Karthika Masam 2025: హిందూ క్యాలెండర్ ప్రకారం కొన్ని నెలలకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. వాటిలో శ్రావణమాసం, కార్తీక మాసం లను అత్యంత పవిత్రంగా భావిస్తారు. వీటిలో కార్తీకమాసంలో శివకేశవలకు పూజలు చేయడం వల్ల అన్ని రకాల అనుకూలమైన ఫలితాలు ఉంటాయని భావిస్తారు. కార్తీక మాసంను ఆధ్యాత్మిక మాసంగా పేర్కొంటారు. ఈ నెలలో ప్రతిరోజు దీపారాధన చేయడంతో పాటు ఉపవాసం ఉండడం, దానధర్మాలు చేయడం, పితృదేవతలను స్మరించుకోవడం వల్ల ఏడాది పాటు సుఖసంతోషాలతో జీవిస్తారని భక్తులు నమ్ముతారు. దీపావళి తర్వాత రెండు రోజుల నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతుంది. అయితే ఈ నెలలో వచ్చే పౌర్ణమి వరకు ప్రతిరోజు దీపాలు వెలిగిస్తూ ఉంటారు. సాయంత్రం ఇంటిముందు, ఆలయాల్లో, నదీ తీరంలో దీపం వెలిగించడం వల్ల విశేష ఫలితాలని పొందుతారని భావిస్తారు. అయితే ఇంట్లో దీపం వెలిగించే మహిళలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సమయంలో అజాగ్రత్తగా ఉంటే పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. మరి కార్తీకదీపం వెలిగించే సమయంలో ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి?
సాధారణ రోజుల్లో దేవుళ్లకు వెలిగించే దీపాల కంటే కార్తీకమాసంలో వెలిగించే దీపాలకు ప్రత్యేక గుర్తింపు ఉంటుందని భక్తులు భావిస్తారు. అందుకే ప్రతిరోజు ఉదయం సాయంత్రం మహిళలు దీపారాధన చేస్తూ ఉంటారు. దీపారాధన చేసే సమయంలో అజాగ్రత్తగా ఉంటే పెద్ద ప్రమాదమే జరిగే అవకాశం ఉంది. అందువల్ల దీపారాధన చేసే ముందు మహిళలు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కొందరు మహిళలు దీపం పెద్దగా ఉండాలని వత్తులతో వెలిగిస్తారు. అయితే ఇలా వెలిగించే సమయంలో చుట్టుపక్కల ఎలాంటి దుస్తులు లేదా అగ్ని ప్రమాదానికి గురయ్యే వస్తువులు లేకుండా చూడాలి. ఇలా పెద్ద వత్తులతో వెలిగే దీపాల వలన అన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కార్తీకదీపం వెలిగించే సమయంలో మహిళలు కాటన్ చీరలు ధరించడం మంచిది. అయితే సిల్క్ లేదా ఇతర చీరలు ధరించినా.. దీపానికి దూరంగా ఉండి జాగ్రత్తలు వహించాలి. ఎందుకంటే కొందరు ఆలయాల్లో వందలకొద్దీ దీపాలు వెలిగిస్తారు. ఇలాంటి సమయంలో సిల్క్ లేదా నైలాన్ చీరలు ఉండడం వల్ల ఇవి తొందరగా నిప్పు అంటుకునే అవకాశం ఉంటుంది. అందువల్ల ఎక్కువగా దీపాలు వెలిగించేవారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
కార్తీక మాసంలో చాలామంది ఉపవాసం ఉండే అవకాశం ఉంటుంది. అయితే దీపాలు వెలిగించే సమయంలో నీరసంతో ఉండడం వలన పట్టు తప్పితే దీపాలపై పడే అవకాశం ఉంది. ఇలాంటివారు పక్కన మరొకరిని ఉంచి దీపారాధన చేయాలి. ముఖ్యంగా 40 నుంచి 50 ఏళ్ల మహిళలు దీపాలు వెలిగించాల్సి వస్తే తమ కుటుంబ సభ్యులను పక్కనే ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. కొందరు దేవాలయాల్లో ప్రదక్షణలు చేస్తూ ఉంటారు. ఈ సమయంలో వారి చీరలు తట్టుకొని కింద పడే అవకాశం ఉంటుంది. అందువల్ల ప్రదక్షిణలు చేసే సమయంలో తొందర పడకుండా ఉండాలి. ఉద్యోగం చేసే మహిళలు ఉదయం దీపాలు వెలిగించి కార్యాలయాలకు వెళ్తారు. అయితే ఇలాంటి సమయంలో చుట్టుపక్కల అగ్ని ప్రమాదానికి గురయ్యే వస్తువులను ఉంచకూడదు. అంతేకాకుండా దీపారాధన చేసేవారు కిటికీలు తీసి వెళ్ళాలి. ఎందుకంటే ఏదైనా అగ్నిప్రమాదం జరిగితే ఇతరులు గమనించే అవకాశం ఉంటుంది. ఇంటిల్లిపాది దీపాలతో కళకళలాడాలని కొందరు చైనా కంపెనీకి చెందిన లైట్లను కొనుగోలు చేస్తుంటారు. అయితే ఇవి సరిగా లేకపోవడం వల్ల విద్యుత్ షాక్ వచ్చే అవకాశం ఉంటుంది. వీటి విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి.