Jasprit Bumrah : ఆస్ట్రేలియా జట్టుకు వెళ్ళిన తర్వాత టీమిండియా కు ఏవీ అనుకూలించలేదు. ఆస్ట్రేలియా – ఏ జట్టుతో జరిగిన అనధికారిక రెండు టెస్టులలో భారత్ – ఏ జట్టు ఓడిపోయింది. ప్రాక్టీస్ మ్యాచ్లో గిల్ నుంచి మొదలు పెడితే కేఎల్ రాహుల్ వరకు గాయపడ్డారు. దీంతో గిల్ రిజర్వ్ బెంచ్ కు పరిమితం కావలసి వచ్చింది. ఇన్ని ప్రతికూలతల మధ్య భారత జట్టు పెర్త్ టెస్ట్ ఆడింది. బలమైన ఆస్ట్రేలియా ముందు తొలి ఇన్నింగ్స్ లో 150 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ ఖాతాలో మరో ఓటమి ఖాయమని క్రీడా విశ్లేషకులు అంచనాకు వచ్చారు. ఇక ఈసారి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ లోకి భారత్ అడుగుపెట్టడం కష్టమేనని భావించారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ టీమిండియా కెప్టెన్ బుమ్రా సరికొత్తగా జట్టును నడిపాడు. బలమైన ఆస్ట్రేలియాను.. వారి దేశంలోనే 104 పరుగులకు కుప్పకూలేలా చేశాడు. తొలి ఇన్నింగ్స్ లో ఏకంగా ఐదు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక రెండవ ఇన్నింగ్స్ లో భారత్ ఏకంగా ఆరు వికెట్ల నష్టానికి 487 పరుగులు చేసి.. ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. యశస్వి జైస్వాల్ 161, విరాట్ కోహ్లీ 100* రన్స్ చేసి అదరగొట్టారు. అయితే ఈ దశలో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన కెప్టెన్ బుమ్రా.. ఆస్ట్రేలియాను రెండవ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేయడానికి ఆహ్వానించాడు. అంతేకాదు ఆస్ట్రేలియా పతనాన్ని శనివారమే శాసించాడు.. శనివారం స్వల్ప వ్యవధిలోనే రెండు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇక సోమవారమైతే ఆస్ట్రేలియా జట్టుకు చుక్కలు చూపించాడు. బౌలింగ్లో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ ఆస్ట్రేలియా ఆటగాళ్లకు పక్కలో బల్లెం లాగా మారాడు. దీంతో ఆస్ట్రేలియా జట్టు తలవంచక తప్పలేదు. ఫలితంగా 295 పరుగుల తేడాతో భారత్ చేతిలో ఓడింది. ఈ గెలుపు ద్వారా బుమ్రా అనేక ఘనతలను సొంతం చేసుకున్నాడు. అంతేకాదు టీమిండియా లెజెండరీ కెప్టెన్ కపిల్ దేవ్ దరిదాపుల్లోకి వెళ్ళాడు.
అత్యుత్తమ రిటర్న్స్
1983లో అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో కపిల్ దేవ్ 135 పరుగులు ఇచ్చి 10 వికెట్లు సాధించాడు. ఇప్పటివరకు ఇదే హైయెస్ట్ రికార్డ్ గా ఉంది.
1977లో పెర్త్ లోని వాకా మైదానం వేదికగా ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన మ్యాచ్లో భారత్ కు బీషన్ సింగ్ బేడి నాయకత్వం వహించాడు. అతడు ఏకంగా 10/194 ప్రదర్శన చేశాడు.
1976లో న్యూజిలాండ్ జట్టుతో చెన్నై వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్లో బిషన్ సింగ్ బేడి 9/70 ప్రదర్శన చేశాడు.
2024 నవంబర్లో పెర్త్ వేదికగా ఆసీస్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో భారత కెప్టెన్ బుమ్రా 8/72 ప్రదర్శన చేశాడు. భారత జట్టు గెలుపులో కీలకపాత్ర పోషించాడు.
1985లో అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియా జట్టుతో భారత్ తలపడింది. ఆ మ్యాచ్లో కపిల్ దేవ్ 8/109 ప్రదర్శన చేశాడు.