Navagrahas: హిందూ ధర్మంలో నవగ్రహాలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, రాహువు, కేతువులందరినీ కలిపి నవగ్రహాలుగా పిలుస్తారు. ఈ నవ గ్రహాలు మనుషుల జీవితంపై ప్రభావం చూపుతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. అందుకే అనేక దేవాలయాల్లో నవగ్రహ మండపాలను ఏర్పాటు చేస్తుంటారు. భక్తులు వీటికి ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తుంటారు. అయితే పురాతన విష్ణు ఆలయాల్లో నవగ్రహాలు కనిపించవు. కానీ ప్రస్తుతం కొత్తగా నిర్మిస్తున్న అనేక విష్ణు ఆలయాల్లో నవగ్రహ విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు. నవగ్రహాలు విష్ణు ఆలయాల్లో ఎందుకు కనిపించవు?
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి వ్యక్తి జన్మ సమయంలో గ్రహాల స్థానాన్ని బట్టి జీవితంలో శుభాశుభ ఫలితాలు ఏర్పడతాయని విశ్వాసం. గ్రహదోషాలు, శని ప్రభావం, రాహు-కేతు దోషాలు, కుజదోషం వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందేందుకు నవగ్రహాలను ఆరాధిస్తారు. గ్రహాలను దేవతల ప్రతినిధులుగా భావించి, వారి అనుగ్రహంతో ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్య, వివాహం, సంతానం, ఉద్యోగం వంటి విషయాల్లో శుభఫలితాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. పురాణాల ప్రకారం నవగ్రహాలు స్వతంత్ర పరబ్రహ్మ స్వరూపాలు కాదు. ఇవి భగవంతుని ఆజ్ఞలను అమలు చేసే దైవశక్తులు. సృష్టిలో కర్మఫలాలను అందించే బాధ్యతను వీరికి అప్పగించారని పురాణాలు వివరిస్తాయి. అందువల్ల నవగ్రహాలను గౌరవించి పూజించినప్పటికీ, పరమాత్మ కంటే ఉన్నతస్థానంలో ఎప్పుడూ ఉంచరు.
విష్ణు ఆలయాల్లో నవగ్రహాలు ఎందుకు ఉండవు?
ప్రాచీన వైష్ణవ సంప్రదాయం ప్రకారం శ్రీమహావిష్ణువే జగన్నియంత. నవగ్రహాలతో సహా సమస్త లోకాలు, దేవతలు, కాలం అన్నీ ఆయన ఆధీనంలోనే ఉంటాయని విశ్వాసం. అందువల్ల విష్ణు ఆలయంలో శ్రీమహావిష్ణువును దర్శిస్తే నవగ్రహాలను ప్రత్యేకంగా పూజించాల్సిన అవసరం లేదని వైష్ణవ ఆగమాలు పేర్కొంటాయి. అందుకే తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం, శ్రీరంగం, మేల్కోటె వంటి ప్రసిద్ధ ప్రాచీన వైష్ణవ దేవాలయాల్లో ప్రత్యేక నవగ్రహ మండపాలు కనిపించవు.
విష్ణు పురాణం, భాగవతం వంటి గ్రంథాల్లో సూర్యుడు సహా అన్ని గ్రహాలు శ్రీమహావిష్ణువు నియమించిన విధంగానే తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తాయని వివరించబడింది. శ్రీమహావిష్ణువు అనుగ్రహం లభిస్తే గ్రహదోషాల ప్రభావం కూడా తగ్గుతుందని వైష్ణవ ఆచార్యులు వివరిస్తారు. అందుకే వైష్ణవ భక్తులు నవగ్రహాల కంటే నారాయణుడి శరణాగతినే ప్రధానంగా భావిస్తారు.
శివాలయాల్లో నవగ్రహాలు ఎందుకు ఎక్కువగా ఉంటాయి?
శైవ సంప్రదాయంలో నవగ్రహాలకు ప్రత్యేక స్థానం కల్పించారు. ముఖ్యంగా దక్షిణ భారత ఆలయ నిర్మాణాల్లో నవగ్రహ మండపం ఒక సాధారణ భాగంగా మారింది. శివుడిని నవగ్రహాలకు అధిపతిగా భావిస్తూ, భక్తులు శివదర్శనంతో పాటు నవగ్రహాలకు కూడా ప్రదక్షిణలు చేస్తారు. అందువల్ల శివాలయాల్లో నవగ్రహ విగ్రహాలు విస్తృతంగా కనిపిస్తాయి.
ప్రస్తుతం విష్ణు ఆలయాల్లో ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు?
ఇటీవలి దశాబ్దాల్లో నిర్మిస్తున్న అనేక విష్ణు ఆలయాల్లో కేవలం విష్ణువు మాత్రమే కాకుండా ఇందులో ఉప ఆలయాలు కూడా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో భక్తుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని నవగ్రహ మండపాలను ఏర్పాటు చేస్తున్నారు. జాతక దోష నివారణ పూజలు, శని శాంతి, రాహు-కేతు పూజలు, నవగ్రహ హోమాలు చేయాలనే భక్తుల కోరికలను తీర్చేందుకు దేవాలయ నిర్వాహకులు ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది ప్రధానంగా ఆధ్యాత్మిక సేవలను విస్తరించేందుకు తీసుకున్న నిర్ణయమే తప్ప, ప్రాచీన వైష్ణవ ఆగమ సంప్రదాయంలో తప్పనిసరి అంశం కాదు.
