World Boxing Championships 2023: ప్రతిష్టాత్మక బాక్సింగ్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత్ హవా కొనసాగుతోంది. యువ బాక్సర్ మహమ్మద్ హుసాముద్దీన్ పతకం సాధించేందుకు అడుగు దూరంలో నిలిచాడు. ఎదురైన ప్రత్యర్థినల్లా చిత్తు చేస్తూ ఈ నిజామాబాద్ చిచ్చరపిడుగు మెగా టోర్నీలో సెమీ ఫైనల్స్‌కు దూసుకెళ్లాడు. పతకం ఖాయం చేసుకున్నాడు. చైనా బాక్సర్ పింగ్‌పై పంచ్‌లతో విరుచుకుపడ్డ హుసాముద్దీన్.. ప్రి క్వార్టర్స్‌లోనూ అదే దూకుడు ప్రదర్శించాడు.
ప్రీ క్వార్టర్స్‌లో రష్యా బ్యాక్సర్ చిత్తు..
57 కేజీల విభాగం ప్రీ క్వార్టర్స్‌లో రష్యా బాక్సర్ ఎడ్వర్డ్ సావిన్ తో హుసాముద్దీన్ తలపడ్డాడు. ఈ పోరులో 5–0 తేడాతో రష్యా బాక్సర్ ఎడ్వర్డ్ సావిన్‌ను చిత్తుగా ఓడించాడు. ఆట ప్రారంభం నుంచే హుసాముద్దీన్ ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం చూపిస్తూ..పవర్ ఫుల్ పంచ్‌లతో రెచ్చిపోయాడు. హుసాముద్దీన్ ధాటికి సావిన్ ఏమాత్రం నిలవలేకపోయాడు.
క్వార్టర్స్‌లో అంజర్ బైజాన్ బాక్సర్‌పై..
హుసాముద్దీన్ క్వార్టర్స్‌లో అజర్ బైజాన్‌కు చెందిన బాక్సర్ ఉమిద్ రుస్తమోవ్‌తో తలపడ్డాడు. బుధవారం హోరాహోరీగా సాగిన క్వార్టర్స్ పోరులో తెలుగోడి పంచ్ పవర్‌కు ప్రత్యర్థి పూర్తిగా తలవంచాడు. దీంతో హుసాముద్దీన్ నేరుగా సెమీస్‌లోకి దూసుకెళ్లాడు. చిరస్మరణీయ విజయాన్ని ఖాతాలో వేసుకుని పతకాన్ని ఖరారు చేసుకున్నాడు.
భారత బాక్సర్ల హవా..
ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్ల అద్భుత ప్రదర్శన కొనసాగుతున్నది. ఆసియా, ఒలింపిక్స్ ముందు జరుగుతున్న ఈ మెగాటోర్నీలో మన బాక్సర్లు పతకాలే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. బుధవారం జరిగిన వేర్వేరు కార్వర్ట్స్ బౌట్లలో మహమ్మద్ హుసాముద్దీన్(57 కిలోలు), దీపక్ భోరియా(51కిలోలు), నిశాంత్‌దేవ్(71కిలోలు) అద్భుత విజయాలు సాధించి సెమీఫైనల్లోకి ప్రవేశించారు. దీని ద్వారా మెగాటోర్నీలో భారత్‌కు కనీసం మూడు కాంస్య పతకాలు ఖాయం చేశారు. గత(2019) టోర్నీలో అమిత్ పంగల్(రజతం), మనీశ్ కౌశిక్(కాంస్యం) భారత్‌కు రెండు పతకాలు అందించారు.
హుసామ్ భళా..
బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో ఎలాగైనా సత్తాచాటాలన్న పట్టుదలతో బరిలోకి దిగిన హుసామ్..అందుకు తగ్గట్లు అద్భుత ప్రతిభ చాటుతున్నాడు. ప్రత్యర్థి ఎవరన్నది లెక్కచేయని నైజంతో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు. బుధవారం ఆఖరి వరకు నువ్వానేనా అన్నట్లు సాగిన క్వార్టర్స్ పోరులో హుసామ్ 4–3తో ప్రత్యర్థిని చిత్తుచేశాడు.
– దీపక్ 5–0 తేడాతో నూర్జుహిట్ దిశుబయేవ్(కిర్గిస్థాన్)పై అద్భుత విజయం సాధించి సెమీస్‌లో బెన్నెమా(ఫ్రాన్స్)తో పోరుకు సిద్ధమయ్యాడు.
– మరో భారత బాక్సర్ దీపక్ భోరియా కూడా తన సత్తా చాటుకుంటున్నాడు. 51 కేజీల విభాగంలో పోరాడుతున్న దీపక్..ప్రి క్వార్టర్స్‌కు చేరాడు. టోక్యో ఒలింపిక్స్ లో కాంస్యం గెలిచిన కజకిస్థాన్ బాక్సర్ సాకెన్ బిబోసినోవ్‌ను దీపక్ 5–2 తేడాతో ఓడించి ప్రిక్వార్టర్స్ లో అడుగుపెట్టాడు.