Water Dispute
Water Dispute: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సమన్వయం బాగానే కొనసాగుతూ వచ్చింది. రాష్ట్ర విభజన( state divide) జరిగినా తొలినాళ్లలో మాత్రం రెండు విభిన్న ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అప్పట్లో నవ్యాంధ్రప్రదేశ్ కు చంద్రబాబు, తెలంగాణ రాష్ట్రానికి కెసిఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఈ ఇద్దరు నేతల మధ్య పరస్పర రాజకీయ విరుద్ధ భావాలు ఉన్నాయి. కొద్ది రోజులపాటు సమన్వయంతో ముందుకు సాగినా తరువాత విభేదాలు వచ్చాయి. తెలంగాణలో రెండోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబుకు మాత్రం ప్రజలు ఆదరించలేదు. జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యారు. అయితే కెసిఆర్ తో జగన్మోహన్ రెడ్డికి మంచి స్నేహ సంబంధాలు ఉండేవి. దీంతో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సాఫీగా ముందుకు సాగాయి. అయితే తెలంగాణలో కెసిఆర్ మూడోసారి ఓడిపోయారు. రేవంత్ అధికారంలోకి వచ్చారు. ఏపీలో జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని కోల్పోయారు. చంద్రబాబు సీఎం అయ్యారు. అయితే చంద్రబాబు ఒకప్పటి సహచరుడు రేవంత్ కావడంతో రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం కనిపిస్తోంది.
* విభజన సమస్యలు అలానే..
అయితే 2014లో రాష్ట్ర విభజన( state divide ) జరిగితే.. పదేళ్లు దాటిన విభజన సమస్యలు పరిష్కారం కాలేదు. వాటికోసం ప్రత్యేకంగా సమావేశం అయ్యారు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్. వారి మధ్య సానుకూలంగా చర్చలు సాగాయి. పరస్పర విరుద్ధ ప్రభుత్వాలు నడుస్తున్న.. నేతల మధ్య ఉన్న అవగాహనతో ఎటువంటి విభేదాలు రాలేదు. కానీ ఇప్పుడు సంయుక్త ప్రాజెక్టుల నీటి వాడకానికి సంబంధించిన వివాదం తలెత్తింది. ఇబ్బందికరంగా మారుతోంది. అయితే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కాకుండా.. అధికారుల మధ్య ఇప్పుడు చర్చలు కొనసాగుతున్నాయి.
* ముందే మేల్కొన్న తెలంగాణ
వేసవి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం( Telangana government) ముందుగానే అలెర్ట్ అయ్యింది. ఉమ్మడి ప్రాజెక్టులుగా ఉన్న శ్రీశైలం, నాగార్జునసాగర్ల నుంచి చుక్కనీరు ఏపీకి విడిచి పెట్టకూడదు అంటూ తెలంగాణ అధికారులు రాహుల్ బొజ్జ, అనిల్ కుమార్, అజయ్ కుమార్ లు కృష్ణా రివర్ బోర్డు యాజమాన్యానికి లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే తనకు కేటాయించిన నీటిని వాడుకుందని.. ఇకనుంచి ఆ రాష్ట్రానికి చుక్క నీటిని కూడా విడుదల చేయడానికి వీల్లేదని కఠినమైన పదాలతో లేఖలు రాశారు తెలంగాణ అధికారులు. అయితే దీనిపై ఏపీ ప్రభుత్వం అభ్యంతరం చెబుతోంది. పాత లెక్కలు తీస్తూ.. తాము ముందుగానే వాడుకున్నాం అని చెప్పడం ఏంటని.. ఏపీ జలవనురుల శాఖ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో ఏపీ సీఎం చంద్రబాబు కూడా స్పందించారు. ఇలా వాదనల కంటే కూర్చుని మాట్లాడుకుందాం అంటూ చెప్పుకొస్తున్నారు. అదే సమయంలో శుక్రవారం కృష్ణా రివర్ బోర్డు మీటింగ్ జరగాల్సి ఉంది. ఏపీ అధికారులు తాము హాజరు కాలేమంటూ సమాచారం ఇవ్వడంతో వాయిదా పడింది. అయితే తాగునీటిని దొడ్డిదారిన తీసుకెళ్లేందుకే ఏపీ ప్రభుత్వం ఇలా వాయిదాల పర్వానికి తెరతీసిందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ యాడాది మే 31 వరకు 107 టీఎంసీల జలాలను తెలంగాణకు కేటాయించాలని ఆ రాష్ట్ర అధికారులు డిమాండ్ చేస్తున్నారు. అయితే దీనిపై కృష్ణా రివర్ బోర్డు స్పష్టత ఇవ్వడం లేదు. ఏపీతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పడం విశేషం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీకి చుక్క నీరు అదనంగా ఇచ్చేందుకు సిద్ధంగా లేమని స్పష్టం చేయడం తీవ్రతను తెలియజేస్తోంది. మరి పరిస్థితులు ఎంతవరకు దారితీస్తాయో చూడాలి.