Attacks On Women: ఒక ఆడపిల్ల ఎటువంటి భయం లేకుండా అర్ధరాత్రి తన ఇంటికి ఒంటరిగా వచ్చినప్పుడే ఈ దేశానికి నిజమైన స్వాతంత్ర్యం అని గాంధీ మహాత్ముడు ఎప్పుడో సెలవిచ్చారు. అర్ధరాత్రి దాకా దేవుడెరుగు కనీసం పట్టపగలు కూడా ప్రశాంతంగా బతకలేని పరిస్థితులు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నాయి. ఆరేళ్ల పసిపిల్ల నుంచి పండు ముదుసలి వరకు ఏదో ఒక చోట అఘాయిత్యాల బారిన పడుతున్న వారే. రోజురోజుకు పెరుగుతున్న అఘాయిత్య ఘటనలు రాష్ట్రంలో కలకలం రేపుతున్నాయి. తల్లిదండ్రుల కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. దాదాపు అన్ని కేసుల్లో బాధితులు మైనర్లే. నిందితుల్లో కూడా ఎక్కువ మంది మైనర్లే. మద్యం మత్తులో కొందరు, మాయ మాటలతో నమ్మించి మరికొందరు అఘాయిత్యాలకు తెగబడుతున్నారు. బాలికలను ట్రాప్ చేసి.. వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. అడ్డూ అదుపులేని పబ్ కల్చర్, గల్లీ గల్లీకి లిక్కర్ అమ్మకాలు, అశ్లీల వీడియోల ప్రభావం, పోలీసుల పర్యవేక్షణ లేకపోవడంతో దారుణాలు పెరిగిపోతున్నాయి.
ఆడబిడ్డలకు రక్షణ కరువవుతున్నది. వరుస ఘటనలతో అమ్మాయిల తల్లిదండ్రులు భయాందోళనలకు గురవుతున్నారు. ఇటీవల వెలుగుచూసిన జూబ్లీహిల్స్ అఘాయిత్య ఘటన తీవ్ర దుమారం రేపుతున్నది. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతుండగానే.. మరిన్ని ఘటనలు బయటపడ్డాయి. హైదరాబాద్‌లోని కార్ఖానాకు చెందిన బాలికను టెన్త్ క్లాస్ బాలుడు ఇన్స్టాగ్రామ్ ద్వారా ట్రాప్ చేసి.. మరో బాలుడితోపాటు, ఇంకో ముగ్గురు యువకులతో కలిసి రెండు నెలలుగా అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఫ్రెండ్స్‌తో బర్త్‌డే పార్టీకి వెళ్లిన మరో బాలిక నెక్లెస్ రోడ్లో అత్యాచారానికి గురైంది.
Also Read: BJP- Pawan Kalyan: బీజేపీ, పవన్ కళ్యాణ్.. ఓ సీక్రెట్ భేటి
11 ఏండ్ల అమ్మాయిపై పాతబస్తీ పరిధిలో ఇద్దరు క్యాబ్ డ్రైవర్లు అఘాయిత్యానికి పాల్పడ్డారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం 15 ఏండ్ల బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల్లో ఒకరు కామారెడ్డి జిల్లాకు చెందిన ఏఎస్ఐ కొడుకు ఉన్నాడు.
