Gudimallam Shivalayam: ప్రపంచంలోనే మొట్టమొదటి శైవాలయం ఇది.. 2,600 సంవత్సరాల చరిత్ర.. ఇంతకీ ఇది ఎక్కడ ఉంది, దీని విశేషాలేమిటంటే?

దేశంలో ఎన్నో శైవాలయాలున్నాయి. వాటన్నింటికీ చారిత్రక ఐతిహ్యం ఉంది. అయితే ఆ ఆలయాలకు లేని ప్రత్యేకత ఈ శివుడి గుడికి ఉంది. బహుశా ప్రపంచంలోనే ఈ స్థాయిలో గుర్తింపు పొందిన తొలి శివాలయం ఇదే కావచ్చు. ఇంతకీ ఈ శివాలయానికి ఎన్ని విశిష్టతలు ఉన్నాయంటే..

Written By: Anabothula Bhaskar, Updated On : August 26, 2024 8:53 am

Gudimallam Shivalayam

Follow us on

Gudimallam Shivalayam: కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి చిత్తూరు జిల్లా తిరుమల తిరుపతికి సమీపంలో ఏర్పేడు అనే మండలం ఉంది.. ఆ మండలంలో గుడిమల్లం అనే గ్రామం ఉంది. ఇది తిరుపతికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రేణిగుంట విమానాశ్రయం నుంచి పది కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే ఈ గ్రామం వస్తుంది. ఈ గ్రామంలో అత్యంత పురాతనమైన శివలింగం ఉంది. ఇక్కడ స్వామి వారు పరశు రామేశ్వరుడిగా పూజలు అందుకుంటున్నారు..గుడిమల్లం ఆలయంలో శివలింగానికి ఎంతో విశిష్టమైన చరిత్ర ఉంది. ఇక్కడి స్వామి వారి ఆలయంలోని గర్భాలయం, అంతరాలయానికి ప్రత్యేకమైన చరిత్ర ఉంది. ఎందుకంటే ముఖ మండపాలకంటే ఇవి లోతులో ఉంటాయి.. ఇక్కడి శివలింగం లింగం రూపంలో కాకుండా మనిషి రూపంలో మహావీరుడిగా, వేటగాడిలాగా కనిపిస్తుంది.

గుడిమల్లం ప్రాంతంలో ఏర్పాటు చేసిన శివలింగం ముదురు గోధుమ రంగులో కనిపిస్తుంది. ఐదు అడుగుల పొడవు, ఒక అడుగు వెడల్పుతో శివలింగం విస్తరించి ఉంటుంది. లింగం ముందు భాగంలో యక్షుడు ఉబ్బెత్తుగా బయటకు పొడుచుకొని వస్తాడు. అతడి భుజాలపై నిలబడి శివుడు భక్తులకు దర్శనమిస్తాడు.. స్వామి వారు ఇక్కడ రెండు చేతులతో కనిపిస్తాడు. కుడి చేతిలో గొర్రెపోతు, ఎడమ చేతిలో చిన్న గిన్నెతో పంపిస్తాడు. స్వామివారి ఎడమ భుజానికి గండ్రగొడ్డలి ఉంటుంది.. శివుడి జుట్టు మొత్తం ముడివేసి కనిపిస్తుంది.. చెవులకు రింగులు, ఇతర ఆభరణాలు దర్శనమిస్తాయి.. నడుముకు చెప్పిన వస్త్రం వేలాడుతూ మోకాళ్ల వరకు కనిపిస్తుంది. స్వామివారికి ఇక్కడ యజ్ఞోపవీతం ఉండదు. శరీర భాగాలు స్పష్టంగా దర్శనమిస్తాయి.. లింగంలోని పై భాగం, కింది భాగాలను విడదీస్తున్నట్టు లోతైన గీత పల్లం లాగా స్పష్టంగా కనిపిస్తుంది.. ఈ లింగం మొత్తం రాకెట్ ఆకారాన్ని పోలి ఉంటుంది. శివుడి వస్త్రాధరణను చూస్తే.. ఈ ఆలయం రుగ్వేద కాలంలో నిర్మించినట్టు చరిత్రకారులు చెబుతున్నారు.

