Lingodbhava Kalam 2026: శివుడు అభిషేక ప్రియుడు. భక్తసులభుడు కూడా. దేవుళ్ళ యందు శంకరుడు ఎంతో శ్రేష్టుడు. అందువల్లే శంకరుడికి పూజ చేస్తే ఎన్నో జన్మల పుణ్యం లభిస్తుంది. పాపాలు తొలగిపోతాయి. శివరాధన వల్ల మోక్షం లభిస్తుంది. సామ్రాజ్యసిద్ధి కలుగుతుంది.
శివుడికి పూలు అంటే చాలా ఇష్టం. ఆరాధన అత్యంత ప్రీతిపాత్రం. ఏ పేరుతో పిలిచినా పలుకుతాడు శంకరుడు. అందువల్లే 8 విభూతులను, సమస్తంగా సంపదలను పరిపూర్ణంగా అందిస్తాడు శంకరుడు.
శివరాత్రి రోజున శంకరుడు లింగం రూపంలో ఆవిర్భవిస్తాడు. సమస్త భక్తకోటిని అనుగ్రహిస్తుంటాడు. అందువల్లే భక్తులు మహాశివరాత్రిని పరమ పుణ్య పవిత్ర దినంగా భావిస్తుంటారు. ఆరోజున శివుడిని ఆరాధిస్తే జన్మ చరితార్థం అవుతుంది. అందువల్లే జన్మకో శివరాత్రి అని సామెత పుట్టింది. శివుడిని స్మరించడం వల్ల స్వామి అనుగ్రహం కలుగుతుంది.
మహాశివరాత్రి రోజు స్వామివారి నామస్మరణ చేస్తే పరిపూర్ణమైన అనుగ్రహం లభిస్తుంది. మహాశివరాత్రి రోజు లింగోద్భావ కాలం ఏర్పడుతుంది. కొన్ని సందర్భాలలో లింగోద్భవ కాలం అర్ధరాత్రి పూట కాస్త అటు ఇటుగా వస్తూ ఉంటుంది.
ఈ ఏడాది లింగోద్భవ కాలం రాత్రి 12 గంటల మూడు నిమిషాల 10 సెకండ్ల నుంచి 12 గంటల 53 నిమిషాల 52 సెకండ్ల వరకు ఉంటుంది . సమయంలో శివుడికి అభిషేకం జరిపితే ఎంతో పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
వివిధ కారణాల వల్ల శివుడికి అభిషేకం జరప లేనివారు పంచాక్షరి మంత్రాన్ని జపిస్తే.. శివుడు అనుగ్రహిస్తాడని.. సకల పాపాల నుంచి తొలగిస్తాడని శివపురాణం చెబుతోంది. శివరాత్రి రోజు నుదుటన విభూతి రేఖలు ధరించాలని.. రుద్రాక్షలను మెడలో మాలగా ధరిస్తే పుణ్యం లభిస్తుందని.. స్వామివారి సన్నిధిలో దీపాలు వెలిగిస్తే.. పరమేశ్వరుడి కరుణాకటాక్షాలు లభిస్తాయని వేద పండితులు చెబుతున్నారు.
శివరాత్రి రోజున శివపార్వతుల కళ్యాణం జరుగుతూ ఉంటుంది. ఈ కళ్యాణాన్ని వీక్షించిన వారికి పుణ్యం లభిస్తుందని శివపురాణం చెబుతోంది. కొన్ని ప్రాంతాలలో నిర్వహించే శివకళ్యాణాలలో భక్తులు ఆది దంపతులకు తల్లిదండ్రులుగా వ్యవహరిస్తుంటారు. అలాంటి క్రతువులో పాల్గొనడం తమ జన్మజన్మల భాగ్యమని భావిస్తుంటారు. అటువంటి వారికి కార్యసిద్ధి.. మోక్ష సిద్ది లభిస్తుందని శివపురాణంలో ఉంది.