Karthika Masam 2025: శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం. హిందూ క్యాలెండ్ ప్రకారం దీనిని అత్యంత పవిత్ర మాసంగా పేర్కొంటారు. ఈ నెలలో వచ్చే పౌర్ణమికి అత్యంత విశిష్టత ఉంది. కార్తీక పౌర్ణమి రోజున దీపం వెలిగించడం ద్వారా సకల దేవతలను పూజించినట్లు అవుతుందని పండితులు చెబుతున్నారు. కార్తీక పౌర్ణమి రోజున దీపం వెలిగించడం అంటే అంధకారాన్ని తొలగించడం. అంటే ఒక వ్యక్తి దీపం వెలిగించడం ద్వారా అతనిలో ఉన్న అజ్ఞానం తొలగిపోయి ఆధ్యాత్మిక చింతన కలుగుతుంని భావిస్తారు. అందుకే కార్తీక పౌర్ణమి రోజున తప్పకుండా దీపం వెలిగిస్తారు. అయితే కార్తీక పౌర్ణమి రోజున దీపం వెలిగించేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలని పండితులు చెబుతున్నారు. ఆ నియమాలేంటో ఇప్పుడు చూద్దాం..
కార్తీక పౌర్ణమి రోజున సూర్యాస్తమం తరువాత దీపం వెలిగించడం ఉత్తమం. నవంబర్ 5న వచ్చే కార్తీక పౌర్ణమి సాయంత్రం 5.15 గంటల నుంచి రాత్రి 7.05 గంటల వరకు దీపం వెలించేందుకు శుభసమయం అని పండితులు తెలుపుతున్నారు. కార్తీక పౌర్ణమి రోజున దీపం వెలిగించాలని అనుకునేవారు ఇంటి ముందు ఉన్న తులసి చెట్టు శుభప్రదమైనదని అంటున్నారు. లేదా ఇంట్లోని పూజ గదిలో కూడా కార్తీక దీపం వెలిగించవచ్చని తెలుపుతున్నారు. దీపం వెలిగించే సమయంలో నువ్వుల నూనె లేదా నెయ్యిని వాడాలి. దీపంను కొవ్వొత్తితో వెలిగించకూడదు. అగ్గిపుల్లతో వెలిగించి దీపంలో అక్షింతలు వేయాలి. కొన్ని పూలు కూడా వేయడం మంచిదని అంటున్నారు.
అయితే దీపం వెలిగించే సమయంలో కొన్ని నియమాలు పాటించాలని పండితులు తెలుపుతున్నారు. దీపం ప్రతిష్టించే ప్రదేశం పరిశుభంగా ఉండాలి. మట్టి ప్రమిదలు మాత్రమే ఉపయోగించాలి. పింగాణి ప్రమిదలను ఉపయోగించకూడదు. దీపాలు ఎన్ని వెలిగించాలని సందేహం చాలా మందికి ఉంటుంది. భక్తి శ్రద్ధలతో ఒక్క దీపం వెలిగించినా పుణ్యం లభిస్తుందని, అయితే అవకాశం ఉన్నవారు 365 వత్తులు కాల్చుకోవచ్చని చెబుతున్నారు. దీపం వెలిగించిన తరువాత వెంటనే ఆర్పకూడదు. స్వయంగా ఆరిపోయే వరకు వేచి చూడాలి. తులసి చెట్టు వద్ద దీపం వెలిగించే ముందు పూజ చేయాలి. దీపం వెలిగించిన తరువాత ‘దీపం జ్యతిర్ పరబ్రహ్మ, దీపం సర్వతమోపహం! దీపేన సదా సర్వం, సుఖం భవతు!! అనే మంత్రం చదవాలి.
కార్తీక దీపం వెలిగించాలని అనుకునేవారు ఉపవాసం ఉండడం మంచిది. అలాగే ఈరోజు మద్యం, మాంసంకు దూరంగా ఉండాలి. శివ,కేశవులకు ఇష్టమైన ఈరోజు ఆలయాలను సందర్శించి ఆధ్యాత్మికతను పొందాలి. ఉదయం నుంచి సాయంత్రం వరకు శివనామస్మరణ చేయడం మంచిది. సాయంత్రం ఆలయాల వద్ద నిర్వహించే జ్వాలతోరణం కార్యక్రమంలో పాల్గొనాలి. కుటుంబ సబ్యులతో సంతోషంగా గడిపే ప్రయత్నం చేయాలి. ఎలాంటి చెడు పనులు, చెడు మాటలు మాట్లాడకుండా రోజంతా నిష్టతో ఉండడం వల్ల సరైన ఫలితాలు ఉంటాయని ఆధ్యాత్మిక వేత్తలు పేర్కొంటున్నారు.