Yellandu Hanuman Temple: శ్రీరాముడి వీరభక్తుడు అయినా హనుమాన్ దేవాలయం ప్రతి గ్రామంలో తప్పనిసరిగా కనిపిస్తుంది. ధైర్యశాలి.. దుష్టశక్తులను పారద్రోలే ఆంజనేయస్వామి అంటే చాలామందికి ఇష్టమే. అందుకే ప్రతిరోజు ఆయన దర్శనం చేసుకున్న తర్వాతనే పనులు ప్రారంభించే వారు చాలామంది ఉన్నారు. అయితే ఏ దేవాలయంలోనైనా హనుమాన్ సింగిల్గానే కనిపిస్తాడు. శివుడు, విష్ణువులు సతీసమేతంగా దర్శనం ఇవ్వగా.. హనుమాన్ మాత్రం ఒకరే దేవాలయంలో కొలువై ఉంటారు. అందుకే ఆ స్వామిని ఆజన్మ బ్రహ్మచారి అని అంటారు. అయితే హనుమాన్ బ్రహ్మచారి కాదు అని ఆ స్వామివారికి వివాహం జరిగిందని కొన్ని పురాణాల ప్రకారం తెలుస్తోంది. అంతేకాకుండా సతీ సమేతంగా హనుమాన్ ఓ ఆలయంలో కొలువైయున్నాడు. ఆలయం ఎక్కడ ఉందంటే?
హనుమంతుడు పక్కనే ఉంటే ధైర్యం మన చెంత ఉన్నట్లే. స్వయం శక్తితో శత్రువులను నాశనం చేసే బలశాలి అయినా ఆంజనేయ స్వామికి గురువు సూర్యుడు అన్న విషయం చాలామందికి తెలిసిందే. అయితే హనుమంతుడు ఆకాశంలో తిరుగుతూ సూర్యుడి వద్ద వేదాలన్నింటినీ నేర్చుకుంటాడు. తొమ్మిది రకాల వ్యాకరణాలను నేర్చుకోవాలన్న హనుమంతుడి కోరిక ఎనిమిది పూర్తి అయిన తర్వాత ఒక సంకటం వద్ద ఆగిపోతుంది. తొమ్మిదో వ్యాకరణం పూర్తి చేయాలంటే వివాహితుడై ఉండాలి. కానీ ఆంజనేయ స్వామి మాత్రం బ్రహ్మచారిగానే ఉండిపోవాలని అనుకుంటాడు. ఈ క్రమంలో త్రిమూర్తులు సూర్యభగవానుడికి ఒక మార్గం చెబుతారు.
త్రిమూర్తుల ఆలోచన మేరకు సూర్యుడు తన కిరణాల నుంచి సువర్చల అనే అమ్మాయిని సృష్టిస్తాడు. ఈ అమ్మాయిని హనుమంతుడు పెళ్లి చేసుకుంటాడు. వీరి వివాహం జేష్ట శుద్ధ దశమి రోజు జరిగినట్లు పరాశర సంహితలో తెలుపుతున్నాయి.అయితే ఈ అమ్మాయికి భౌతిక రూపం ఉండదు. కేవలం తేజస్సు మాత్రమే ఉంటుంది. అందుకే ఆంజనేయస్వామి ఎప్పటికీ బ్రహ్మచారిగానే ఉండిపోతాడు. సువర్చలను పెళ్లి చేసుకున్న తర్వాత హనుమంతుడు తొమ్మిదో వ్యాకరణం పూర్తిచేసి తపస్సుకు వెళ్లిపోతాడు. అయితే హనుమంతుడు సతీసమేతుడు అయినందున కొన్ని ఆలయాల్లో ఆంజనేయస్వామి కళ్యాణం జరిపిస్తారు.
మనకు కనిపించే హనుమాన్ ఆలయాల్లో హనుమంతుడు సింగిల్గానే కనిపిస్తాడు. కానీ కొన్ని ఆలయాల్లో హనుమంతుడు సతీసమేతంగా దర్శనం ఇస్తాడు. ఇలాంటి ఆలయం తెలంగాణలో ఒకటి ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో శ్రీ సువర్చల సహిత అభయాంజనేయ స్వామి ఆలయంలో హనుమంతుడు సతీసమేతంగా దర్శనం ఇస్తాడు. ఈ ఆలయాన్ని 2006 సంవత్సరంలో నిర్మించారు. ఇక్కడికి తెలుగు రాష్ట్రాల వారు మాత్రమే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చి దర్శించుకుంటారు. అంతేకాకుండా భార్యాభర్తల మధ్య తగాదాలు ఎక్కువగా ఉంటే ఈ ఆలయాన్ని దర్శించుకుంటే పరిష్కారం అవుతుందని కొందరు నమ్ముతారు.