Vaishno Devi Temple: ముగ్గురమ్మలు మూర్తీభవించిన దేవిగా, తనను దర్శించే భక్తులకు ధర్మార్ధ కామ మోక్షాలు ప్రసాదించే జగజ్జననిగా జమ్మూ–కశ్మీర్ రాష్ట్రంలో కొలువై ఉంది వైష్ణోదేవి. ఈ తల్లి దర్శనానికి ఏడాది పొడవునా దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు తరలివస్తారు. ఇక ఈ అమ్మవారిని దర్శించుకున్నవారెవరూ తమ న్యాయమైన కోరికలు తీరకుండా వెనుదిరగరని భక్తుల నమ్మకం. ఇక ఈ ఆలయం ఎపుపడు నిర్మించాలో ఆధారాలు లేవు. భూగర్భ శాస్త్రవేత్తల పరిశోధనలో ఈ ఆలయం ఉన్న గుహ మాత్రం ఒక మిలియన్ సంవత్సరాల పూర్వం నుంచి ఉందని నిర్ధారించారు.
గుహలో ప్రయాణం
ఇక వైష్ణోదేవి విగ్రహం ఉన్న చోటుకి వెళ్లాలంటే గుహలో చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ దూరాన్ని తగ్గించేందుకు మరో రెండు గుహల్లో అధికారులు దారులను ఏర్పాటు చేశారు. జమ్మూ కశ్మీర్‌లో వైష్ణోదేవి కొలువై ఉన్న కొండ సముద్ర మట్టానికి 5,200 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇక ప్రధాన ఆలయం ఉన్న గుహ 30 మీటర్ల పొడవు, 1.7 మీటర్ల ఎత్తు ఉంటుంది. ఈ గుహలు కొన్ని లక్షల ఏళ్ల కిందటే ఏర్పడ్డాయట. అలాగే సుమారుగా 10 లక్షల ఏళ్ల కిందటే ఈ ఆలయాన్ని నిర్మించారని చెబుతారు. మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధానికి ముందు శ్రీకృష్ణుని సూచన మేరకు పాండవులు వైష్ణో దేవిని పూజించారట. అందుకే వారు ఆ యుద్ధంలో గెలిచారని విశ్వాసం.
వైష్ణోదేవిగా అవతరించిన దుర్గమ్మ
భైరవుడు అనే ఓ రాక్షసుడిని సంహరించిన తర్వాత దుగ్గాదేవే వైష్ణోదేవిగా ఇక్కడ వెలిశారని చెబుతారు. అలాగే రాక్షసుడి తల గుహ నుంచి లోయలోకి పడిపోయిందని స్థల పురాణం చెబుతోంది. రాక్షసుడి దేహం అక్కడే ఉన్న గుహల్లోని ఏదో ఒక గుహలో ఇప్పటికీ ఉందని చెబుతారు. అందుకే ఆలయం సమీపంలో ఉన్న కొన్ని గుహలను ఎప్పుడూ మూసే ఉంచుతారు. ఏడాది పొడవునా తెరిచి ఉండే ఆలయానికి వెళ్లడానికి అక్టోబర్ అనుకూలం. కొండ ప్రాంతంలో ఉండే వైష్ణోదేవి ఆలయానికి చేరుకోవాలంటే కాలి నడక మార్గం, గుర్రపుస్వారీ, పల్లకి లేదా హెలిక్యాప్టర్ స్వీస్‌లలో దేన్నైనా ఉపయోగించవచ్చు.
ఉత్తరాదివారి భక్తుల కొంగుబంగారం
వైష్ణోదేవి ప్రాశస్త్యం దక్షిణాదిలో ఎక్కువగా కనిపించదు. ఉత్తరాదిన మాత్రం కొంగు బంగారంగా అమ్మవాఇని కొలుస్తారు. అమ్మవారిని లక్ష్మీ స్వరూపమని కొందరు, పార్వతీ స్వరూపమని కొందరు చెబుతారు. నిజానికి మహాలక్ష్మీ, మహాకాళీ, మహా సరస్వతి… ఈ ముగ్గురి తేజోమయ స్వరూపమే వైష్ణోదేవి అని చెబుతారు పండితులు.
ఇదీ అమ్మవారి జన్మ వృత్తాతం..
అసురుల బాధనుంచి భూలోకాన్ని రక్షించి, ధర్మాన్ని కాపాడేందుకు మహాలక్ష్మీ, మహాకాళి, మహా సరస్వతులు తమ తేజస్సు నుంచి ఒక దివ్య శక్తిని ఆవిర్భవింప చేయాలనుకున్నారు. వారి సంకల్పబలంతో అక్కడో అందమైన యువతి ప్రత్యక్షమైంది. ఆ యువతిని ధర్మ సంరక్షణార్ధం భూలోకంలో రత్నాకరసాగర్‌కు పుత్రికగా విష్ణు అంశతో జన్మించి ధర్మహిత కార్యాలు చేయమని చెప్పారట. ఆ తర్వాత శ్రీమహా విష్ణువులో ఐక్యం చెందినట్లు చెబుతారు. ఆ మహాశక్తుల ఆదేశాల మేరకు రత్మాకరసాగర్ ఇంట జన్మించిన బాలికకు వైష్ణవి అని పేరు పెట్టారు. తన జన్మం వెనుకున్న ఆంతర్యాన్ని నెరవేర్చుకుని భైరవుడనే రాక్షసుడి సంహారం అనంతరం అమ్మవారు త్రికూటపర్వతంపై గుహలో 3 తలలతో 5.5 అడుగుల ఎత్తయిన రాతిరూపం ధరించింది. వైష్ణోదేవిలో గుహాలయంలో మనకి కనిపించే మూడు రాతి రూపాలు (పిండీలంటారు అక్కడివారు) ఆ మాత తలలే మహాకాళీ, వైష్ణోదేవి, మహా సరస్వతిగా చెబుతారు.