Bhadrachalam: ఉగాది పర్వదినం ముగిసిన తరువాత శ్రీరామనవమి రాబోతుంది. ఏప్రిల్ 17న రాములోరి కల్యాణాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ప్రతీ రామాలయం రామనామస్మరణతో మారుమోగనుంది. తెలుగు రాష్ట్రాల ప్రజలు భద్రాద్రిలో జరిగే రాములోరి కల్యాణం చూసేందుకు తరలి వెళ్తారు. ఈ సందర్భంగా ఇప్పటికే తిరు కల్యాణ బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభం అయ్యాయి. 23 వరకు వీటిని కొనసాగించనున్నారు. ఈ నేపథ్యంలో రాములోరి పరిసర ప్రాంతాల్లో సందడి ప్రారంభమైంది.
శ్రీరామనవమి సందర్భంగా ఊరూరా రామాలయంలో కల్యాణ సంబరాలు జరిగినా ఎక్కువ మంది భద్రాచలం వెళ్లి ఆ వైభవం చూడాలనుకుంటారు. దీంతో ప్రతీ శ్రీరామనవమికి భక్తులు ఇక్కడికి వచ్చేందుకు ముందుగానే ఏర్పాట్లు చేసుకుంటారు. కొందరు ప్రత్యేక వాహనాల్లో ఇక్కడికి వస్తుంటారు. మరికొందరు బస్సుల్లో, ట్రైన్ ద్వారా భద్రాచలం చేరుకుంటారు. అయితే శ్రీరామనవమి సందర్భంగా ఇక్కడ గదులు దొరకడం కష్టం. మిగతా సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలంటే ముందుగానే ఆన్ లైన్ లో బుక్ చేసుకోవాలి.
ఏప్రిల్ 17న శ్రీరామనవమి రోజున రాములోరి కల్యాణం జరగనుంది. ఆ తరువాత 18న దశమి రోజున శ్రీరాముడి పట్టాభిషేకం నిర్వహిస్తారు. ఈ రెండు రోజుల పాటు భద్రాచలంలోనే ఉండేందుకు ఏర్పాట్లు చేసుకోవాలనుకునేవారు ముందుగానే ఆన్ లైన్ ద్వారా గదులు, ఇతర వసతులను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అధికారిక ఆలయ వెబ్ సైట్ https://book.bhadrachalamonline.com/book-hotel ద్వారా రిజర్వ్ చేసుకోవచ్చు.