AP Weather: మండే ఎండలు ఒక వైపు.. ఈదురు గాలులతో కూడిన వర్షాలు మరోవైపు. ఏపీలో ఇలా భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. అత్యధిక ఉష్ణోగ్రతల నమోదు తో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. కానీ సాయంత్రానికి మేఘావృతమై.. ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతుండడంతో ఉపశమనం పొందుతున్నారు. ఆదివారం రాష్ట్రం నిప్పులకొలిమిగా మారింది. కానీ సాయంత్రానికి కొన్ని జిల్లాల్లో భారీ వర్షం పడింది.శ్రీకాకుళం, అనకాపల్లి, కర్నూలు జిల్లాలో ప్రధానంగా భిన్న వాతావరణం కనిపించింది. మరోవైపు చాలా జిల్లాల్లో వడగాల్పులు వీచాయి. వేడి గాలులతో ప్రజలు సతమతమయ్యారు.
ఈ ఏడాది ముందుగానే వేసవి పలకరించింది. మార్చి నుండే ఎండలు మండాయి. పగటి ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలకు దాటాయి. దేశంలోనే తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగాయి. ఎండ తీవ్రత, ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోయారు.ఇంకా నడి వేసవి సమీపించకుండానే ఎండలు మండిపోయాయి.అయితే అకాల మేఘాలు, వర్షాలతో కొన్ని జిల్లాల్లో ప్రజలు ఉపశమనం పొందుతున్నారు. చాలా జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. పంటలకు వర్షంతో నష్టం కలిగింది.
శ్రీకాకుళం జిల్లాలో అయితే ఆదివారం సాయంత్రం నుంచి ఈదురు గాలులు వీచాయి. మధ్యాహ్నం వరకు తీక్షణమైన ఎండ ఉండగా.. సాయంత్రానికి మేఘాలు కమ్ముకున్నాయి. ఈదురు గాలులు ప్రారంభమయ్యాయి. ఉరుములు మెరుపులతో భయానక పరిస్థితి నెలకొంది. ఆదివారం అర్ధరాత్రి వరకు అలానే ఉంది పరిస్థితి. ఈదురు గాలులకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జీడి మామిడి పంటలకు సైతం అపార నష్టం కలిగింది. అనకాపల్లి, కర్నూలు, ప్రకాశం జిల్లాలో సైతం ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. మొత్తానికైతే వేసవిలోనే చిరుజల్లులు పడుతుండడం, వాతావరణం చల్లబడుతుండడం ఉపశమనం కలిగిస్తోంది.