Srikalahasti Temple: భారతదేశంలో గ్రహణాల సందర్భంగా ప్రత్యేక ఆచారాలు పాటిస్తారు. గ్రహణం నేరుగా చూడొద్దని.. ఈ సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని కొందరు పండితులు చెబుతారు. అంతేకాకుండా ఈ కాలాన్ని సూతకాలమని భావిస్తారు. గ్రహణం సమయంలో ఎలాంటి ఆహార, పానీయాలు తీసుకోకూడదని.. శుభకార్యాలు నిర్వహించకూడదని అంటూ ఉంటారు. దీంతో ఆలయాలను మూసివేస్తారు. గ్రహణానికి ముందు మూసివేసిన ఆలయం.. తిరిగి సంప్రోక్షణ అయిన తర్వాతనే తెరిచి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అయితే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక ఆలయం మాత్రం గ్రహణం సమయంలో తెరిచే ఉంటుంది. అంతేకాకుండా ఈ సమయంలో ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇంతకీ ఆ ఆలయం ఎక్కడ ఉందంటే?
సాధారణంగా గ్రహణ సమయంలో ఆలయాలు తెరిచి ఉండడం వల్ల దోషం ఏర్పడుతుందని భావిస్తారు. అందుకే ఈ సమయంలో ఆలయం మూసివేస్తారు. అయితే తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి లో ఉన్న ఆలయం గ్రహణ సమయంలో తెరిచే ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ గ్రహణ సమయంలో రాహు, కేతువుల పూజలు నిర్వహిస్తారు. ఈ ప్రదేశంలో శ్రీకాళహస్తీశ్వరుడు స్వయంభుగా వెలిశాడని పేర్కొంటారు. ఇక్కడున్న స్వామికి 9 గ్రహాలు, 27 నక్షత్రాలతో అలంకారం ఉంటుంది. చాలామందికి రాహు, కేతువు, సర్ప దోషాలు ఉంటాయి. అయితే వీటి ప్రభావం ఉండకుండా గ్రహణం రోజు జాగ్రత్తలు పాటిస్తారు. కానీ శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో అమ్మవారికి వడ్డాణంలా నాగాభరణం అలంకారంగా ఉంటుంది. ఇలా ఉండడంతో దోష నివారణ కోసం భక్తులు ఇక్కడికి తరలి వస్తుంటారు. అలాగే గ్రహణ సమయంలో ఇక్కడ శాంతి పూజలు నిర్వహిస్తూ ఉంటారు.
దాదాపు 5 దశాబ్దాల క్రితమే ఇలా గ్రహణ సమయంలో రాహు, కేతువు పూజలు నిర్వహిస్తున్నారు. ఈ ఆలయంపై గ్రహణ ప్రభావం ఏమాత్రం పడకుండా ఈ ఆలయంను ఎంతో నైపుణ్యంతో నిర్మించారు. పురాతన కాలం నుంచి ఇక్కడికి భక్తులు తరలివస్తున్నారు. రాహు కేతు, సర్ప దోష నివారణ కోసం ఇక్కడ రోజుల తరబడి పూజలు చేస్తుంటారు. ఎలాంటి దోషం ఉన్నా.. ఇక్కడ నిర్వహించే పూజలతో ఫలితం ఉంటుందని భావిస్తారు.
శ్రీకాళహస్తికి వెళ్లిన తర్వాత తిరిగి నేరుగా ఇంటికి రావాలని విషయం చెబుతారు. ఎందుకంటే మిగతా ఆలయానికి వెళ్లిన తర్వాత చివరికి ఈ ఆలయానికి వెళ్లాలని అంటారు. ఈ ఆలయం నుంచి మరో ఆలయం వెళ్తే ఎలాంటి పుణ్యం ఉండదని.. అందువల్ల నేరుగా ఇంటికి రావాలని చెబుతారు. 2025 సంవత్సరంలో సెప్టెంబర్ 7న చంద్రగ్రహణం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.