Homeఆధ్యాత్మికంTholi Ekadasi 2024: నేటి తొలి ఏకాదశి ప్రత్యేకత ఏంటి? మహా విష్ణువు పురాణగాథ...

Tholi Ekadasi 2024: నేటి తొలి ఏకాదశి ప్రత్యేకత ఏంటి? మహా విష్ణువు పురాణగాథ ఏంటంటే?.

Tholi Ekadasi 2024: దేవశయని ఏకాదశి తిధికి హిందూ మతంలో ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇది ప్రతి నెల రెండుసార్లు వస్తుంది. ఒక్కొక్క ఏకాదశికి ఒక్కో ప్రాముఖ్యత ఉంటుంది. అయితే తొలి ఏకాదశి రోజున ప్రపంచాన్ని పోషించే శ్రీమహావిష్ణువును పూజిస్తారు భక్తులు. ఏకాదశి వ్రతం కూడా ఈ రోజున చేస్తారు. ఇంతకీ తొలి ఏకాదశిని ఏ రోజు జరుపుకోవాలి. ఈ పండగ ప్రత్యేకత ఏంటి? అనే వివరాలు చూసేద్దాం.

ఆషాడ మాసంలో వచ్చే తొలి ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువు క్షీర సాగరంలో యోగ నిద్రకు చేరుకుంటాడట. అంటే ఈ రోజు నుంచి చాతుర్మాసం ప్రారంభమవుతుంది అంటారు పండితులు.ఇక ఈ నాలుగు నెలలు శుభకార్యాలు కూడా ఉండవు. మూఢం నడుస్తుంటుంది. దేవశయని ఏకాదశి నుంచి దేవతని ఏకాదశి వరకు ఈ నిషేధం ఉంటుంది. హరిశయని, పద్మనాభ, యోగనిద్ర ఏకాదశి, తొలి ఏకాదశి అని ఈ ఏకాదశికి పేర్లు ఉన్నాయి. ఈ సంవత్సరం తొలి ఏకాదశి జూలై 17వ తేదీన వచ్చింది అంటున్నారు పండితులు.

ఆషాఢ శుక్ల పక్ష ఏకాదశి తేదీ 16 జూలై 2024 రాత్రి 8:33 గంటలకు ప్రారంభమైతే… జూలై 17వ తేదీ రాత్రి 9:02 గంటలకు ముగుస్తుంది. అంటే ఉపవాసం జూలై 17, 2024 బుధవారం రోజున చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇక ద్వాదశి తిథి ముగిసేలోపు ఏకాదశి వ్రతం విరమించాలి. ఉపవాసం ముగించడానికి సరైన సమయం జూలై 18న ఉదయం 5:35 నుంచి 8:20 వరకు అని చెబుతున్నారు పండితులు. మీరు గనుక ఏకాదశి వ్రతం విరమించాలనుకుంటే తులసి దవళంను నోట్లో వేసుకుంటే సరిపోతుందట.

విష్ణు మూర్తికి తులసి అంటే చాలా ఇష్టం. కనుక తులసి లేని విష్ణువు పూజ అంగీకారం కాదని చెబుతుంటారు పండితులు. అందుకే విష్ణువు కోసం చేసే పూజ, ఉపవాసంలో తులసిని తప్పనిసరిగా ఉంచాలి. అయితే విష్ణువు ఉసిరి చెట్టు మీద నివసిస్తాడట. అందుకే ఏకాదశి వ్రతంలో ఉసిరికాయకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఉసిరికాయను తినడం వల్ల ఏకాదశి వ్రతం చేసినందుకు పిల్లలకు కూడా శుభం కలుగుతుందనే నమ్మకం ఉంది. సంతానానికి అదృష్టం, ఆరోగ్యం, సంతోషం లభిస్తుంది.

ఏకాదశ వ్రతం చేసేటప్పుడు ముల్లంగి, బెండకాయ, ఆకుకూరలు, కాయధాన్యాలు, వెల్లుల్లి-ఉల్లిపాయలు మొదలైనవి ఉపవాసం విరమించేటప్పుడు ఉపయోగించకండి. బెండకాయ పిత్త దోషాన్ని పెంచుతుందట. ఇక కాయధాన్యాలు అపవిత్రమైనవిగా చెబుతుంటారు. ముల్లంగిలో చల్లని స్వభావం ఉంటుంది, అందుకే ఉపవాసం చేసిన వెంటనే ఆరోగ్యానికి మంచిది కాదు అంటారు నిపుణులు. వెల్లుల్లి, ఉల్లిపాయలు తామసిక ఆహారం అందువల్ల వీటిని పూజ సమయంలో ఉపయోగించవద్దు. వీటిని గనుక మీరు తింటే కోపం, హింస, అశాంతి వంటి భావాలు కలుగుతాయట.

దేవశయని ఏకాదశి రోజు నుంచి 4 నెలల పాటు శ్రీ మహా విష్ణువు యోగ నిద్రలోకి వెళ్తారు. మొత్తం నాలుగు నెలల పాటు యోగ నిద్రలోనే ఉంటారట మహావిష్ణువు. ఈ సమయంలో విశ్వ నిర్వహణ శివుని చేతిలో ఉంటుందని చెబుతారు పండితులు. విష్ణువు నిద్రించే ఈ నాలుగు నెలలకు చాతుర్మాసం అనే పేరు ఉంది. ఈ నాలుగు మాసాలలో శ్రావణ, భాద్రపద, అశ్వినీ, కార్తీక మాసాలు కూడా ఉంటాయి. మొత్తం మీద తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం వల్ల విష్ణు, లక్ష్మిదేవిలను పూజించడం ద్వారా జీవితంలో సుఖ సంతోషాలు, సిరి సంపదలు కలుగుతాయి అని నమ్ముతారు భక్తులు.

Swathi Chilukuri
Swathi Chilukurihttp://oktelugu
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
RELATED ARTICLES

Most Popular