Mauni Amavasya 2026: హిందూ శాస్త్రం ప్రకారం పౌర్ణమి, అమావాస్య రోజులను ప్రత్యేకంగా భావిస్తారు. వీటిలోనూ కొన్ని అమావాస్యలు పర్వదినాలుగా భావిస్తారు. ప్రతి ఏడాది పుష్య మాసంలో వచ్చే అమావాస్యను మౌని అమావాస్య అంటారు. మౌని అనగా ఈరోజు మొత్తం మౌనంగా ఉండి ఏకాగ్రతతో దైవనామస్మరణ చేయడం అని అంటారు. అలాగే మౌని అమావాస్య రోజున సముద్ర లేదా నదీ స్నానం చేయడం వల్ల ఎంతో పుణ్యఫలం ఉంటుందని భావిస్తారు. మాఘమాసం ప్రారంభానికి ముందు వచ్చే ఈ అమావాస్య రోజు కొన్ని పనులవల్ల విశేష ఫలితాలు కలిగితే.. మరికొన్ని పనుల వల్ల అశుభాలు జరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల ఈరోజు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇంతకీ ఈరోజు ఎలా ఉండాలంటే?
మౌని అమావాస్య రోజున మౌనవ్రతం పాటించడం వల్ల ఎంతో పుణ్యఫలం వస్తుందని అంటుంటారు. ఈరోజు మౌనంగా ఉండడం వల్ల కొన్ని చెడు మాటలను అనకుండా నియంత్రించుకునే అవకాశం ఉంటుంది. ఈరోజు అంతా ఎలాంటి చెడు పనులు చేయకుండా ఉండడం వల్ల భవిష్యత్తులో వాటిపై ఆలోచన కూడా కాకుండా ఉంటుందని అంటుంటారు. మాటలు చేతలు చేయకుండా ఉంటే ఆత్మ శుద్ధి అయి ఆత్మశక్తి పెరుగుతుందని భావిస్తారు. అందుకే ఈరోజును మౌని అమావాస్య అని అంటారు.
మౌని అమావాస్య రోజున నది లేదా సముద్ర స్నానం చేయడం ఎంతో మంచిదని అంటున్నారు. ఈ అమావాస్య ఆదివారం రోజు రావడంతో మరింత విశిష్టతను కలిగి ఉంది. సాధారణంగానే సూర్యుడు ఆదివారం రోజున అత్యధిక శక్తిని కలిగి ఉంటాడు. ఈ సమయంలో సూర్యకిరణాలు పడిన నీటితో స్నానం చేయడం వల్ల కోటిజన్మల పాపాలు పోతాయని భావిస్తారు. ఈరోజు నదుల్లోని నీరు పవిత్ర జలంగా మారుతాయని భావిస్తారు.
మౌని అమావాస్య రోజున పితృదేవతలను స్మరిస్తూ వారికి పుణ్య కార్యాలు చేయడం వల్ల విశేష ఫలితాలు ఉంటాయని అంటారు. అలాగే దానధర్మాలు కూడా చేయడం కూడా చాలా మంచిదని అంటుంటారు. ఈరోజు అన్నదానం వస్త్ర దానం, గోదానం చేయడం వల్ల అక్షయ ఫలితం లభిస్తుందని చెబుతారు.
అయితే మౌని అమావాస్య ఫలితం పొందాలంటే ఈరోజు కొన్ని పొరపాట్లు చేయకుండా ఉండాలి. ఈరోజు పవిత్రంగా ఉండాలని అనుకునే వారు సూర్యోదయానికి ముందే లేదా సూర్యోదయం అయిన తర్వాత నది స్థానం చేయడం చాలా మంచిది. ఈరోజు మౌనవ్రతం ఆచరించేవారు చాలా తక్కువగా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా చెడు మాటలను అసలే వదలదు. ప్రతి చిన్న విషయానికి కోపం తెచ్చుకోవడం.. అనవసరపు సంభాషణలు చేయడం.. ప్రతి విషయంలో వితండవాదం చేయడం.. తప్పుడు సంభాషణలు చేయడం వంటివి ప్రతికూల ఫలితాలను ఇస్తాయని పండితులు చెబుతున్నారు. మౌనవ్రతం పాటించలేని వారు సైతం ఈ నియమాలు పాటించడం వల్ల విశేష ఫలితాలు ఉంటాయని అంటున్నారు. అంతేకాకుండా ఈరోజు నెగిటివ్ ఆలోచనలకు దూరంగా ఉంటూ సాత్విక మనసుతో ఉండాలని అంటున్నారు.