Bathukamma : తెలంగాణలో ప్రజలు అతిపెద్ద పండుగ బతుకమ్మ వచ్చేసింది. కులమత బేధం లేకుండా రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఈ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది బతుకమ్మ ఉత్సవాలు అక్టోబర్ 2 నుంచి ప్రారంభం కానున్నాయి. ఎంగిలి పూల బతుకమ్మతో తొలిరోజు ప్రారంభమయ్యి సద్దుల బతుకమ్మతో మొత్తం 9 రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. ఈ 9 రోజుల్లో ఒక్కో రోజుకి ఒక్క ప్రత్యేకత ఉంది. పండుగ ప్రారంభం అయినప్పటి నుంచి వివిధ రకాల పూలు, నైవేద్యాలతో ఆడపడుచులు అందరూ బతుకమ్మను కొలుస్తారు. 9 రోజులు వేర్వేరు పేర్లతో బతుకమ్మను పూజిస్తారు. సాధారణంగా దేవున్ని పూలతో పూజిస్తాం. కానీ పూలనే పూజించే పండుగ ఈ బతుకమ్మ. ఈ పండుగను ఘనంగా తొమ్మిది రోజుల పాటు పల్లే, పట్నం అనే తేడా లేకుండా జరుపుకుంటారు. అసలు బతుకమ్మను ఎలా పూజిస్తారు? తొమ్మిది రోజులు పూజించే ఆ పేర్లు? ఏయే నైవేద్యాలు పెట్టి ఈ తొమ్మిది రోజులు పూజిస్తారో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఎంగిలి పూల బతుకమ్మ
భాద్రపద అమావాస్య రోజు బతుకమ్మ మొదలవుతుంది. ఇలా మొదటి రోజు బతుకమ్మను ఎంగిలి పువ్వు బతుకమ్మ అని పిలుస్తారు. మహాలయ అమావాస్య రోజున ప్రారంభమయ్యే ఈ బతుకమ్మను పితృఅమావాస్య అని కూడా అంటారు. ఎంగిలి పువ్వు బతుకమ్మ రోజు నువ్వులు, బియ్యంపిండి, నూకలను గౌరమ్మకి నైవేద్యంగా పెడతారు.
అటుకుల బతుకమ్మ
రెండో రోజు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి తిథి నాడు నిర్వహిస్తారు. రెండో రోజు పూజించే ఈ బతుకమ్మను అటుకుల బతుకమ్మగా పిలుస్తారు. బెల్లం, సప్పిడి పప్పు, అటుకులతో వండిన పదార్థాలని అటుకుల బతుకమ్మ రోజున గౌరమ్మకి నైవేద్యంగా సమర్పిస్తారు.
ముద్దపప్పు బతుకమ్మ
మూడోరోజు ముద్దపప్పు లేదా ముద్దపువ్వు బతుకమ్మగా పిలుస్తారు. ముద్దపప్పు బతుకమ్మ అని ఎందుకు అంటారంటే.. ముద్ద చామంతి, ముద్ద బంతి, తంగేడు, గుణక పువ్వులతో ఈరోజు బతుకమ్మను పూజిస్తారు. గౌరమ్మకి ఈ రోజున ముద్దపప్పు, అన్నం, పాలు, బెల్లంతో నైవేద్యం పెడతారు.
నానే బియ్యం బతుకమ్మ
ఆశ్వయుజ తృతీయ నాడు నాలుగో రోజు బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. ఈ రోజుని నానే బియ్యం బతుకమ్మ పేరుతో గౌరమ్మను పూజిస్తారు. నానబెట్టిన బియ్యం, పాలు, బెల్లంతో చేసిన పదార్థాలను నైవేద్యంగా నివేదిస్తారు.
అట్ల బతుకమ్మ
ఆశ్వయుజ చతుర్థి నాడు అట్ల బతుకమ్మను జరుపుకుంటారు. ఈ అట్ల బతుకమ్మ రోజు అందరూ కూడా దోశలు సమర్పించుకుంటారు.
అలిగిన బతుకమ్మ
ఆశ్వయుజ పంచమి నాడు ఆరవ రోజు బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. ఈ రోజున బతుకమ్మ అలిగిందని.. అలిగిన బతుకమ్మగా పిలుస్తారు. బతుకమ్మను ఈరోజు ఎలాంటి నైవేద్యం సమర్పించరు.
వేపకాయల బతుకమ్మ
ఆశ్వయుజ షష్ఠి నాడు ఏడో రోజు బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. ఈరోజు వేపకాయల బతుకమ్మతో పూజిస్తారు. బియ్యం పిండిని బాగా వేయించి వాటిని వేప పండ్లుగా చేసి గౌరమ్మకి నైవేద్యంగా పెడతారు.
వెన్నముద్దల బతుకమ్మ
ఆశ్వయుజ సప్తమి నాడు ఎనిమిదవ రోజు బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. ఈరోజు వెన్నె ముద్దల బతుకమ్మగా పిలుస్తారు. ఎనిమిదవ రోజు నువ్వులు, వెన్న, నెయ్యి, బెల్లంతో చేసిన పదార్థాలను గౌరమ్మకి నైవేద్యంగా సమర్పిస్తారు.
సద్దుల బతుకమ్మ
చివరిగా ఆశ్వయుజ అష్టమి నాడు తొమ్మిదో రోజు బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. చివరి రోజు పండుగను సద్దుల బతుకమ్మగా పిలుస్తారు. ఈరోజున బతుకమ్మకు ఐదు రకాల వంటకాలు నైవేద్యంగా పెడతారు. పెరుగు అన్నం, కొబ్బరి అన్నం, చింతపండు పులిహోర, నువ్వులు అన్నం, నిమ్మకాయ పులిహోర అనే వంటకాలను తయారు చేసి బతుకమ్మను పూజిస్తారు. తొమ్మిది రోజుల పాటు ఆటపాటలతో బతుకమ్మను పూజించి గంగలో నిమజ్జనం చేస్తారు. ఆ తర్వాత పసుపుతో గౌరమ్మను తయారు చేసి దానిని తమ మెడలో వేసుకుంటారు. ఇలా చేయడం వల్ల పసుపు, కుంకుమలతో హాయిగా ఉంటారని నమ్మకం.
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Read More