WPL – 2024 – Amelia Care : అసలే 20 ఓవర్ల మ్యాచ్. పైగా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ టోర్నీ. వేలాది మంది ప్రేక్షకులు చూస్తున్నారు. జట్టును ఎలాగైనా మరోసారి గెలిపించాలనే కసి ఆమెది. అందుకే జెంటిల్మెన్ గేమ్ లో జెంటిల్ ఉమెన్ లాగా ఆడింది. తన జట్టును ఒంటి చేత్తో గెలిపించుకుంది.. ఫలితంగా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో తన జట్టుకు రెండవ విజయాన్ని కట్టబెట్టింది. అటు బంతి, ఇటు బ్యాట్ తో మెరిసి ఔరా అనిపించింది.
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ముంబై జట్టు వరుసగా రెండవ విజయాన్ని నమోదు చేసింది. బెంగళూరు వేదికగా ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ జట్టు వరుసగా రెండవ విజయాన్ని దక్కించుకుంది. గుజరాత్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ముంబై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసింది. ముంబై బౌలర్ల ధాటికి గుజరాత్ టాప్ ఆర్డర్ విఫలమైనప్పటికీ.. తనూజ (28), కేథరిన్ (25 నాట్ అవుట్) ఎనిమిదో వికెట్ కు రికార్డు స్థాయిలో 48 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో గుజరాత్ ఆ మాత్రం స్కోరయినా సాధించింది. గుజరాత్ లో బెత్ మూన్ (24) పరుగులతో రాణించింది. కేర్(4/17), షబ్నిమ్ ఇస్మాయిల్(3) ధాటికి గుజరాత్ జట్టు వణికిపోయింది..
127 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన ముంబై జట్టుకు అదిరిపోయే ఆరంభం లభించలేదు. యాస్తిక(7), మాథ్యూస్ (7) వెంట వెంటనే అవుట్ అయ్యారు. దీంతో గుజరాత్ జట్టు బౌలర్లు ఒక్కసారిగా మ్యాచ్ పై పట్టు బిగించే ప్రయత్నం చేశారు.. ఈ క్రమంలో సివర్ బ్రంట్(22), కెప్టెన్ హర్మన్ ప్రీత్ గుజరాత్ బౌలర్లను ప్రతిఘటించడంతో పవర్ ప్లే ముగిసేసరికి ముంబై రెండు వికెట్ల నష్టానికి 39 పరుగులు చేసింది. స్కోర్ వేగం పుంజుకునే క్రమంలో బ్రంట్ రన్ ఔట్ అయింది. దీంతో ఒక్కసారిగా ముంబై జట్టులో టెన్షన్ పెరిగిపోయింది. బ్రంట్ రన్ ఔట్ కావడంతో మూడో వికెట్ కు 28 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. బ్రంట్ ఔట్ అయిన తర్వాత కెర్ క్రీజ్ లోకి వచ్చింది. హర్మన్, కెర్ ధాటిగా ఆడి నాలుగో వికెట్ కు 66 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కెర్ ఎల్బీడబ్ల్యూ గా ఔట్ అయినప్పటికీ హర్మన్ చివరి వరకు నిలిచి 11 బంతులు మిగిలి ఉండగానే ముంబై జట్టును గెలిపించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారాన్ని దక్కించుకుంది.
గుజరాత్ 20 ఓవర్లలో 126/9. తనూజ 28, కేథరిన్ 25 నాట్ అవుట్. కెర్ 4/17, షబ్నిం 3/18.
ముంబై 18.1 ఓవర్లలో 129/ 5. హర్మాన్ 46 నాట్ అవుట్, కెర్ 31, తనూజ 2/21.