Nalgonda: దివ్యక్షేత్రం భద్రాచలంలో సీతారాములు కొలువుదీరారని ప్రజల నమ్మకం. అంతేకాదు ఆ అఖిలాంధ్ర కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీరామ చంద్రులు సీతామానతో కలిసి భద్రాచలంలో నడియాడారని నమ్మకం. అయితే సీతారాములు ఇక్కడికి వెళ్లేకంటే ముందు నల్గొండ జిల్లాలో ఉన్నారట. దీంతో అక్కడ సీతారాములు ఉన్న ప్రదేశం వారి పాదపద్మముల అచ్చులు ఉన్నాయని స్థానికులు చెబుతుంటారు. ఓసారి వాటిని చూసేయండి.
సీతారాముల వారి పాదం గల బండను రాముల వారి బండ అంటారట స్థానికులు. రాతి బండపై శ్రీరాముని పాదాల అచ్చులు కూడా ఉన్నాయట. అవి శ్రీ సీతారాముల పాదాల గుర్తులు అని విశ్వసిస్తుంటారు. మరి ఈ ప్రదేశం ఎక్కడ ఉందంటే.. నల్గొండ జిల్లా కట్టంగూరు మండల పరిధిలోని ఐటి పాముల గ్రామంలో ఉంది. రాముల వారి పాదాల అచ్చులు బండపైన ఉండడం వల్ల రాముల వారి బండ అనే పేరు వచ్చింది. ఈ బండ మీదనే సీతమ్మ తల్లి చీర ఆరేసిందట. ఆ అచ్చులు కూడా ఉన్నాయి.
ఇలా సీతారాముల అచ్చులు ఉండటం గ్రామానికి దక్కిన వరంగా భావిస్తుంటారు స్థానికులు. అయితే ఇక్కడ ఒక మహిమ గల బావి కూడా ఉందట. ఇక్కడ బావిలో నీరు ఎప్పుడు కూడా ఎండిపోదట. అతివృష్టి రానీ, అనావృష్టి రాని బావిలో ఉన్న నీరు మాత్రం ఎప్పటి లాగే ఉంటుందని అంటారు గ్రామస్థులు. అయితే ఈ ప్రదేశం నుంచి ఆ సీతారాములు అరవపల్లి గుట్ట మీదకు వెళ్లారట. అక్కడ కూడా ఇలాంటి అచ్చులే ఉన్నాయని చెబుతారు.
తర్వాత భద్రాచలానికి వెళ్లారట సీతారాములు. అయితే ఈ గ్రామస్థులకు ఎలాంటి అనారోగ్య సమస్యలు వచ్చినా రాముల వారి బండలోని బావి నీరు తాగితే ఎంతటి రోగం అయినా నయం అయేదని నమ్ముతారట. ఇక కాలక్రమేణా రాముల వారి పాదాల అచ్చులలో ఒక పాద అచ్చు చెదిరిపోయిందట. ఇక ఈ విషయంపై పురావస్తు శాఖ అధికారులు స్పందించి నిజ నిర్ధారణ చేసి అక్కడ ఆలయం నిర్మించాలని కోరుతున్నారు భక్తులు.