Vaikunta Ekadashi 2025 Uttara Dwara Darshanam: హిందూ క్యాలెండర్ ప్రకారం కొన్ని నెలల్లో ప్రత్యేక పర్వదినాలు కొనసాగుతూ ఉంటాయి. వీటిలో ధనుర్మాసం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. వైష్ణవ ఆలయాల్లో ధనుర్మాస ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. శ్రీమహావిష్ణువుకు ప్రీతి పాత్రమైన ఈ మాసంలో ఆ స్వామిని కొలవడం వల్ల విశేష ఫలితాలు ఉంటాయని పండితులు చెబుతూ ఉంటారు. అయితే ఈ మాసంలోనే వైకుంఠ ఏకాదశి అనే పవిత్రమైన రోజు వస్తుంది. ధనుర్మాసంలో శుద్ధ ఏకాదశి రోజున వచ్చే ఈ పర్వదినం ను ప్రత్యేకంగా భావిస్తారు. ఈ రోజున శ్రీ మహావిష్ణువు ఉత్తర ద్వారం నుంచి దర్శనం ఇస్తాడు. దీంతో వైష్ణవాలన్నీ ఉత్తరం వైపు ద్వారం ఏర్పాటు చేసి భక్తులను ఆహ్వానిస్తారు. అసలు ఈ వైకుంఠ ఏకాదశికి ఎందుకు ప్రత్యేకం? దీని వెనుక ఉన్న పురాణ కథలు ఏవి?
సూర్యుడు ధనస్సు రాశిలో ప్రవేశించిన తర్వాత ఉత్తరాయానానికి మారుతాడు. ఇలా మారే మొదటి రోజునే ముక్కోటి ఏకాదశి అని అంటారు. ముక్కోటి అనగా మూడు కోట్ల దేవతలను ఒకేసారి దర్శించుకోవడం అని అర్థం. వైకుంఠ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై మూడు కోట్ల దేవతలతో కలిసి భూలోకానికి దిగి వచ్చారని చెబుతూ ఉంటారు. ఈ రోజున శ్రీ మహావిష్ణువును ఉత్తర ద్వారం నుంచి వెళ్లి దర్శించుకుంటే మూడు కోట్ల దేవతలను దర్శించుకున్న భాగ్యం కలుగుతుందని చెబుతారు. ప్రతి ఏడాదిలో 24 ఏకాదశి లు ఉంటాయి. కానీ వీటన్నిటిలో ముక్కోటి ఏకాదశి ప్రత్యేకం అని అంటారు. ఈ రోజున శ్రీమహావిష్ణువును దర్శించుకోవడం వల్ల పూర్వజన్మల పాపాలతో పాటు పూర్వీకుల బాధలు కూడా తగ్గుతాయని అంటారు.
ముక్కోటి ఏకాదశికి అనేక పురాణ కథలు ఉన్నాయి. వైఖానసుడు అనే రాజు ముక్కోటి ఏకాదశి వ్రతాన్ని నిర్వహిస్తాడు. ఈరోజు పరమ పవిత్రంగా ఉంటూ స్వామివారిని కొలవడం వల్ల పితృదేవతల నరక బాధల నుంచి విముక్తి కలుగుతుంది. పర్వత మహర్షి సూచనల మేరకు ఈ వ్రతం ఆచరిస్తాడు. అలాగే ముర అనే రాక్షసుడి బాధలు పడలేక దేవతలు శ్రీమహావిష్ణువు శరణు కోరగా.. ఆ రాక్షసుడిని సంహరించేందుకు హైమావతి అనే గుహలోకి వెళ్తాడు. అయితే అక్కడికి కూడా ముర అనే రాక్షసుడు వస్తాడు. ధ్యానంలో ఉన్న శ్రీ మహావిష్ణువుని సంహరించేందుకు ప్రయత్నించగా వైష్ణవి శక్తి రూపంలో ప్రత్యక్షమై ముర అనే రాక్షసుడిని సంహరిస్తాడు. ఆరోజు ఇదే అయినందున వైష్ణవి ఏకాదశి అనే పేరు వచ్చింది.
ఇలా ముక్కోటి ఏకాదశికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ రోజున ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని దర్శించుకోవడం వల్ల ఎంతో పుణ్యం ఉంటుందని పండితులు చెబుతున్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో పది రోజులపాటు ఉత్తర ద్వారం తెరిచి ఉంటుంది. ఈరోజుల్లో భక్తుల రద్దీ తీవ్రంగా ఉంటుంది. వైకుంఠ ఏకాదశి రోజున సాధ్యం కాని వారు మిగతా రోజుల్లో కూడా దర్శించుకోవచ్చని చెబుతూ ఉంటారు.