Google Store India : టెక్ దిగ్గజం గూగుల్ భారతీయ వినియోగదారులకు గుడ్ న్యూస్ అందించింది. తమ ఉత్పత్తులను ఇకపై నేరుగా ఇండియాలో అమ్మడానికి కీలక ముందడుగు వేసింది. ఇప్పటివరకు ఈ-కామర్స్ సైట్లు, పెద్ద రిటైల్ చైన్‌ల ద్వారా మాత్రమే అందుబాటులో ఉన్న గూగుల్ పిక్సెల్ ఫోన్లు, ఇతర గ్యాడ్జెట్‌లను, ఇప్పుడు వినియోగదారులు నేరుగా గూగుల్ ఇండియా స్టోర్ నుంచే కొనుగోలు చేయవచ్చు. ఇది వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులతో పాటు, ఆకర్షణీయమైన ఆఫర్లను అందించేందుకు గూగుల్ చేసిన ఒక పెద్ద ప్రయత్నం.
ఇప్పటివరకు ఫ్లిప్‌కార్ట్, క్రోమా, రిలయన్స్ డిజిటల్ వంటి ఈ-కామర్స్ సంస్థల ద్వారా గూగుల్ తన ఉత్పత్తులను విక్రయించేది. అయితే, ఇప్పుడు గూగుల్ తన ప్రత్యేక వెబ్‌సైట్‌ను భారత్‌లో లాంచ్ చేసింది. ఈ వెబ్‌సైట్ ద్వారా కస్టమర్‌లు తమకు నచ్చిన పిక్సెల్ స్మార్ట్‌ఫోన్లు, పిక్సెల్ వాచ్‌లు, పిక్సెల్ బడ్స్ వంటి వాటిని నేరుగా ఆర్డర్ చేసుకోవచ్చు. దీనివల్ల మధ్యవర్తులు లేకుండా నేరుగా కంపెనీ నుంచే ఉత్పత్తిని పొందడం, మెరుగైన సర్వీస్ పొందడం సాధ్యమవుతుంది.
లాంచింగ్ సందర్భంగా గూగుల్ ఇండియా స్టోర్ పలు ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. స్టోర్ డిస్కౌంట్లు, గూగుల్ స్టోర్ క్రెడిట్, ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్, ఎక్స్ఛేంజ్ బోనస్ వంటి సదుపాయాలు అందిస్తున్నారు. అంతేకాదు, గూగుల్ స్టోర్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ ద్వారా కస్టమర్‌లు తమ పాత ఫోన్‌లను (యాపిల్, శాంసంగ్, రియల్‌మీ, వన్‌ప్లస్ లేదా ఇతర కంపెనీలవి) ఎక్స్ఛేంజ్ చేసి, కొత్త గూగుల్ పిక్సెల్ ఫోన్‌లను డిస్కౌంట్‌తో పొందవచ్చు. దీనికోసం గూగుల్ క్యాషిఫై (Cashify) అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది.
కస్టమర్‌లు గూగుల్ ఇండియా స్టోర్‌లో తమకు కావాల్సిన పిక్సెల్ ఫోన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. తర్వాత తమ పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేస్తే ఎంత విలువ వస్తుందో అంచనా వేస్తారు. అనంతరం, పాత ఫోన్‌ను పికప్ చేసుకోవడానికి ఒక షెడ్యూల్ కేటాయించాలి. కొత్త గూగుల్ పిక్సెల్ ఫోన్ డెలివరీ చేసేటప్పుడు, పాత ఫోన్‌ను తీసుకుంటారు. ఎక్స్ఛేంజ్ విలువ పోగా మిగిలిన మొత్తాన్ని వినియోగదారుడు చెల్లించాల్సి ఉంటుంది.
గూగుల్ ప్రొడక్ట్స్‌ను గూగుల్ స్టోర్ ద్వారా కొనుగోలు చేసేవారు HDFC క్రెడిట్ కార్డుల సహాయంతో ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. అంతేకాదు, కొన్ని పిక్సెల్ ఫోన్‌లపై ఏకంగా 24 నెలల (రెండేళ్ల) వరకు నో-కాస్ట్ EMI సౌకర్యం అందిస్తున్నారు. పిక్సెల్ బడ్స్ ప్రో 2, పిక్సెల్ వాచ్ 3 వంటి డివైస్‌లపై 12 నెలల (ఒక ఏడాది) వరకు నో-కాస్ట్ EMI సదుపాయం కల్పిస్తున్నారు. ఈ స్టోర్ ద్వారా గూగుల్ పిక్సెల్ ఫోన్లు లేదా ఇతర ప్రొడక్ట్‌లను కొనుగోలు చేసిన వినియోగదారులకు 24 గంటల పాటు కస్టమర్ సపోర్ట్ అందుబాటులో ఉంటుందని గూగుల్ స్పష్టం చేసింది. స్టోర్ లాంచింగ్ సందర్భంగా అందిస్తున్న పూర్తి డిస్కౌంట్లు, ఆఫర్ల వివరాలను గూగుల్ అధికారిక వెబ్‌సైట్‌లో చూడవచ్చు.