Tirupati Laddu : తిరుమల శ్రీవారిని ఎంత భక్తితో పూజిస్తారో.. అంతే ఇష్టంగా తిరుపతి లడ్డూను ఇష్టంతో కొనుగోలు చేస్తుంటారు. తిరుపతిలో లభించే లడ్డూ మరెక్కడా దొరకదు. మిగతా ఎన్ని లడ్డూలు ఉన్నా తిరుపతి లడ్డను బీట్ చేయలేవు. అందుకే తిరుమలకు వచ్చిన భక్తులు సాధ్యమైనంత ఎక్కువగానే కొనుగోలు చేస్తుంటారు. తమకు ఇష్టమైన వారికి తిరుపతి లడ్డూను ఇస్తూ వారి మన్ననలు పొందుతారు. అయితే తిరుపతి లడ్డూ కావాలంటే ఇప్పటి వరకు తిరుపతికి మాత్రమే వెళ్లాల్సి వచ్చేది. హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో తిరుపతి లడ్డూనూ శని, ఆదివారాల్లో మాత్రమే విక్రయించేవారు. కానీ ఇప్పుడు తిరుపతి లడ్డూ అందరికీ అందుబాటులో ఉండేలా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ వివరాల్లోకి వెళితే..
జీవితంలో ఒక్కసారైనా తిరుమలకు వెళ్లి రావాలని చాలా మంది కోరుకుంటారు. అందుకోసం నెల ముందు నుంచే ఏర్పాట్లు చేసుకుంటారు. ట్రైన్ జర్నీ చేయాలనుకునేవారు మూడు నెలల ముందు నుంచే ప్రణాళిక వేసుకుంటారు. తిరుమలలో రద్దీ కారణంగా దర్శనం, తదితర టిక్కెట్లకు సమయం కేటాయించినా.. అవి ఎప్పటికప్పుడు అమ్ముడు పోతుంటాయి. అందువల్ల తిరుపతికి వెళ్లాలని చాలా మందికి ఉన్నా .. కొందరికి టికెట్లు అందుబాటులో లేక.. కొన్ని కారణాల వల్ల కుదరక వాయిదాలు వేసుకుంటారు. ఈ తరుణంలో ఎవరైనా తిరుపతికి వెళితే వారికి ఒకటి లేదా రెండు లడ్డూలు తీసుకురావాలని చెబుతూ ఉంటారు.
తిరుపతిలో విక్రయించే లడ్డూ మహా స్పెషల్. ఇందులో నెయ్యితో పాటు జీడిపప్పు, తదితర పదార్థాలను కలపడం వల్ల ఎంతో రుచిగా ఉంటుంది. అంతేకాకుండా దీనిని పవిత్రంగా తయారు చేయడం వల్ల చాలా కాలం పాటు నిల్వ ఉంటుంది. అందుకే చాలా మంది తిరుపతి లడ్డూ కోసం ఎగబడుతూ ఉంటారు. అయితే తిరుపతి లడ్డూ అందరికీ అందేలా ఒక్కొక్కరికి కొన్ని లడ్డూలు మాత్రమే విక్రయించాలని గతంలోనే నిర్ణయించుకుంది. దీంతో కొందరు అనుకున్నలడ్డూలు రాకపోయే సరికి నిరాశ చెందుతూ ఉండేవారు.
కానీ ఇప్పుడు ఆ నిరాశ అక్కర్లేదని టీటీడీ చెబుతోంది. ఎందుకంటే హైదరాబాద్ లో ఉన్న వారికి టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతి లడ్డూను ప్రతిరోజూ విక్రయించాలని నిర్ణయించింది. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రూ.50 కే లడ్డూను విక్రయించనుంది. అయితే ఈ లడ్డూ కావాలంటే మాత్రం ఆధార్ కార్డు చూపించాలని తెలిపారు.
తిరుపతి, హైదరాబాద్ లోనే కాకుండా పలు ప్రాంతాల్లో లడ్డూను విక్రయించాలని చూస్తున్నారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం, గోవిందరాజస్వామి ఆలయం, శ్రీనివాస మంగాపురంలోని కల్యాణ వేంకటేశ్వర ఆలయం, అప్పల యాగుంట ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయంలో, ఒంటిమిట్టలోని కోదండ రామ స్వామి ఆలయంలోనూ తిరుపతి లడ్డూను విక్రయించనున్నారు. అలాగే విజయవాడ, విశాఖపట్నం, అమరావతి, రంపచోడవరం, చెన్నైలోని శ్రీవారి ఆలయాల్లో తిరుపతి లడ్డూ లభ్యం కానుంది. దీంతో తిరుపతి లడ్డూ కావాలనుకునేవారి కష్టాలు ఇక తొలగినట్లేనని కొందరు భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తిరుపతి లడ్డూ అందరికీ అందుబాటులో ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ అధికారులు చెబుతున్నారు.
Chai Muchhata is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Read More