Dhoni : టీమిండియాలో ఎంతోమంది లెజెండరీ ఆటగాళ్లు ఉన్నారు. తమ ఆట ద్వారా సరికొత్త శిఖరాలు అధిరోహించిన వారు చాలామంది ఉన్నారు. అయితే వారిలో అణకువ, ఎంత ఒదిగినా తగ్గి ఉండే తత్వంతో కొంతమంది ఆటగాళ్లు క్రికెట్ కు సరికొత్త వన్నె తీసుకొచ్చారు. ఉదాహరణకు సచిన్ టెండుల్కర్ నే తీసుకుంటే.. క్రికెట్లో అతడు ఎన్నో అత్యున్నత రికార్డులను నెలకొల్పినప్పటికీ.. తనకు క్రికెట్లో శిక్షణ ఇచ్చిన రమాకాంత్ ఆచ్రేకర్ కు రుణపడి ఉంటారని ప్రతి సందర్భంలో చెప్పేవాడు. ఇటీవల ముంబైలోని వాంఖడే మైదానంలో రమాకాంత్ విగ్రహాన్ని ఆవిష్కరించినప్పుడు సచిన్ టెండూల్కర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యాడు. ఆ సందర్భంగా రమాకాంత్ తో తనకున్న అనుబంధాన్ని నెమరేసుకున్నాడు. అంతేకాదు తోటి ఆటగాళ్లతో కూడా సచిన్ స్నేహభావంతో ఉండేవాడు. ఏమాత్రం అహాన్ని ప్రదర్శించేవాడు కాదు. అందువల్లే అతడు లెజెండరీ ఆటగాడు అయ్యాడు. చివరికి ప్రత్యర్ధులు సైతం సచిన్ టెండూల్కర్ ను క్రికెట్ గాడ్ గా అభివర్ణించారంటే అతడి వ్యక్తిత్వం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇక ఇప్పటి కాలంలో కొంత ఫేమ్ కాగానే చాలామంది ఆటగాళ్లు విపరీతమైన ఈగో తో కనిపిస్తున్నారు. అచంచలమైన పొగరుతో దర్శనమిస్తున్నారు. ఇలాంటి వారు జెంటిల్మెన్ గేమ్ కు వక్ర భాష్యం చెబుతున్నారు. అయితే ఈ కాలంలో కూడా ఒక ఆటగాడు తోటి ఆటగాడికి పాదాభివందనం చేశాడు. అతడి ఆశీర్వచనాలు తీసుకున్నాడు.
మంగళవారం రాజస్థాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో చెన్నై ఓడిపోయింది. ఈ మ్యాచ్లో భారీగానే పరుగులు చేసినప్పటికీ చెన్నై ఆ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. ఈ దశలో రాజస్థాన్ ఆటగాడు వైభవ్ సూర్య వంశీ తనకు మాత్రమే సాధ్యమైన దూకుడు అయిన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. ఏకంగా అర్థ శతకం సాధించాడు. ఈ సీజన్లో అతడు గతంలోనే గుజరాత్ జట్టుపై శతకం సాధించిన విషయం తెలిసిందే. నిండా 15 సంవత్సరాలు కూడా లేని ఇతడు చెన్నై జట్టుపై వీరోచితమైన బ్యాటింగ్ చేశాడు. చెన్నై బౌలర్లను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించాడు. ఒకానొక దశలో శతకం వైపు పరుగులు తీస్తున్నట్టు కనిపించినప్పటికీ.. అతడు ఆ మైలురాయి అందుకోలేకపోయాడు. చివరికి రాజస్థాన్ జట్టును విజయతీరాలకు చేర్చడంలో తన వంతు పాత్ర పోషించాడు. వాస్తవానికి ఈ సీజన్లో చెన్నై, రాజస్థాన్ ప్లే ఆఫ్ నుంచి పక్కకు తప్పుకున్నాయి.. ఇక ప్రస్తుతం చెన్నై జట్టు పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది.
Also Read: ఒక్క నిమిషంలో ఆరు అబద్ధాలు చెప్పిన పాక్.. వీడియో వైరల్
చెన్నై జట్టుతో సాధించిన గెలుపు ద్వారా రాజస్థాన్ కాస్త గౌరవప్రదమైన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. సంజు ఆధ్వర్యంలో గత సీజన్లో ప్లే ఆఫ్ దాకా వెళ్ళింది. ప్లే ఆఫ్ లో కమిన్స్ సేన ఎదుట తలవంచింది. ఇక ఇప్పుడు చెన్నై జట్టుపై విజయం సాధించి అదరగొట్టింది.. వాస్తవానికి ఈ గెలుపు ద్వారా రాజస్థాన్ జట్టుకు పెద్దగా దక్కేది ఏమీ లేకపోయినప్పటికీ.. కాస్తలో కాస్త గౌరవం అయితే లభించింది. ఇక రాజస్థాన్ జట్టులో వైభవ్ సూర్యవంశీ హాఫ్ సెంచరీ చేసిన తర్వాత.. ఏమాత్రం భేషజాన్ని ప్రదర్శించకుండా ధోని ఎదుట వినమ్రుడిగా నిలిచాడు. ధోని పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నాడు. ఈ సందర్భంగా ధోని వైభవ్ చెవిలో ఏదో చెప్పాడు. ఆ మాటలకు వైభవ్ నవ్వి ఊరుకున్నాడు.. ఇక దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సంచలనగా మారింది.
Respect your legends pic.twitter.com/hEcygi5Z6I
— Rajasthan Royals (@rajasthanroyals) May 20, 2025