https://oktelugu.com/

Ashes 2023: యాషెస్ సిరీస్ కు ముందు ఇంగ్లాండ్ కు గట్టి దెబ్బ..

ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ జట్ల మధ్య యాషెస్ పేరుతో ప్రతిష్టాత్మకమైన సిరీస్ కొన్నేళ్లుగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది జూన్ 16 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కాబోతోంది.

Written By:
  • BS
  • , Updated On : June 5, 2023 / 10:48 AM IST

    Ashes 2023

    Follow us on

    Ashes 2023: ప్రతిష్టాత్మకమైన యాషెస్ సిరీస్ ఈ నెల 16 నుంచి ప్రారంభం కాబోతోంది. ఈ సిరీస్ కోసం ఆస్ట్రేలియా – ఇంగ్లాండ్ జట్లు సిద్ధమవుతున్నాయి. ప్రతిష్టాత్మకంగా జరిగే ఈ సిరీస్కు ముందు ఇంగ్లాండ్ జట్టుకు పెద్ద దెబ్బ తగిలింది. ఇంగ్లాండ్ జట్టులో కీలక బౌలర్ జాక్ లీచ్ కాలికి గాయం కారణంగా సిరీస్ కు దూరమయ్యాడు. దీంతో ఇంగ్లాండ్ జట్టుకు యాషెస్ సిరీస్ కు ముందు గట్టి దెబ్బ తగిలిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

    ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ జట్ల మధ్య యాషెస్ పేరుతో ప్రతిష్టాత్మకమైన సిరీస్ కొన్నేళ్లుగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది జూన్ 16 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కాబోతోంది. ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఇరు జట్లు సర్వశక్తులను ఒడ్డేందుకు సిద్ధమవుతున్నాయి. విజయమే లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగనున్నాయి. ఇప్పటికే వ్యూహ, ప్రతి వ్యూహాలను ఆయా జట్లు సిద్ధం చేసుకుంటున్నాయి. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో కీలకంగా వ్యవహరించే వారి పట్ల ఆయా జట్లు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటున్నాయి. ఈ సిరీస్ ప్రారంభానికి కొద్దిరోజుల ముందే ఇంగ్లాండు జట్టుకు పెద్ద దెబ్బ తగలడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది.

    జాక్ లీచ్ పాదంలో పగుళ్లు ఉన్నట్టు నిర్ధారణ..

    ఈ నెల 16 నుంచి ప్రారంభం కాబోయే యాషెస్ సిరీస్ కు ముందు ఇంగ్లాండ్ జట్టు ఇబ్బంది ఎదుర్కొంటుంది. కాలి ఫ్రాక్చర్ కారణంగా ఆ జట్టు స్టార్ స్పిన్నర్ జాక్ లీచ్ సిరీస్ మొత్తానికే దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. తాజాగా ఐర్లాండ్ తో ముగిసిన ఏకైక టెస్ట్ మ్యాచ్ సందర్భంగా లీచ్ ఫ్రాక్చర్ కారణంగా ఇబ్బంది పడినట్లు తెలిసింది. అనంతరం నిర్వహించిన స్కాన్ లో లీచ్ పాదంలో పగుళ్లు గుర్తించినట్లు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. లీచ్ ఐర్లాండ్ తో జరిగిన టెస్టులో నాలుగు వికెట్లు పడగొట్టుగా ఇంగ్లాండ్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.

    ఇంగ్లాండ్ జట్టులో కీలక బౌలర్ గా మారిన లీచ్..

    ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టు బౌలర్లలో ముఖ్యంగా స్పిన్ విభాగంలో లీచ్ అత్యంత కీలకంగా మారాడు. 31 ఏళ్ల జాక్ లీచ్ 2018 లో ఇంగ్లాండ్ తరఫున టెస్ట్ అరంగేట్రం చేసి 35 మ్యాచ్ ల్లో 124 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఐదు సార్లు ఐదు వికెట్ల ఘనత కూడా సాధించాడు. బ్యాటింగ్ లో లీచ్ ఓ అర్థ సెంచరీ (92) సాధించాడు. 2019లో లీడ్స్ లో జరిగిన టెస్ట్ లో చివరి వికెట్ కు బెన్ స్టోక్స్ తో నెలకొల్పిన భాగస్వామ్యం లీచ్ కెరియర్ లో హైలెట్ గా నిలిచింది. ఆ మ్యాచ్ లో లీచ్ చేసింది ఒక్క పరుగే అయినా వికెట్ పడకుండా స్ట్రైక్ రొటేట్ చేసి జట్టు విజయానికి దోహదపడ్డాడు. మరో ఎండ్ లో స్టోక్స్ (135 నాట్ అవుట్) చారిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడి ఇంగ్లాండును ఒంటి చేత్తో గెలిపించాడు. ఆ మ్యాచ్ లో లీచ్ సహకారంతో స్టోక్స్ చివరి వికెట్ కు ఏకంగా 76 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

    ఈ నెల 16న ప్రారంభమై జూలై 31 తో ముగియనున్న సిరీస్..

    ఆస్ట్రేలియా – ఇంగ్లాండ్ జట్ల మధ్య ఈ నెల 16న ప్రారంభమయ్య యాషెస్ సిరీస్ జూలై 31తో ముగుస్తుంది. బిర్మింగ్హామ్ వేదికగా తొలి టెస్ట్ జూన్ 16 నుంచి 20 తేదీల మధ్యలో, లార్డ్స్ లో రెండో టెస్టు జూన్ 28 నుంచి జూలై రెండు మధ్య, లీడ్స్ లో మూడో టెస్ట్ జూలై 6 నుంచి 10 తేదీల మధ్య, మాంచెస్టర్ లో నాలుగో టెస్టు జూలై 19 నుంచి 23 మధ్య, ఓవల్ వేదికగా ఐదో టెస్టు జూలై 27 నుంచి 31 మధ్య జరగనుంది. ఈ సిరీస్ కోసం ఇరుజట్ల అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇరుజట్లు ఈ యాషెస్ సిరీస్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో హోరాహోరీ సాగుతుందని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.