Jagannath Temple rituals: సాధారణంగా ఎవరైనా ఆలయానికి వెళ్తే గుడి ముందరి భాగం చూస్తారు.. దేవుడి దర్శనం చేసుకుంటారు. కాసేపు పరిసరాలలో ఉండి ఆధ్యాత్మిక చింతన పొందుతారు. అయితే ప్రతి ఆలయం పైన ఒక జెండా ఎగురుతూ ఉంటుంది. ఈ జెండా గురించి పెద్దగా ఎవరూ పట్టించుకోరు. అంతేకాకుండా ఈ జెండాను ఎప్పుడో ఒకప్పుడు మారుస్తూ ఉంటారు. కానీ ఈ ఆలయంలో మాత్రం ఒక్కరోజు ఈ జెండాను మార్చకపోయినా 18 సంవత్సరాలు గుడిని మూసేయాల్సి వస్తుంది. ఎనిమిది వందల సంవత్సరాల కిందట జరిగిన ఒక సంఘటన కారణంగా అప్పటినుంచి ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు. ఇంతకీ ఆ జెండాను ఎందుకు మార్చాలి? జెండాను ఎవరు మారుస్తారు? ఎప్పుడు మారుస్తారు?
భారతదేశంలో ఉన్న ప్రముఖ ఆలయాల్లో పూరి జగన్నాథ్ ఆలయం ఒకటి. ప్రతి ఏడాది ఆషాడ మాసంలో ఇక్కడ రథయాత్ర ఎంతో వైభవంగా సాగుతూ ఉంటుంది. శ్రీకృష్ణుడు, బలరాముడు, సుభద్రలు కలిసి పూరి నగర విహారం చేసేందుకే ఈ యాత్ర నిర్వహిస్తారని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాకుండా పూరి జగన్నాథ్ ఆలయంలో కర్రతో చేసిన విగ్రహాలు ఉండడం విశేషం. మిగతా ఆలయాల కంటే ప్రత్యేకమైన విశేషాలు కలిగి ఉన్న ఈ ఆలయం పై ఉన్న జెండా గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
పూర్వకాలంలో ఒక ఆచారుడికి కలలో జగన్నాథ స్వామి కనిపించాడట. ఆ స్వామి అసంతృప్తిగా ఉన్నట్లు కనిపించాడు. అందుకు కారణం ఆలయం పై ఉన్న జెండా చిరిగిపోవడమే. అయితే మరుసటి రోజు ఆలయానికి వెళ్లిన పూజారికి జెండా చిరిగినట్లు కనిపించింది. దీంతో స్వామి వారి జెండాను ఎప్పటికప్పుడు కొత్తదిగా ఉంచాలన్న ఉద్దేశంతో ప్రతిరోజు జెండాను మారుస్తున్నారు. ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు జెండాను మార్చే విశేషమైన కార్యక్రమం ఉంటుంది. ఈ సమయంలో భక్తులు ప్రత్యేకంగా వీక్షిస్తుంటారు. అయితే ఆలయం పై ఉన్న జెండాను మార్చడం అంటే ఆషామాషీ కాదు. ఎందుకంటే 214 అడుగుల ఎత్తు ఉన్న గోపురంపై ఎక్కి జెండాను మార్చాల్సి ఉంటుంది. గోపురం పైన భారీగా ఉన్న సుదర్శన చక్రం ఉంటుంది. దీనిపై జెండా ఎగురుతుంది. ఈ జెండాను చోళ వంశానికి చెందినవారు మాత్రమే మారుస్తారు.
అయితే ఎంతో పవిత్రత కలిగిన ఈ జెండా ఒక్కరోజు మార్చకపోయినా 18 సంవత్సరాలు ఆలయాన్ని మూసివేయాల్సి వస్తుందని.. అందువల్ల క్రమం తప్పకుండా జెండాను మారుస్తూ ఉంటారు. జెండాను మార్చి కార్యక్రమాన్ని ధ్వజపరివర్తన్ అని అంటారు. ఈ జెండా విశిష్టత ఏంటంటే గాలికి ఇది వ్యతిరేక దిశలో ఉంటుంది. ఈ ఆలయంలో సాక్షాత్తు శ్రీకృష్ణుడు కొలువై ఉన్నాడని.. అందుకే ఈ విశిష్టత కలిగి ఉందని కొందరు నమ్ముతూ ఉంటారు.
పూరి జగన్నాథ్ ఆలయంలో రాతి విగ్రహాలు కాకుండా కర్రతో తయారుచేసిన విగ్రహాలు ఉంటాయి. వీటిని 12 లేదా 19 సంవత్సరాలకు ఒకసారి మారుస్తారు. అలాగే ప్రతి ఏడాది జరిగే రథయాత్ర ఎంతో వైభవంగా ఉంటుంది. ఈ రథయాత్రలో ఉండే వ్రతాలు ప్రతి సంవత్సరం కొత్తవి తయారు చేస్తారు.