Atla Taddi 2025: హిందూ సాంప్రదాయం ప్రకారం కొన్ని ప్రత్యేక రోజుల్లో ప్రత్యేక పండుగలను నిర్వహించుకుంటూ ఉంటారు. దసరా, దీపావళి, సంక్రాంతి అనే పండుగలు మాత్రమే కాకుండా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రత్యేక రోజుల్లో కూడా వ్రతాలు, పూజలు చేస్తుంటారు. వీటిలో అట్లతద్ది ఒకటి. తెలుగు రాష్ట్రాల్లో మహిళలు ప్రత్యేకంగా జరుపుకునే ఈ పండుగను పురాతన కాలం నుంచి నిర్వహిస్తూ వస్తున్నారు. పెళ్లయిన మహిళలు తమ భర్త ఆయురారోగ్యాలతో ఉండాలని.. పెళ్లి చేసుకుని యువతులు తమకు మంచి భర్త రావాలని ఈ వేడుకను నిర్వహించుకుంటారు. అయితే అట్లతద్ది అంటే ఏమిటి? దీనిని ఏ రోజు నిర్వహించుకుంటారు? ఈ పండుగ మహత్యం ఏంటి?
అట్ల తద్ది అంటే.. అట్లు అనగా దోషలు వేసి.. తద్ది అనగా పౌర్ణమి తర్వాత వచ్చే మూడో రోజున చంద్రునికి సమర్పించడం. ప్రతి ఏడాది సెప్టెంబర్ నుంచి అక్టోబర్ మధ్యలో అశ్వయుజ మాసంలో కృష్ణపక్షం తృతీయ తిధి రోజున ఈ వేడుక నిర్వహించుకుంటారు. కార్తీక మాసం ముందు ఈ పండుగ వస్తుంది. 2025 వ సంవత్సరంలో అక్టోబర్ 9వ తేదీన అట్లతద్ది వేడుకలు నిర్వహించుకుంటున్నారు. ఈ వేడుకను తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించుకుంటూ ఉంటారు.
అట్లతద్ది ప్రత్యేకంగా మహిళలకు సంబంధించిన పండుగ. ఈరోజు మహిళలు, యువతులు ఉపవాసం ఉంటారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఎలాంటి ఆహారాన్ని తీసుకోరు. సాయంత్రం చంద్రుడు కనిపించిన తర్వాత అట్లను చంద్రుడికి సమర్పించుతారు. ఆ తర్వాత పాటలు పాడుతూ.. ఆటలు ఆడుతూ సరదాగా ఉంటారు. గౌరీ దేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ సందర్భంగా తమ భర్త బాగుండాలని వివాహితులు.. తమకు మంచి భర్త రావాలని యువతులు కోరుకుంటారు. భక్తితో పాటు ప్రేమ, దాంపత్య సుఖం, విశ్వాసం కలగడానికి ఈ పండుగను నిర్వహించుకుంటారు.
అట్టతద్దిని ఉయ్యాల పండుగ అని కూడా అంటారు. ఈ రోజున మహిళలు అంతా కలిసి సాయంత్రం ఉయ్యాలలు ఊగుతూ సరదాగా గడుపుతారు. జీవితంలో ఎన్నో ఊగిసలాటలు ఉంటాయి. అయితే తమ జీవితం బాగుండాలని దేవతలతో కలిసి సాయంత్రం ఈ ఆనందాన్ని పంచుకుంటారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా పాటలు పాడుతారు. అలాగే అట్లతద్దిని గోరింటాకు పండుగ అని కూడా అంటారు. ఈరోజు మహిళలు అంతా చేతికి గోరింటాకు పెట్టుకుంటారు. గోరింటాకు పెట్టుకోవడం వల్ల మహిళలు అందంగా కనిపిస్తారు. అలాగే శుభసంకేతానికి గోరింటాకు ను పేర్కొంటారు. గోరింటాకు పెట్టుకోవడం వల్ల దాంపత్య సుఖం ఉంటుందని అంటారు. పెళ్లి కాని వారు గోరింటాకు చేతికి పెట్టుకున్న తర్వాత బాగా పండితే తమకు మంచి భర్త వస్తారని భావిస్తారు. అందుకే అట్లతద్ది రోజున గోరింటాకు పెట్టుకొని దీనిని గోరింటాకు పండుగ అని కూడా అంటారు.
అయితే సాంప్రదాయాలను కాపాడాలని అనుకునే నేటి కాలం మహిళలు.. నగరాల్లో ఉండేవారు సైతం అట్లతద్ది వేడుకలు నిర్వహించుకుంటున్నారు. మహిళల ఐకమత్యానికి.. సంతోషానికి ఈ పండుగ ఎంతో ఉపయోగపడుతుంది. అందుకే ఎన్ని పనులు ఉన్నా ఈరోజు మహిళలంతా ఒక్కచోటుకు చేరి ఆనందంగా ఉంటారు.