Sankranti 2025: అంతటా సంక్రాంతి( Pongal) సందడి నెలకొంది. ఎక్కడెక్కడో స్థిరపడిన వారంతా స్వగ్రామాలకు బయలుదేరి వెళుతున్నారు. ముఖ్యంగా హైదరాబాదు( Hyderabad) నుంచి భారీగా తరలివస్తున్నారు. ఉద్యోగం, ఉపాధి, చదువు, ఇతర అవసరాల కోసం తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎక్కువగా హైదరాబాదులో స్థిరపడ్డారు. అయితే ఏపీలో ప్రధాన పండుగ సంక్రాంతి. ఏటా పండుగకు స్వగ్రామాలకు వెళ్లడం ఆనవాయితీ. ఇప్పుడు అంతా హైదరాబాద్ వదిలి తమ స్వస్థలాలకు వెళ్తున్నారు. బస్సులు, ట్రైన్లు, విమానాలతో పాటు సొంత వాహనాల్లో ఇళ్లకు చేరేందుకు సిద్ధమయ్యారు. అయితే రోడ్డు మార్గం గుండా వెళ్లే వారికి తప్పకుండా ట్రాఫిక్ సమస్య తలెత్తుతుంది. గంటల తరబడి ట్రాఫిక్ లో చిక్కుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్ శివార్లు దాటాలంటేనే గంటలు పడుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాదు నుంచి విజయవాడ మార్గంలో అయితే వాహనాల కదలిక చాలా ఆలస్యంగా ఉంటోంది. దీంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. మరోవైపు శని, ఆదివారాల్లో వాహన రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ పోలీసులకు కత్తి మీద సాములా మారుతోంది.
* పెరిగిన వాహన రద్దీ
అయితే వాహనాల( vehicles) రద్దీని దృష్టిలో పెట్టుకొని పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాలు సూచిస్తున్నారు. వీటి ద్వారా తొందరగా, ట్రాఫిక్ సమస్యలు లేకుండా సాఫీగా ప్రయాణం సాగుతుందని చెబుతున్నారు. వాస్తవానికి శుక్రవారం నుంచే వాహన రద్దీ పెరిగింది. పంతంగి టోల్ ప్లాజా వద్ద ఇరువైపులా కలిపి 16 టోల్ బూతులు ఉన్నాయి.. అటువైపు నుంచి రద్దీ ఉన్న నేపథ్యంలో విజయవాడ మార్గానికి 10 కేటాయించారు. అయితే ఆదివారం చౌటుప్పల్ లో భారీ మార్కెట్ జరగనుంది. దీంతో విజయవాడ హైవే వైపు వెళ్లే వాహనాలకు ట్రాఫిక్ ఇక్కట్లు ఎదురుకానున్నాయి. గంటల తరబడి రోడ్లపై వాహనాలు నిలిపివేయాల్సి ఉంటుంది. ఇంకోవైపు చౌటుప్పల్ లో అండర్ పాస్ నిర్మాణం జరుగుతుండడంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. అందుకే పోలీసులు ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలు సూచిస్తున్నారు. అటువైపు వెళ్ళాలని వాహనదారులకు సంకేతాలు పంపుతున్నారు.
* వారికి మరో మార్గం
సాధారణంగా హైదరాబాదు( Hyderabad) నుంచి గుంటూరు, మాచర్ల, అద్దంకి, ఒంగోలు, నెల్లూరు వైపు వెళ్లేవారు నార్కట్ పల్లి- అద్దంకి హైవేపై ప్రయాణిస్తుంటారు. మీరు విజయవాడ హైవేపై వస్తే హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్, చౌటుప్పల్, పంతంగి టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ లో చిక్కుకునే అవకాశం ఉంటుంది. అందుకే ఈ మార్గాల్లో వెళ్లాలనే వారికి మరో మార్గాన్ని సూచిస్తున్నారు పోలీసులు. కొంత దూరం ఎక్కువ అయినా హైదరాబాద్- నాగార్జునసాగర్ హైవే మీదుగా వెళ్తే ప్రయాణం సౌకర్యవంతంగా సాగనుంది. ఇక హైదరాబాద్ నుంచి వెళ్లే ప్రయాణికులు ఓఆర్ఆర్ పైకి వెళ్లి బొంగులూరు గేటు వద్ద ఎగ్జిట్ తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడ నుంచి నాగార్జునసాగర్ హైవే పైకి ఎక్కితే సరిపోతుంది.
* ఆ రెండు మార్గాల్లో
మరోవైపు ఖమ్మం( Khammam) తో పాటు విజయవాడ వైపు వెళ్లే ప్రయాణికులకు సైతం ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తున్నారు పోలీసులు. భువనగిరి, రామన్నపేట ల మీదుగా చిట్యాల చేరుకోవచ్చు. వీరు నార్కట్ పల్లి దాటితే ట్రాఫిక్ సమస్యల నుంచి బయటపడినట్లే. ఎందుకంటే నార్కట్ పల్లి వరకు వెళ్లిన వాహనాల్లో కొన్ని మిర్యాలగూడ మీదుగా అద్దంకి, చెన్నై వైపు వెళ్తాయి. ఆ తరువాత కేతేపల్లి మండలం కొర్లపహాడ్ టోల్గేట్ దాటిన తర్వాత మరికొన్ని వాహనాలు ఉమ్మడి ఖమ్మం జిల్లా వైపు… ఇంకొన్ని విజయవాడ వైపు వెళ్లడంతో.. మిగతా రెండు ప్లాజాల వద్ద వాహన రద్దీ తగ్గుతుంది.
* తెలంగాణ వాహనదారులకు
సంక్రాంతికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా పెద్ద ఎత్తున స్వగ్రామాలకు వెళ్తున్నారు. దీంతో జూబ్లీ బస్టాండ్ జనాలతో రద్దీగా మారింది. అటు తెలంగాణ మార్గాల వైపు వాహనాల రద్దీ కూడా పెరిగింది. ఈ క్రమంలో అక్కడ రూట్లలో సైతం కొన్ని రకాల సూచనలు చేస్తున్నారు పోలీసులు. ప్రధానంగా హైదరాబాదు నుంచి వరంగల్, భువనగిరి వైపు వెళ్లే వాహనదారులు ఓఆర్ఆర్ పైకి వెళ్లి ఘట్కేసర్ వద్ద ఎగ్జిట్ తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు నేరుగా వరంగల్ హైవేలోకి ప్రవేశించవచ్చు. సికింద్రాబాద్, తార్నాక, ఉప్పల్ మీదుగా కూడా నేరుగా భువనగిరి వైపు వెళ్ళవచ్చు. పోలీసులు ఇప్పుడు ఇదే మార్గాలను సూచిస్తున్నారు. రేపు ఆదివారం కావడంతో వాహనాల రద్దీ పెరిగే అవకాశం ఉండడంతో సూచనలను పాటించాలని కోరుతున్నారు.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Hyderabad to vijayawada if you go that route smoothly police big alert
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com