Lord Venkateswara: తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి ప్రపంచవ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి. స్వామివారి దర్శనానికి ఎంతోమంది ఎన్నో ప్రయాసలు పడుతూ ఉంటారు. కొంతమంది ఏడాదికి రెండు నుంచి మూడుసార్లు కూడా దర్శనం చేసుకోవడానికి ఇష్టపడతారు. అయితే తిరుమలలో ఉన్న శ్రీవారు స్వయంభుగా వెలిశారు. మిగతా వైష్ణవాలయాల్లో ఉన్న రూపం కంటే ఇక్కడ భిన్నమైన రూపం ఉంటుంది. ఈ రూపంలో ఉన్న స్వామిని దర్శించుకోవడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుందని భావిస్తారు. అయితే తిరుమలలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఒకప్పుడు మహాశివుడిగా పూజలు అందుకున్నట్లు పురాణాలు తెలుపుతున్నాయి. ఆ తర్వాత రామానుజాచార్యుల పరీక్ష నిర్వహించి ఇక్కడ వెలసింది శ్రీమహావిష్ణువు అని నిర్ధారించారు. అప్పటినుంచి వైష్ణవ సాంప్రదాయాల ప్రకారం పూజలు నిర్వహిస్తున్నారు. అసలు ఇక్కడ వెంకటేశ్వర స్వామి శైవ సాంప్రదాయంలో పూజలు ఎందుకు అందుకోవాల్సి వచ్చింది? అసలేం జరిగింది?
కొన్ని పురాణాల ప్రకారం కలియుగం ఆరంభంలో భక్తుల కష్టాలను తీర్చేందుకు శ్రీమహావిష్ణువు శ్రీనివాసుడి రూపంలో భూమి పైకి వచ్చాడని తెలుస్తోంది. ఈ క్రమంలో తిరుమలలో ఉన్న ఏడుకొండల పైన శ్రీవారు స్వయంభుగా వెలిశారు. మొదట్లో ఎలాంటి ఆభరణాలు లేకుండా స్వామివారు దర్శనం ఇచ్చేవారు. ఇక్కడ ఎవరు ఊహించని విధంగా స్వామి వారు జటాజూటం పోలిన శిరస్సు, కొన్ని ఆభరణాలు, నుదుటిపై నామం వంటి వాటితో దర్శనం ఇచ్చారు. దీంతో మొదట ఇక్కడ స్వామి వారిని శివుడు అనుకొని పూజలు చేసేవారు. అలా కొన్నాళ్లపాటు శైవ సాంప్రదాయంలో పూజలు అందుకున్న తర్వాత.. 12వ శతాబ్దంలో శ్రీ రామానుజాచార్యులు తిరుమలకు వచ్చారు. ఈ క్రమంలో ఇక్కడ వెలిసింది శ్రీమహావిష్ణువు అని చెప్పడంతో వివాదం తలెత్తింది. స్వామివారు శ్రీ మహా విష్ణువే అని నిర్ధారించేందుకు శ్రీ రామానుజాచార్యులు కొన్ని పరీక్షలు నిర్వహించినట్లు పురాణాలు చెబుతున్నాయి.
స్వామివారి మూలవిరాట్ ముందు వైష్ణవ సాంప్రదాయానికి చెందిన కొన్ని వస్తువులు, శైవ సాంప్రదాయానికి చెందిన వస్తువులు రాత్రంతా ఉంచి తలుపులు వేశారు. ఆ మరుసటి ఉదయం తలుపులు తెరిచిన తర్వాత స్వామివారి చేతిలో వైష్ణవ సాంప్రదాయానికి చెందిన పాంచ జన్య శంఖం ధరించి ఉండటంతో స్వామివారు మహావిష్ణువు అవతారమేనని రామానుజాచార్యులు ప్రకటించారు. అప్పటినుంచి స్వామివారి నామం, ఆచారాలు, పూజా విధానాలను పూర్తిగా వైష్ణవ ఆగమ శాస్త్రాల ప్రకారం మార్చి నిర్వహిస్తున్నారు.
ప్రస్తుతం శ్రీ వేంకటేశ్వర స్వామి కలియుగ అవతారుడిగా దర్శనమిస్తున్నాడు. చేతుల్లో శంఖ చక్రాలు, నుదుటిపై ఉర్త్వ పు ఉండ నామంతో, లక్ష్మీదేవితో కలిసి నిటారుగా నిలబడి భక్తులకు దర్శనం ఇస్తున్నాడు. అయితే సాధారణంగా మహావిష్ణువు ఎడమచేతి చాచి కుడి చేతితో అభయ హస్తంతో దర్శనం ఇస్తారు. కానీ ఎడమచేతు నడుము పై ఉండి.. కుడిచేతూ భక్తులకు వరాలు ఇచ్చే విధంగా కిందికి ఉంటుంది. ఇలా విగ్రహం ప్రత్యేకత ఉండడంతో స్వామి వారి దర్శనానికి భక్తులు తండోపతండాలుగా తరలివస్తూ ఉంటారు. వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత తమ జీవితంలో ఎన్నో మార్పులు వచ్చాయని ఇప్పటివరకు చాలామంది కొనియాడారు. అందుకే తిరుమలకు నిత్యం భక్తుల రద్దీ ఉంటుంది.