IND VS BAN T20 Series : తెలుగు ఆటగాడు, యువ ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డికి ఎట్టకేలకు బంగ్లా t20 సిరీస్ కు అవకాశం లభించింది.. అతడు గత జూలైలో జరిగిన జింబాబ్వే టి20 సిరీస్ కు ఎంపికైనప్పటికీ.. గాయం కావడంతో ఆడలేకపోయాడు. శ్రీలంక సిరీస్ కు అతడు పూర్తిస్థాయిలో సిద్ధం కాలేకపోయాడు. ఆ తర్వాత కోలుకొని దులీప్ ట్రోఫీలో సత్తా చాటాడు.. అయితే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోవడంతో నితీష్ కుమార్ రెడ్డికి అవకాశం లభించదని అందరూ భావించారు.. కానీ యాదృచ్ఛికంగా టి20 సిరీస్ కు అతనికి అవకాశం ఇచ్చి బీసీసీఐ సెలక్టర్లు అందర్నీ ఆశ్చర్యలో ముంచెత్తారు. ఇక 2021 t20 వరల్డ్ కప్ లో భారత జట్టు తరఫున వరుణ్ చక్రవర్తి చివరిసారిగా ఆడాడు. మళ్లీ ఇన్నాళ్లకు అతడు జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చాడు.. ఇక ఇటీవలి ఐపీఎల్లో అత్యంత వేగంగా బంతులు వేసిన పేస్ బౌలర్ మాయాంక్ యాదవ్ కూడా స్థానం సంపాదించుకున్నాడు. వీళ్లు మాత్రమే కాకుండా హైదరాబాద్ జట్టు విధ్వంసకరమైన ఆటగాడు అభిషేక్ శర్మ, కోల్ కతా బౌలర్, ఫ్లయింగ్ కిస్ స్టార్ హర్షిత్ రాణా, యంగ్ వికెట్ కీపర్ జితేష్ శర్మ కూడా జట్టులో స్థానం సంపాదించుకున్నారు. గిల్, జైస్వాల్ కు విశ్రాంతి లభించింది. అయితే తిరిగి స్థానం దక్కుతుందని భావించిన ఇషాన్ కిషన్ కు మరోసారి నిరాశ ఎదురయింది.. రుతు రాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, ఆవేశ్ ఖాన్ ను సెక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు. అక్టోబర్ 6 నుంచి 3 t20 మ్యాచ్ ల సిరీస్ మొదలవుతుంది. గ్వాలియర్ లో తొలి టీ20, 9న ఢిల్లీ వేదికగా రెండవ టి20, 12న హైదరాబాద్ వేదికగా మూడవ టి20 జరుగుతుంది.
వీళ్లకు నిరాశ
ఐపీఎల్ లో కోల్ కతా జట్టును విజేతగా నిలిపిన శ్రేయస్ అయ్యర్ కు అవకాశం దక్కలేదు. కీలక ఆటగాళ్లు గిల్, జైస్వాల్ కు విశ్రాంతి ఇచ్చిన నేపథ్యంలో అయ్యర్ ను ఎంపిక చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే అతడిని ఎంపిక చేయకపోవడంతో మరోసారి నిరాశ తప్పలేదు. త్వరలో ఆస్ట్రేలియా పర్యటన నేపథ్యంలో గిల్, జైస్వాల్ కు విశ్రాంతి ఇచ్చారని తెలుస్తోంది.. టీమిండియా స్టార్ బౌలర్లు బుమ్రా, సిరాజ్ లాంటి వాళ్లకు కూడా విశ్రాంతి ఇచ్చారు. ఆస్ట్రేలియా టూర్ నాటికి ఆటగాళ్లు గాయాల బారిన పడకుండా కాపాడుకోవాలని బీసీసీఐ భావిస్తోంది. ఇందులో భాగంగానే కీలక ఆటగాళ్లకు బంగ్లా t20 సిరీస్ కు దూరంగా ఉంచినట్టు తెలుస్తోంది.
భారత జట్టు ఇదీ
సూర్య కుమార్ యాదవ్ (కెప్టెన్) , సంజు శాంసన్, హార్థిక్ పాండ్యా, రింకు సింగ్, నితీష్ కుమార్ రెడ్డి, మాయాంక్ యాదవ్, జితేష్ శర్మ, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, జితేష్ శర్మ, అర్ష్ దీప్ సింగ్, హర్షిత్ రాణా, రియాన్ పరాగ్, అభిషేక్ శర్మ.