Sri Rama Navami: రాముడు ఉత్తర భారత దేశంలోని అయోధ్యలో జన్మించినప్పటికీ.. వనవాసంలో భాగంగా దక్షిణ ప్రాంతానికి సీతా సమేతంగా వచ్చాడు. భద్రాచలం, దుమ్ముగూడెం ప్రాంతాలలో సంచరించాడు. దమ్మక్కకు కలలో కనిపించడం.. నాటి భక్త రామదాసు స్వామివారికి గుడి కట్టించడంతో భద్రాచలంలో కొలువయ్యాడు. రాముడికి మనదేశంలో ప్రతి గ్రామంలో గుడి ఉన్నప్పటికీ.. భద్రాచలంలో జరిగే కళ్యాణం విభిన్నం.
ప్రతి ఏటా శ్రీరామనవమి నాడు భక్త రామదాసు చేయించిన ఆభరణాలతోనే సీతారాములకు కళ్యాణం జరిపిస్తారు. సీతారామచంద్రస్వామికి ప్రస్తుతం 67 కిలోల బంగారం, 980 కిలోల రజతం ఉంది. స్వామి కళ్యాణం, ముఖ్య ఉత్సవాల సమయంలో భక్త రామదాసుగా చరితార్థుడైన కంచర్ల గోపన్న చేయించిన ఆభరణాలను ఉపయోగిస్తారు. వజ్రాలు పొదిగిన, విలువైన పచ్చలు అమర్చిన సుందరమైన పతకం, కెంపులు అమర్చి, ముత్యాలతో వేలాడే చింతాకు పతకం, వజ్రాలు అమర్చిన కిరీటం, కలికితురాయి.. ఇంకా ఎన్నో విలువైన ఆభరణాలను రామదాసు రాముడి కోసం చేయించాడు.
నాడు భక్త రామదాసును ను తానీషా కారాగారంలో బంధించిన సమయంలో ఆలపించిన కొన్ని కీర్తనల్లో ఈ ఆభరణాల ప్రస్తావన ఉండడం విశేషం.”ఇక్ష్వాకుల కుల తిలకా.. ఇకనైనా పలకవే రామచంద్రా.. సీతమ్మకు చేయిస్తే చింతాకు పతకం రామచంద్రా.. ఆ చింతాకు పతకానికి పట్టేనూ 10,000 వరహాలు రామచంద్ర.. కలికితురాయి నీకు పొలుపుగా చేయిస్తి రామచంద్రా.. ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్రా” అని రామదాసు ఆక్రోషించాడు. కారాగారంలో సైనికులు కొట్టే దెబ్బలకు తట్టుకోలేక రాముడిని తిట్టాడు. రామదాసును జైలు నుంచి విడిపించేందుకు తానిషాకు రామలక్ష్మణులు సమర్పించారని చెబుతున్న బంగారు రామ మాడ నాణాలు కొన్ని ఈనాటికి భద్రాద్రి ఆలయంలో ఉన్నాయి. రామ టెంకి గా పిలిచే ఈ నాణం పై దేవ నాగరి లిపి ముద్రించి ఉంది.
వేశ్య సమర్పించిన నీలపురాయి
శ్రీరామనవమి నాడు రాముల వారు ధరించే రవ్వల వైరముడి మధ్యలో గల నీలపురాయిని మద్రాస్ కు చెందిన ఓ వేశ్య సమర్పించింది. తూము నరసింహాదాసు స్థీరికరించిన మహా రాజ సేవోత్సవం సందర్భంగా ఆయన రాసిన ఒక కీర్తన “పూజ సేయరే స్వామికి.. బంగారు పూలతో పూజ సేయరే స్వామికి” అన్వయిస్తూ చిన జీయర్ స్వామి 108 బంగారు పుష్పాలు సమర్పించారు. సయ్యద్ మీరా అనే ముస్లిం భక్తుడు బంగారు తోడాలు అంద చేశారు. భక్త రామదాసు చేయించిన 30 తులాల మూడు మంగళ సూత్రాలతోనే సీతమ్మకు సూత్ర ధారణ చేస్తారు.
కళ్యాణం ఇలా..
మూలవరులకు ముందుగా ప్రత్యేక అలంకరణ చేస్తారు. ఏకాంతంగా కళ్యాణం నిర్వహిస్తారు. అనంతరం స్వామి(ఉత్సవ విగ్రహాలు) వారిని పల్లకిలో కళ్యాణ వేదిక వద్దకు తీసుకొస్తారు. ముందుగా తిరు కళ్యాణానికి సంకల్పం చెప్తారు. ఎటువంటి ఆటంకాలు ఎదురుగా కాకుండా ఉండేందుకు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం చేసి.. కళ్యాణ క్రతులకు వినియోగించే సామగ్రికి సంప్రోక్షణ చేస్తారు. తర్వాత రక్షాబంధనం, యోక్త్ర బంధనం నిర్వహిస్తారు. అనంతరం ఎనిమిది మంది వైష్ణవులకు తాంబూలాది సత్కారాలు చేస్తారు. కన్యావరణం జరుపుతారు. అనంతరం సీతారాముల ఇరువంశాల గోత్రాలను పఠిస్తారు. పరిమళభరిత తీర్థంతో స్నానం చేయిస్తారు. గోదానం చేసి మహా సంకల్పం చెబుతారు. ఈ సంకల్పానికి అనుగుణంగా కన్యాదానం జరుగుతుంది. అనంతరం మంగళ వాయిద్యాలు మారుమోగుతుండగా వేదమంత్రాల సాక్షిగా అభిజిత్ లగ్నం సమర్పించగానే జీలకర్ర, బెల్లం మిశ్రమాన్ని సీతారాముల శిరస్సులపై ఉంచుతారు.
మాంగల్య పూజలో మంగళసూత్రాలతో ముగ్గురు అమ్మవార్లను ఆవాహన చేస్తారు. 9 పోగులతో మూడు సూత్రాలతో తయారయ్యే మంగళసూత్రం ఎన్నో వేదాంత రహస్యాలను చాటి చెబుతుందని వైదికులు అంటుంటారు. ఆ తొమ్మిది పోగులు వివిధ సంబంధాలకు ప్రతీకలని వివరిస్తుంటారు. సూత్రంలో గౌరీదేవిని, సూత్రం మధ్యలో సరస్వతిని, సూత్ర గ్రహంలో మహాలక్ష్మిని ఆవాహన చేస్తారు. ఆ ముగ్గురు అమ్మలు ఆవాహన అయిన తర్వాత మంగళసూత్రాలలో భక్త రామదాసు చేయించిన మంగళ పతకాన్ని కలిపి ధరింప చేస్తారు. దీంతో మంగళసూత్ర ధారణ పూర్తవుతుంది. ఆ తర్వాత వైష్ణవ సంప్రదాయం ప్రకారం అర్చక స్వాములు బంతులాట ఆడుతారు. అనంతరం సీతారాముల శిరస్సుపై వేద పండితులు మంత్రాలు చదువుకుంటూ తలంబ్రాలు పోస్తారు. ఇదే సమయంలో కర్పూర నీరాజనం సమర్పిస్తారు. చతుర్వేదాలతో సీతారాములకు ఆశీర్వచనాలు ఇస్తారు. దీంతో కళ్యాణ క్రతువు పూర్తవుతుంది.