Mauni Amavasya 2026: హిందూ సాంప్రదాయం ప్రకారం అమావాస్యను కూడా ప్రత్యేకమైన రోజుగా భావిస్తారు. కొన్ని అమావాస్య రోజుల్లో చేసే కార్యక్రమాల వల్ల జీవితం సంతోషకరంగా మార్చుకునే అవకాశం ఉంటుందని పండితులు చెబుతున్నారు. వీటిలో మౌని అమావాస్య గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. పుష్య మాసంలో వచ్చే అమావాస్యను మౌని అమావాస్య అంటారు. మౌని అనగా నిశ్శబ్దంగా ఉంటూ ఏకాగ్రత పాటించడం. సూర్యుడు దక్షిణం నుంచి ఉత్తరాయానం ప్రారంభం అయిన తర్వాత సాధువులు మౌనంగా ఉంటూ తపస్సు చేస్తుంటారు. ఇలా మౌనంగా ఉండి చేసే తపస్సుని మౌని అమావాస్య అని అంటారు. ఈరోజు మనసును ఏకాగ్రతను చేసుకోవడానికి నిశ్శబ్దంగా పాటిస్తారు. అలాగే ఈరోజు త్రివేణి సంగమం లేదా నది స్నానం చేయడం వల్ల ఎంతో పుణ్యఫలం ఉంటుందని చెబుతుంటారు. ఇంకా ఈరోజు ఏమేం చేయాలంటే?
2026 జనవరి 18వ తేదీన ఆదివారం మౌని అమావాస్య రాబోతుంది. సాధారణంగానే ఆదివారం రోజున సూర్యుడికి ఎక్కువగా బలం ఉంటుంది. అలాగే ఈరోజు ప్రత్యేకంగా అమావాస్య రావడంతో ఈ రోజున సూర్యోదయానికి ముందు.. సూర్యోదయం అయిన తర్వాత 90 నిమిషాల లోపు పవిత్ర స్నానం చేయడం వల్ల గ్రహదోషాలు తొలగిపోతాయని అంటుంటారు. కుజ దోషం ఉన్నవారు ఈ రకమైన స్నానం చేయడం వల్ల ఫలితం ఉంటుందని అంటున్నారు. అలాగే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారు సైతం నది లేదా సముద్ర స్నానం చేయడం వల్ల పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందుతారని చెబుతున్నారు.
ఈ మౌని అమావాస్య రోజున పితృ కార్యాలు చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయని అంటున్నారు. జాతకంలో పితృ దోషాలు ఉన్నవారు ఈ రోజున అన్నదానం, పెరుగు దానం, గుమ్మడికాయ దానం చేయడం వల్ల వారి అనుగ్రహాన్ని పొందుతారని చెబుతుంటారు. బ్రాహ్మణుడికి బూడిది గుమ్మడికాయ దానం చేయడం వల్ల అంతటి బంగారం దానం చేసిన ప్రతిఫలం కలుగుతుందని అంటుంటారు. అంతేకాకుండా సంక్రాంతి రోజున ఆచరించవలసిన దానాలు చేయలేని వారు ఈ రోజున చేయడం వల్ల వారికి సమాన ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు. సాధారణంగా అమావాస్య అనగానే కొందరు దైవకార్యాలు చేయడానికి ఇష్టపడరు. కానీ ఈ రోజున కాలభైరవ ఆరాధన, వీరభద్రుడి ఆరాధన, మహంకాళి వంటి ఉగ్రదేవతల ఆరాధన చేయడం వల్ల విశేషమైన ఫలితాలు ఉంటాయి. అప్పుల బాధ ఉన్నవారు, ఆర్థిక సమస్య నుంచి బయట పడాలని అనుకున్న వారు కాలభైరవుడని సందర్శించి మినప గారెలను, బూడిది గుమ్మడి దీపాన్ని వెలిగించినట్లయితే ఆ సమస్యలు తొలగిపోతాయని అంటున్నారు. అలాగే మానసిక, శారీరక ఇబ్బందులు ఉన్నవారు వీరభద్ర స్వామిని దర్శించి బిల్వదళాలతో అర్చన చేయాలని అంటున్నారు.