డ్ కప్ ద్వారానే దానిని మొదలు పెడుతున్నాం. ఇందులో గనుక వారు విజయవంతం అయితే ఇదే విధానాన్ని కొనసాగిస్తుంటాం. పెద్దగా ఇబ్బందులు ఎదురుకావని ఆశిస్తున్నాం. ఈ అవకాశాన్ని మహిళలు ఉపయోగించుకుంటారని భావిస్తున్నామని” ఐసీసీ పెద్దలు చెబుతున్నారు.