Diwali 2024: హిందూ శాస్త్రం ప్రకారం దసరా, దీపావళి పండుగలను దేశ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకుంటారు. అక్టోబర్లో దసరా పూర్తి అయిన తరువాత దీపావళి వేడుకలు ప్రారంభం అవుతాయి. కొన్ని ప్రాంతాల్లో దీపావళిని మూడు రోజుల పాటు నిర్వహించుకుంటారు. మరికొన్ని ప్రాంతాల్లో కొన్ని రోజుల నుంచే దీపావళికి సంబంధించిన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. దీపావళి రోజున లక్ష్మీ పూజలు ప్రత్యేకంగా నిర్వహిస్తుంటారు. ఈ పూజలు నిర్వహించడానికి ముందే ఇంటిని లేదా షాపును శుభ్రంగా ఉంచుకుంటారు. కొందరు ఇల్లు లేదా షాపు క్లీన్ చేసే సమయంలో పాత వస్తువులను బయటపడేస్తారు. మరికొందరు మాత్రం నిర్లక్ష్యం వహిస్తారు. అయితే దీపావళి రోజున ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటే లక్ష్మీదేవి అంత సంతోషిస్తుందని అంటారు. అలాగే కొన్ని వస్తువులను పడేయకుండా అలాగే ఉంచితే లక్ష్మీదేవికి కోపం వస్తుందట. మరి ఆ వస్తువులు ఏవో తెలుసుకోండి..
ప్రతీ ఏడాది దీపావళి అశ్వయుజ మాసంలో వచ్చే అమావాస్య రోజున జరుపుకుంటారు. ఈ ఏడాది అక్టోబర్ 31 దీపావళి వేడుకలు నిర్వహించుకోనున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గురువారం మధ్యాహ్నం 3.52 గంటలకు ప్రారంభమై నవంబర్ 1న సాయంత్రం 6.16 గంటలకు ముగుస్తుంది. ఈ సమయాల్లో దీపావళి ప్రత్యేక పూజలు నిర్వహించుకోవడం, పండుగ జరుపుకోవడం ఉత్తమం అని కొందరు అంటున్నారు.
దీపావళికి కొన్ని రోజుల ముందు లేదా.. ఒకటి రెండు రోజుల ముందు ఇంటిని శుభ్రం చేస్తారు. ఈ సమయంలో పాత వస్తువులను బయటపడేస్తారు. అయితే పొరపాటున కూడా వాడని చెప్పులు లేదా షూస్ ఇంట్లో ఉంచడం అంత మంచిదికాదని కొందరు పండితులు చెబుతున్నారు. చెప్పలు దరిద్రానికి సంకేతాలు. ఇవి పాతవి ఉండడం వల్ల వీటి నుంచి అనేక క్రిములు తయారై ఇంట్లోకి వస్తాయి. తద్వారా ఇంట్లోని వారు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. అందువల్ల ఇటువంటి పాత వస్తువులు ఉంటే వెంటనే బయటపడేయాలని చెబుతున్నారు.
అద్దం మనిషికి ప్రతిరూపాని చూపిస్తుంది. ఇంట్లో అద్దం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అయితే పగిలిన అద్దాన్ని ఇంట్లో అస్సలు ఉంచుకోకూడదు. అలాగే దీపావళి రోజున పగిలిన అద్దం ఉండడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుందని అంటారు. పగిలిన అద్దం మాత్రమే కాకుండా గాజు పెంకులు, పగిలినవస్తువులు కూడా ఇంట్లో ఉంచుకోకుండా బయట పారేయడం ఉత్తమం అని అంటున్నారు.
చాలా మంది పాత ఫొటోలను, విరిగిన విగ్రహాలను ఇంట్లోనే ఉంచుకుంటారు. కానీ ఇవి ఎంత మాత్రం శుభం కాదని పండితులు చెబుతున్నారు. ఇవి ఇంట్లో ఉండడం వల్ల అరిష్టాన్ని ప్రేరేపిస్తాయి. అంతేకాకుండా ఇలా పగిలిన విగ్రహాలు ఉండడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహం వ్యక్తం చేస్తుందని చెబుతున్నారు. అందువల్ల పగిలిన విగ్రహాలను ఉంచడం వల్ల నష్టాలు ఏర్పడే అవకాశం ఉందని అంటున్నారు.
ఇవే కాకుండా దీపావళి రోజున ఇల్లు చిందవందరగా ఉన్నా.. దుస్తులు ఎక్కడబడితే అక్కడ పారవేసినా అరిష్టమేనని అంటున్నారు. ముఖ్యంగా ఈశాన్యం వైపు ఎక్కువగా బరువు వస్తువులు ఉంచకుండా జాగ్రత్త పడాలని చెబుతున్నారు. దీపావళి రోజున ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటే అంత మంచిది. అలాగే ఈరోజు ఒకరిపై ఒకరు కోపం తెచ్చుకోకుండా ప్రశాంతంగా జీవించాలని చెబుతున్నారు.