Good News for Tirumala Devotees: ఏడాదికి ఒక్కసారైన తిరుపతికి వెళ్లి శ్రీవారిని దర్శించుకోవాలని తెలుగువారు కోరుకుంటూ ఉంటారు. కానీ ఆ కలియుగదేవుడి దర్శనం అంటే ఆషామాషీ కాదు. ముందస్తు ప్రణాళిక లేకపోతే తిరుపతికి వెళ్లడం కష్టమవుతోంది. ప్రతిరోజూ తిరుపతికి బస్సులు, రైళ్లు, విమానాలతో పాటు ప్రత్యేక వాహనాల్లో ఇక్కడికి వస్తూ ఉంటారు. అయితే వీటిలో ఎక్కువ శాతం ట్రైన్ జర్నీ చేసేవారు ఉంటారు. సూదూర ప్రాంతాల నుంచి తిరుపతికి రావడానికి దాదాపు అన్ని ప్రాంతాలనుంచి రైళ్ల సౌకర్యం అందుబాటులో ఉన్నాయి. అయినా కొన్ని ప్రాంతాల నుంచి రద్దీ ఎక్కువ కావడంతో ఇక్కడ ట్రైన్స్ సరిపోవడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. కొన్ని రైళ్ల పొడగింపుపై కీలక ప్రకటన చేశారు. అదేంటంటే?
తిరుపతికి రావడానికి తెలుగు రాష్ట్రాల వారి సౌకర్యార్థం అన్ని ప్రాంతాలను కలుపుతూ ఇక్కడికి ట్రైన్ సౌకర్యం ఏర్పాటు చేశారు. తాజాగా మహారాష్ట్రలోని నాందేడ్ నుంచి తిరుపతికి వచ్చే రైలును వచ్చే ఏడాది మార్చి వరకు పొడగిస్తున్నట్లు రైల్వే అధికారులు కీలక ప్రకటన చేశారు. నాందేడ్ నుంచి కరీంనగర్ మీదుగా వరంగల్, విజయవాడ నుంచి తిరుపతికి 07015 అనే ట్రైన్ ప్రయాణం చేస్తుంటుంది. అలాగే తిరుపతి నుంచి నాందేడ్ కు 07016 అనే రైలు వెళ్తుంటుంది. ఈ రైలు ద్వారా ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర ప్రజలు ప్రయాణం చేయవచ్చు. ఇప్పటికే కరీంనగర్ నుంచి ప్రత్యేక రైళ్లు ఉన్నాయి. ఇప్పుడు నాందేడ్ ట్రైన్ ద్వారా కూడా తిరుపతి వెళ్లడానికి ఆస్కారం ఉంది.
Also Read: మహిళలతో కలిసి బస్సులో బాబు, పవన్.. ఈ అరుదైన వీడియో చూడాల్సిందే
వీటితో పాటు మరికొన్ని రైళ్ల సౌకర్యాలను కూడా ఏర్పాటు చేశారు. హైదరాబాద్ లోని చర్లపల్లి -కాకినాడ రైళ్లను కూడా పొడిగించారు. ఈ ట్రైన్ ఆగస్టు 22,సెప్టెంబర్ 22న ప్రయాణం చేయనుంది. కాకినాడ టౌన్ నుంచి చర్లపల్లికి ఇదే తేదీల్లో మరో ట్రైన్ ప్రయాణం చేయనుంది. కాచిగూడ- మధురై, హైదరాబాద్-కొల్లాం, హైదరాబాద్- కన్యాకుమారి మార్గాల్లో కూడా ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి 19, కాచిగూడ నుంచి 8 ప్రత్యేక రైళ్లు తిరుపతి మీదుగా ప్రయాణం చేయనున్నాయి. తిరుపతికి వెళ్లేవారు మిగతా ట్రైన్స్ అందుబాటులో లేనప్పుడు ఇందులో కూడా వెళ్లే అవకాశం ఉంటుందని రైల్వే అధికారులు చెబుతున్నారు.
తిరుపతికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకి పెరుతోంది. అందులోనూ శ్రావణమాసంలో మరింత పెరిగే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక రైళ్లు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రయాణికులు ముందస్తుగా తమకు అందుబాటులో ఉన్న రైళ్ల ద్వారా సౌకర్యవంతంగా ప్రయాణం చేయాలని అధికారులు కోరుతున్నారు.