Sabarimala: చుట్టూరా ఎత్తైన కొండలు.. విస్తారంగా పారే నదులు.. అన్నిటికీ మించి పచ్చదనం.. కనుచూపుమేరా ఆహ్లాదకరమైన వాతావరణం.. ఇలా చెప్పుకుంటూ పోవాలి గాని శబరిమలై వర్ణన ఒక పట్టాన పూర్తికాదు. అందువల్లే ప్రతి ఏడాది శబరిమలై వెళ్లి.. అయ్యప్ప స్వామిని దర్శించుకోవాలని భక్తులు ఆసక్తి చూపిస్తుంటారు. 41 రోజులు అత్యంత నిష్టగా దీక్ష చేసి.. అయ్యప్ప స్వామి సేవలో తరిస్తుంటారు.
అయ్యప్ప స్వామి ఆలయం ప్రకృతి ఒడిలో ఉంటుంది. స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు దట్టమైన అడవిలో నడక మార్గంలో వెళ్లాల్సి ఉంటుంది. స్వామివారిని దర్శించుకోవాలనే తాపత్రయం ముందు ఈ కష్టం అంత పెద్దది కాదని అయ్యప్ప మాలదారులు అంటుంటారు. స్వామివారిని చూసిన తర్వాత ఈ కష్టాలు మొత్తం పెద్ద లెక్కలోకి రావని వారు అభిప్రాయపడుతుంటారు. అయ్యప్ప స్వామి దర్శనం సకల పాపాల హరణం అని మాలధారులు అభిప్రాయపడుతుంటారు.
అయ్యప్ప దర్శనం అద్భుతం అయినప్పటికీ.. ఇటీవల కాలంలో అక్కడ చోటుచేసుకుంటున్న సంఘటనలు భక్తులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా శబరిమల యాత్రికులకు రెండు చోట్ల గుండె పోటు ముప్పు పొంచి ఉండడం కలకలం రేపుతోంది. దీని అంతటికి ప్రధాన కారణం సముద్రమట్టానికి ఎత్తైన ప్రాంతంలోకి మాలదారులు వెళ్తుండడమే.. ఉపవాసాలు, నిర్జలీకరణ, ఆక్సిజన్ లభ్యత తక్కువ ఉండడం వల్ల ఇటువంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా కేరళ వైద్య ఆరోగ్యశాఖ చెబుతుండడం విశేషం. పంపా బేస్ నుంచి శబరిమల వెళ్లే చిన్న పాదం మార్గంలో అత్యంత కఠినమైన మార్గంగా నీలిమల ప్రాంతం ఉంటుంది. కొండ శిఖరాగరంలో అప్పాచి మేడు వద్ద గుండెపోట్లు ఎక్కువగా సంభవిస్తున్నాయని కేరళ వైద్య ఆరోగ్యశాఖ చెబుతోంది.
ప్రతి ఏడాది నీలిమల, అప్పాచి మేడు ప్రాంతాలలో భక్తులకు గుండెపోట్లు వస్తున్నాయి. ట్రావెన్ కోర్ దేవస్యం, కేరళ వైద్య ఆరోగ్యశాఖ, పోలీస్ క్రైమ్ డేటా రికార్డ్ బ్యూరో గణాంకాల ప్రకారం గడిచిన ఏడు సంవత్సరాల లో చాలామంది మృతి చెందారు. 2017, 18 సీజన్లో 281 మంది గుండెపోటు బారిన పడగా.. ఇందులో 38 మంది చనిపోయారు. 2018, 19 కాలంలో 173 గుండెపోటు కేసులు నమోదయ్యాయి. ఇందులో 24 మంది చనిపోయారు. 2019, 20 కాలంలో 19, 2022, 23 కాలంలో 24 మంది, 2023, 24 కాలంలో 24 మంది, 2024, 25 కాలంలో 40 మంది గుండెపోటుతో చనిపోయారు. 2025, 26 సీజన్ ఇప్పటికే మొదలైంది. అయితే ఇందులో ఒక మహిళ గుండెపోటుతో చనిపోయింది. మరోవైపు ఒక జాతీయ ఆంగ్ల పత్రికలో 8 మరణాలు నమోదు అయినట్టు కథనం ప్రచురితమైంది. 2020,22 కాలంలో మాత్రం కోవిడ్ వల్ల పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించారు. ఆ సమయంలో ఎటువంటి గుండెపోటు మరణాలు నమోదు కాలేదు.