Ambati Rayudu Commentary: క్రికెట్ ద్వారా లైమ్ లైట్ లోకి వచ్చిన ప్లేయర్లలో చాలామంది రిటైర్మెంట్ అయిన తర్వాత.. వ్యాఖ్యానం ద్వారా అభిమానులకు మరింత చేరువ అవుతున్నారు. అలా చేరువ అయిన వారిలో అంబటి రాయుడు ఒకరు. తెలుగు వాడైనా అంబటి రాయుడు.. బీసీసీఐలో నెలకొన్న రాజకీయాల వల్ల తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ఐపీఎల్ లాంటి టోర్నీలలో సత్తా చాటినప్పటికీ.. జాతీయ జట్టులో మాత్రం ఇమడలేకపోయాడు.. ఇక ఐపీఎల్ కు కూడా అతడు వీడ్కోలు పలికాడు. ఆమధ్య రాజకీయ ప్రవేశం చేస్తానని తెరపైకి వచ్చినప్పటికీ.. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో వెనక్కి తగ్గాడు. ఇక ప్రస్తుతం క్రికెట్ కామెంటేటర్ గా కనిపిస్తున్నాడు అంబటి రాయుడు. అయితే తన నోటి మీద అదుపు లేకపోవడంతో వివాదాస్పదమైన వ్యాఖ్యాతగా అతడు పేరు తెచ్చుకున్నాడు. ఐపీఎల్ ప్రస్తుత సీజన్ లో పున: ప్రారంభమైన తర్వాత కామెంట్రీ ప్యానెల్ లో అంబటి రాయుడు కనిపించడం లేదు.
Also Read: గిల్ సేన పై గెలిచినా.. ముంబైని కలవర పెడుతున్న గత క్వాలిఫైయర్ -2 రికార్డులు..
ఉగ్రవాద దేశంతో ఏర్పడిన విపత్కర పరిస్థితుల నేపథ్యంలో భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టాల్సి వచ్చింది. ఆ సమయంలో అంబటి రాయుడు చేసిన పనికిమాలిన ట్వీట్ దేశవ్యాప్తంగా పెను దుమారానికి కారణమైంది. నాడు అతడు దేశంలో ఉన్న పరిస్థితులను గుర్తించలేక ఏదో ఒక కొటేషన్ ట్వీట్ చేశాడు. అది కాస్త మనదేశ నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది. దీంతో చాలామంది రాయుడి ప్రవర్తనను తప్పు పట్టారు. తన అపరాధాన్ని చివరికి తెలుసుకోవడంతో రాయుడు ట్వీట్ల ద్వారా వివరణ ఇచ్చినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. ఇక అతడి మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న కన్నడ అభిమానులు బీభత్సంగా సోషల్ మీడియాలో విమర్శలు చేశారు. ఇక ప్రస్తుతం ఐపీఎల్ మళ్లీ మొదలైనప్పటికీ కామెంట్రీ ప్యానల్ లో రాయుడు కనిపించడం లేదు. బిసిసిఐ రాయుడు పై ఎటువంటి చర్యలు తీసుకున్నట్టు కల్పించడం లేదు. దీనిపై అధికారిగా ప్రకటన కూడా వెలువడలేదు. అయితే ఈ నిర్ణయం రాయుడు తీసుకున్నాడా? లేదా బ్రాడ్ కాస్టర్ తీసుకున్నారా? అనే విషయాలపై క్లారిటీ లేదు.
కామెంట్రీ చేస్తున్నప్పుడు రాయుడు తన పక్షపాతాన్ని చెన్నై జట్టుపై చూపించేవాడు. ధోని పై అపారమైన ప్రేమను కనబరిచేవాడు. ఇదే విషయాన్ని పలు సందర్భాల్లో అతడు బహిరంగంగా ఒప్పుకున్నాడు. అయితే కన్నడ జట్టును అనేక సందర్భాల్లో రాయుడు తక్కువ చేసినట్టు మాట్లాడేవాడు. ఆ జట్టుకు సంబంధించిన అభిమానులను రెచ్చగొట్టేవాడు. అయితే అతడి వ్యాఖ్యానం పట్ల సోషల్ మీడియాలో విపరీతంగా విమర్శలు వచ్చేవి. న్యూట్రల్ గా కామెంట్రీ చేయాలనే నిబంధనలు ఉన్నప్పటికీ రాయుడి పట్టించుకునేవాడు కాదు. ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న తర్వాత రాయుడిని బహుశా బీసీసీఐ పెద్దలు కామెంట్రీ కి దూరంగా ఉండాలని సూచించినట్టు తెలుస్తోంది. మరోవైపు రాయుడు తన గైర్హాజరపై ఎటువంటి ప్రకటన చేయలేదు. ఇక సోషల్ మీడియాలో రాయుడు విరాట్ కోహ్లీ వీడ్కోలు పై చివరిసారిగా పోస్ట్ చేశాడు. ఇక ప్రస్తుతం బెంగళూరు ఐపిఎల్ ఫైనల్లో అడుగుపెట్టిన తర్వాత.. రాయుడు గురించి కన్నడ అభిమానులు తెగ శోధిస్తున్నారు. ఇన్ని రోజులపాటు తమ జట్టును ఇష్టానుసారంగా తిట్టిన వ్యక్తి ఎక్కడ ఉన్నాడంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ సీజన్ మొదట్లో బెంగళూరు ఎట్టి పరిస్థితిలో టైటిల్ గెలవదని రాయుడు స్పష్టం చేశాడు. అయితే ఆ తర్వాత తన అభిప్రాయాన్ని మార్చుకున్నప్పటికీ.. బెంగళూరు అభిమానులు మాత్రం అతడిని వదిలిపెట్టడం లేదు.