2023 ODI World Cup Draft Schedule: 2023 వన్డే వరల్డ్ కప్ డ్రాఫ్ట్ షెడ్యూల్ రెడీ: ఇండియా ఆడే మ్యాచ్ లు, వేదికలివే

ఈ మెగా పూర్ణికి ఇండియా ఆతిథ్యం ఇస్తున్న నేపథ్యంలో.. అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో చెన్నై వేదికగా భారత జట్టు తొలి మ్యాచ్ ఆడనుంది. చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్తాన్ జట్లు అహ్మదాబాద్ వేదికగా అక్టోబర్ 15న తలపడతాయి. లీగ్ మ్యాచ్ లను భారత జట్టు 9 నగరాల్లో ఆడుతుంది..

Written By: Bhaskar, Updated On : June 13, 2023 5:43 pm

2023 ODI World Cup Draft Schedule

Follow us on

2023 ODI World Cup Draft Schedule: క్రికెట్ అభిమానులకు శుభవార్త. వారిని అలరించేందుకు మరో మెగా టోర్నీకి రంగం సిద్ధమైంది. ఈ ఏడాది చివరిలో భారత్ వేదికగా జరిగే క్రికెట్ వరల్డ్ కప్ షెడ్యూల్ ను బీసీసీఐ వెల్లడించింది.. గతంలో పలుమార్లు భారత్ ఆతిథ్యమిచ్చింది.. అయితే అప్పుడు మిగతా దేశాలు కూడా ఇందులో పాలుపంచుకున్నాయి. ఈసారి వరల్డ్ కప్ న కు తొలిసారి ఇండియా పూర్తిస్థాయిలో ఆతిథ్యం ఇవ్వనుంది. అయితే ఈ జాబితాలో హైదరాబాద్ వేదికగా భారత్ కు ఒక్క మ్యాచ్ కూడా లేకపోవడం అభిమానులను నిరాశ పరుస్తున్నది. ఈ ఏడాది చివరిలో భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచ కప్ డ్రాఫ్ట్ షెడ్యూల్ ను బీసీసీఐ విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ను ఐసీసీతో పంచుకుంది. ఆ తర్వాత మిగతా దేశాలకు కూడా పంపి.. వారి నుంచి సలహాలు, సూచనలు తీసుకున్న తర్వాత వరల్డ్ కప్ చివరి షెడ్యూల్ ను ఐసీసీ అధికారికంగా ప్రకటించనుంది.

మొత్తం 10 టీం లు

ఈ మెగా టోర్నీలో మొత్తం పది జట్లు పాల్గొనే అవకాశం ఉంది. అయితే ఈ మెగా టోర్నీలో పాల్గొనేందుకు ఎనిమిది జట్లు అర్హత సాధించాయి. క్వాలిఫైయర్ ద్వారా మరో రెండు జట్లను ఐసీసీ నిర్ణయించనుంది. ప్రస్తుతం బీసీసీఐ విడుదల చేసిన డ్రాఫ్ట్ షెడ్యూల్ ప్రకారం వన్డే వరల్డ్ కప్ అక్టోబర్ 5న ప్రారంభం కానుంది. ఆరోజు తొలి మ్యాచ్ డిపెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్, రన్నరప్ జట్టు న్యూజిలాండ్ జట్లు తలపడతాయి. అహ్మదాబాద్ వేదికగా ఆ రెండు జట్లు తొలి మ్యాచ్ ఆడతాయి. సుదీర్ఘంగా సాగే ఈ టోర్నీలో ఇంకా సెమీఫైనల్స్ పోటీలకు వేదికలు ప్రకటించలేదు.

ఇదే షెడ్యూల్

ఈ మెగా పూర్ణికి ఇండియా ఆతిథ్యం ఇస్తున్న నేపథ్యంలో.. అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో చెన్నై వేదికగా భారత జట్టు తొలి మ్యాచ్ ఆడనుంది. చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్తాన్ జట్లు అహ్మదాబాద్ వేదికగా అక్టోబర్ 15న తలపడతాయి. లీగ్ మ్యాచ్ లను భారత జట్టు 9 నగరాల్లో ఆడుతుంది.. డ్రాఫ్ట్ షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 8న చెన్నై వేదికగా ఆస్ట్రేలియా జట్టుతో భారత్ తలపడుతుంది. అక్టోబర్ 11న ఢిల్లీ వేదికగా ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో భారత్ తలపడుతుంది. అక్టోబర్ 15న అహ్మదాబాద్ వేదికగా పాకిస్తాన్ జట్టుతో పోరాడుతుంది. అక్టోబర్ 19న పూణే వేదికగా బంగ్లాదేశ్ జట్టుతో, అక్టోబర్ 22 ధర్మశాల వేదికగా న్యూజిలాండ్ తో, అక్టోబర్ 29న లక్నో వేదికగా ఇంగ్లాండ్ తో, నవంబర్ 2న ముంబై వేదికగా క్వాలిఫైయర్ జట్టుతో, నవంబర్ 5న కోల్కతా వేదికగా దక్షిణాఫ్రికా తో, నవంబర్ 11న బెంగళూరు వేదికగా క్వాలిఫైయర్ జట్టుతో భారత్ తలపడుతుంది.

అభిమానులకు నిరాశ

ఈ మ్యాచ్ లను ప్రత్యక్షంగా చూడాలని అనుకుంటున్న అభిమానులకు మాత్రం నిరాశ తప్పేలా లేదు. అన్ని ప్రధాన మైదానాలలో టీమిండియా మ్యాచ్లకు అవకాశం కల్పించిన బీసిసిఐ.. హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియాన్ని విస్మరించినట్టు ప్రచారం జరుగుతోంది. ఉప్పల్ మైదానంలో పాకిస్తాన్ జట్టు రెండు క్వాలిఫయర్ మ్యాచ్ లను ఆడనుంది. పాకిస్తాన్ జట్టుకు ఉప్పల్లో అవకాశం ఇచ్చి, భారత జట్టును విస్మరించడం పట్ల తెలుగు క్రికెట్ అభిమానులు బిసిసిఐ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ టీమిండియా తొలిసారి వరల్డ్ కప్ క్రికెట్ టోర్నీకి ఆతిథ్యం ఇస్తోంది. గతంలో 1987, 1996, 2011 సంవత్సరాలలో భారత్ మిగతా ఆసియా దేశాలతో కలిపి వన్డే వరల్డ్ కప్ కు ఆతిథ్యమిచ్చింది. ఈసారి మాత్రం ఇండియా మాత్రమే ఆతిథ్యం ఇస్తోంది. ఇక ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు కావడంతో.. సొంత మైదానాలను వందల కోట్లతో ఆధునీకరిస్తోంది. హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియానికి కూడా భారీ మొత్తంలో నగదు కేటాయించింది. ఆ స్టేడియంలో ఆధునీకరణ పనులు దాదాపుగా పూర్తికావొచ్చాయి.