IND VS ENG T20 Match : ఐదు మ్యాచ్ ల టి20 సిరీస్లో ఇంగ్లాండ్ జట్టును ముందుగా బంతితో బెదరగొట్టిన భారత ఆటగాళ్లు.. ఆ తర్వాత బ్యాట్ తో అదరగొడుతున్నారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ నిర్ణయాన్ని సమర్థిస్తూ భారత బౌలర్లు ఈడెన్ గార్డెన్స్ లో అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఇంగ్లాండ్ జట్టును 132 పరుగులకే అలవాటు చేశారు. ఇంగ్లాండ్ బ్యాటర్లలో బట్లర్ (68) టాప్ స్కోరర్ గా నిలిచాడు.. టీం ఇండియా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి మూడు వికెట్లు పడగొట్టాడు. అక్షర పటేల్, హార్దిక్ పాండ్యా, అర్ష్ దీప్ సింగ్ తలా రెండు వికెట్లు సాధించారు. ఆ తర్వాత 133 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు తొలి ఓవర్లో పెద్దగా గొప్ప ఆరంభం లభించలేదు. తొలి ఓవర్ లో ఒక్క పరుగు మాత్రమే చేసిన ఓపెనర్ సంజు.. ఆ తర్వాత ఓవర్లలో తన విశ్వరూపం చూపించాడు. ఇష్టానుసారంగా బ్యాటింగ్ చేశాడు. బౌలర్ ఎవరనేది చూడకుండా విధ్వంసాన్ని సృష్టించాడు. ఫోర్ లతో విరుచుకుపడ్డాడు. సిక్సర్లతో హోరెత్తించాడు.. మొత్తంగా 20 బంతుల్లో నాలుగు ఫోర్లు , ఒక సిక్సర్ సహాయంతో 26 పరుగులు చేశాడు.. చివరికి ఆర్చర్ బౌలింగ్లో ఔట్ అయ్యాడు. తర్వాత వచ్చిన కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ సున్నా పరుగులకే ఆర్చర్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఇప్పటికీ టీమ్ ఇండియా స్కోర్ రెండు వికెట్లకు 41 పరుగులు. ఈ దశలో వచ్చిన తిలక్ వర్మతో కలిసి మరో ఓపెనర్ అభిషేక్ శర్మ టీమిండియా స్కోర్ ను రాకెట్ వేగంతో పరుగులు పెట్టించాడు.
ఈడెన్ గార్డెన్ ను షేక్ చేశాడు
అభిషేక్ శర్మ పేరులో ఉన్న షేక్ ను తన బ్యాటింగ్ ద్వారా చూపించాడు. కేవలం 34 బంతులు మాత్రమే ఎదుర్కొన్న అభిషేక్ శర్మ ఐదు ఫోర్లు, 8 సిక్సర్ల సహాయంతో 79 పరుగులు చేశాడు. తిలక్ వర్మతో కలిసి 41 బంతుల్లో 84 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఫోర్లు అంటే ఇష్టం లేనట్టు.. సిక్సర్ లు అంటేనే మోజు అన్నట్టుగా అభిషేక్ శర్మ బ్యాటింగ్ చేశాడు. ఆర్చర్, అట్ కిన్ సన్, వుడ్, ఆదిల్ రషీద్, ఓవర్ టన్, లివింగ్ స్టోన్.. ఇలా ఇంగ్లాండ్ కెప్టెన్ ఎంతమంది బౌలర్లను మార్చినా.. అభిషేక్ శర్మ తన ఊచకోతను మాత్రం తగ్గించలేదు. సిక్సర్ ల మీద సిక్సర్లు కొట్టాడు.
రెండవ ఆటగాడిగా అభిషేక్ శర్మ..
ఈ ఇన్నింగ్స్ ద్వారా అభిషేక్ శర్మ ఇంగ్లాండ్ జట్టుపై t20 లలో అతి తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన రెండవ ఆటగాడిగా ఆవిర్భవించాడు. ఈ జాబితాలో తొలి స్థానంలో యువరాజ్ సింగ్ ఉన్నాడు.. 2007లో జరిగిన టి20 వరల్డ్ కప్ లో కేవలం 12 బంతుల్లోనే యువరాజ్ సింగ్ ఆఫ్ సెంచరీ చేశాడు. ఆ తర్వాత స్థానంలో ఇప్పటివరకు కేఎల్ రాహుల్ ఉండేవాడు. కెఎల్ రాహుల్ 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. అయితే ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన మ్యాచ్లో కేవలం 20 బంతుల్లోనే అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ చేయడంతో.. కేఎల్ రాహుల్ మూడో స్థానానికి.. అభిషేక్ శర్మ రెండవ స్థానానికి వచ్చాడు.