
IPL 2021 : టీ20 ఫార్మాట్ కు ప్రాముఖ్యత పెంచడంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పాత్ర చాలా ఉందని చెప్పొచ్చు. ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న ఈ లీగ్.. అప్రతిహతంగా సాగుతోంది. కరోనా కారణంగా గతేడాది అర్ధంతరంగా వాయిదాపడిన IPL -2021.. మరో మూడు రోజుల్లో దుబాయ్ వేదికగా ప్రారంభం కాబోతోంది. దీంతో.. ఐపీఎల్ హంగామా మరోసారి మొదలైంది. ఈ నేపథ్యంలో.. ఈ లీగ్ గురించిన ఆసక్తికర విషయాలు చర్చలోకి వస్తున్నాయి. ఇప్పటి వరకు ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధిక వ్యక్తిగత స్కోర్లు సాధించిన ఆటగాళ్లు ఎవరన్నది చూద్దాం.
ఇప్పటి వరకు ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు సాధించిన ఆటగాడు క్రిస్ గేల్. ఫార్మాట్ ఏదైనా తనదైన స్టైల్లో చెలరేగిపోయే గేల్.. సుడిగాలి ఇన్నింగ్స్ ఆడతాడు. ఇప్పటి వరకు ఎన్నోసార్లు అద్భుతమైన ఇన్నింగ్స్ లు ఆడాడు. ఐపీఎల్ లోనూ దుమ్ములేపిన గేల్.. ఈ లీగ్ లోనే హయ్యెస్ట్ స్కోరు నమోదు చేశాడు. 2013 సీజన్లో సహారా పుణె వారియర్స్ పై ఊహకందని రీతిలో రెచ్చిపోయిన ఈ బెంగళూరు ఆటగాడు.. కేవలం 66 బంతుల్లోనే 175 పరుగులు కొల్లగొట్టాడు. ఈ మ్యాచ్ లో విధ్వంసం సృష్టించిన గేల్.. ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడన్నది చిన్నమాటే అవుతుంది. తాను ఎదుర్కొన్న 66 బంతుల్లో.. 30 బంతులు బౌండరీలే బాదాడంటే.. గేల్ బ్యాటింగ్ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. 13 ఫోర్లు, 17 సిక్సర్లు కొట్టి.. ఐపీఎల్ చరిత్రలోనే టాప్ స్కోరర్ గా నిలిచాడు.
గేల్ తర్వాత సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు బ్రెండన్ మెక్ కల్లమ్. 2008లో ఐపీఎల్ ఆరంభ సీజన్లో తొలి మ్యాచ్ లోనే కళ్లు చెదిరే బ్యాటింగ్ తో అందరిచేతా నోరెళ్లబెట్టించాడు. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో 73 బంతుల్లో 158 పరుగులతో వీరవిహారం చేశాడీ కోల్ కతా ఆటగాడు. 2013లో గేల్ అధిగమించే వరకూ.. మెక్ కల్లమ్ స్కోరే.. అత్యధిక వ్యక్తిగత స్కోరుగా ఉంది. ఇప్పుడు రెండో స్థానంలో కొనసాగుతోంది.
మూడో స్థానంలో మిస్టర్-360 ఉన్నాడు. 2015లో ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ తరపున 133 పరుగులు సాధించాడు ఏబీడీ. ఇందుకోసం కేవలం 59 బంతులు మాత్రమే తీసుకున్నాడు. ఇందులో ఏకంగా 19 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి.
ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు టీమిండియా ఆటగాడు కేఎల్ రాహుల్. 2020 సీజన్లో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ తరపున ఈ ఘనత సాధించాడు రాహుల్. 69 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్సర్లు కొట్టిన రాహుల్.. 132 పరుగులు సాధించాడు.
టాప్ 5లో చోటు దక్కించుకున్నాడు మరో టీమిండియా ఆటగాడు రిషబ్ పంత్. 2018లో ఢిల్లీ డేర్ డెవిల్స్ (ఢిల్లీ క్యాపిటల్స్) తరపున ఆడిన పంత్.. 128 పరుగులు సాధించాడు. 15 ఫోర్లు, 7 సిక్సర్లతో చెలరేగాడు. హైదరాబాద్ సన్ రైజర్స్ పై ఈ ఘనత సాధించాడు.