ఈ ఆలయం క్రీస్తుపూర్వం రెండవ శతాబ్దంలో నిర్మించాలని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు. ఆ కాలంలో శైవారాధన విశేషాంగా ఉందని ఇక్కడి ఆధారాలను బట్టి తెలుస్తుంది. 2009 వరకు గుడిమల్లం ఆలయం పురబస్తు శాఖ ఆధీనంలో ఉండేది. అప్పట్లో పెద్దగా పూజలు జరిగేవి కావు. అప్పుడప్పుడు వచ్చే భక్తుల కోసం పురావస్తు శాఖ అధికారులు శివలింగాన్ని మాత్రమే చూపించేవారు. అయితే గుడిమల్లం ప్రాంతానికి వెళ్లలేని వారికోసం ఇక్కడి ఆలయంలో మూల విరాట్ లాంటి విగ్రహాన్ని చంద్రగిరి ప్రదర్శనశాలలో ఏర్పాటు చేశారు.

గుడిమల్లం ఆలయంలో పరుశురామేశ్వరుడి కి చోళులు, పల్లవులు, గంగ పల్లవులు, శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిత్యం ధూప దీప నైవేద్యాలు జరిగేవి. 1954లో పురావస్తు శాఖ ఈ ఆలయాన్ని స్వాధీనం చేసుకుంది. దొంగలు చాలామంది ఈ ఆలయంలో విగ్రహాలను తస్కరించారు. పురావస్తు శాఖ స్వాధీనం చేసుకున్న నాటి నుంచి ఈ ఆలయంలో పూజలు నిలిచిపోయాయి.

పురావస్తు శాఖ 1954 నుంచి ఆధీనంలోకి తీసుకున్నప్పటికీ ఈ ఆలయానికి సంబంధించిన సమాచారం ఆ సంస్థ వెబ్ సైట్ లో లేకపోవడం విశేషం. ఆలయంలో ఆ కాస్త పచ్చగడ్డిని పెంచడం మినహా ఆ శాఖ పెద్దగా ఏ పనీ చేయలేదని ఇక్కడి ప్రజలు బాబోతున్నారు. కనీసం ఈ ఆలయానికి సంబంధించిన ఎటువంటి చరిత్ర కూడా వారి వద్ద లేదని పేర్కొన్నారు. గ్రామస్తులు పోరాటం చేయడంతో పురావస్తు శాఖ అధికారులు ఇక్కడ నుంచి వెళ్లిపోయారు. 2009 నుంచి ఆలయంలో పూజలు మొదలయ్యాయి. అయితే ఇక్కడ శివుడి ఆకారం.. భారత్ లోని అంతరిక్ష ప్రయోగాలకు ప్రేరణగా నిలిచిందనే ప్రచారం కూడా ఉంది.. గతంలో ఇస్రో అధికారులు ఇక్కడ పూజలు కూడా నిర్వహించేవారు.

ఈ ఆలయంలో ఉన్న శివలింగం.. ఉజ్జయిని ప్రాంతంలో దొరికిన రాగి నాణేల పై పోలి ఉందని.. మధురలోని మ్యూజియంలోనూ ఇలాంటి శిల్పం ఉందని చరిత్రకారులు చెబుతున్నారు.. ఈ ఆలయం లోని ప్రధాన గది ప్రతి 60 సంవత్సరాలకు ఒకసారి వరదలు వస్తే పూర్తిగా మునిగిపోతుందని తెలుస్తోంది.. ఆలయంలో ఒక చిన్న భూగర్భ తొట్టి, దానికి పక్కనే ఉన్న ఒక వాహిక శివలింగం వెంట కనిపిస్తుంది. వరద నీరు గనుక చుట్టుముట్టితే దానిద్వారా నీరు కిందకి ప్రవహిస్తుంది. కొద్ది రోజులకు ఆ భూగర్భ ట్యాంకు పూర్తిగా ఎండిపోతుంది. 2005 డిసెంబర్ 4న సంభవించిన వరదల వల్ల ఇలా జరిగిందని ఇక్కడ ప్రజలు చెబుతున్నారు. ఇక ఈ ఆలయానికి ఉపయోగించిన శిల భూమ్మీద ఎక్కడా లేదని.. అంతరిక్షంలో లభించే ఒక రకమైన రాయి..ఇక్కడి గుడి నిర్మాణానికి ఉపయోగించిన రాయి తో సరిపోలిందని ఇక్కడి గ్రామస్తులు చెబుతున్నారు.. అంటే ఈ గుడి నిర్మాణం వెనుక కూడా చాలా చరిత్ర దాగి ఉందని వివరిస్తున్నారు..