గతేడాది 2,356 పోక్సో కేసులు
నిరుడు రాష్ట్రవ్యాప్తంగా 2,356 పోక్సో కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 487 మంది మైనర్లపై అఘాయిత్యం జరిగినట్లు కేసులు రిపోర్ట్ అయ్యాయి. అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న వారిలో ఎక్కువ శాతం ఆయా కుటుంబాలకు తెలిసిన వారే ఉంటున్నారు. దీంతో పాటు ఫ్రెండ్స్, సోషల్ మీడియాలో ట్రాప్ చేసే ఆవారాలు వరుస నేరాలకు పాల్పడుతున్నారు. ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ట్రాప్ చేస్తున్నారు. ట్రాప్‌కు గురవుతున్న వాళ్లలో 12 నుంచి 17 ఏండ్ల మధ్య వయసున్న బాలికలే ఎక్కువగా ఉన్నారని పోలీసుల లెక్కలు చెప్తున్నాయి. ఇందులో ప్రేమ, ఫ్రెండ్ షిప్ పేరుతో మోసపోతున్న బాలికల సంఖ్య అధికంగా ఉంటున్నది. నమోదవుతున్న అఘాయిత్య కేసులు ఒక ఎత్తయితే.. పరువుపోతుందన్న భయంతో పోలీసులకు ఫిర్యాదు చేయని వాళ్లు చాలా మందే ఉన్నారు. ఇట్లా పోలీసుల ముందుకు రాని కేసులు మరో 13 శాతం వరకు ఉంటాయని అధికారులు చెప్తున్నారు.
అడ్డూ అదుపులేని పబ్ కల్చర్.. గల్లీ గల్లీకి బెల్ట్ షాపులు
గ్రేటర్ హైదరాబాద్‌లో అడ్డూ అదుపులేని పబ్ కల్చర్, వీకెండ్స్ ఈవెంట్స్ టీనేజర్లను చెడుమార్గం పట్టిస్తున్నాయి. మైనర్లకు పబుల్లోకి పర్మిషన్ లేకపోయినా.. దర్జాగా అనుమతిస్తున్నారు. వీకెండ్ పార్టీ అంటూ, బర్త్ డే అంటూ పబ్బుల్లో దావతులు చేసుకుంటున్నారు. బాలికలను ట్రాప్ చేసి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. జూబ్లీహిల్స్ అఘాయిత్య ఘటన ఇందుకు ఉదాహరణ. పబ్‌కు వెళ్లిన 17 ఏండ్ల బాలికను కొందరు యువకులు మాయమాటలు చెప్పి కారులో తీసుకెళ్లి అఘాయిత్యానికి తెగబడ్డారు. ఈ కేసులో లీడర్ల కొడుకులు కూడా ఉన్నట్లు తేలింది. పబ్బుల్లో జరుగుతున్న గొడవలకు, దౌర్జన్యాలకు లెక్కేలేదు. మరోవైపు ఆకతాయిలు సోషల్ మీడియాలో బాలికలను ట్రాప్ చేస్తూ అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. కార్ఖానాలో వెలుగు చూసిన ఘటన కూడా ఇలాంటిదే. సైబర్ క్రైమ్ పోలీసులకు అందుతున్న ఫిర్యాదుల్లో 68 శాతం ఆన్లైన్, సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్ వల్ల జరుగుతున్న అఘాయిత్యాలే ఉన్నాయి. ఊర్లలో వాడవాడలా లిక్కర్, గంజాయిదొరుకుతుండడంతో యూత్మత్తుకు బానిలవుతున్నారు. ఆ మత్తులోమైనర్లపై అఘాయిత్యాలకు తెగబడుతున్నారు. నేటి యువతలో చాలామంది స్మార్ట్ ఫోన్లు వాడుతుండడం, పోర్న్‌సైట్లకు అలవాటుపడడం కూడా రేప్ కేసులు పెరిగేందుకు ప్రధానకారణమని పోలీసులు అంటున్నారు.
ఆరేండ్లు గడిచినా నిందితులు దొరకలే..
వరంగల్ జిల్లాలో ఆరేండ్ల కింద సంచలనం సృష్టించిన ఇద్దరు బాలికల అఘాయిత్యం హతమార్చిన కేసు మిస్టరీ ఇప్పటికీ వీడలేదు. పర్వతగిరి మండలం నారాయణపురం శివారు కంబాలకుంట తండాకు చెందిన ఇద్దరు బాలికలు నల్లబెల్లి మండలం మూడు చెక్కలపల్లి ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదివారు. వరుసకు అక్కా చెల్లెళ్లయిన వీరు దీపావళి సెలవులకు ఇంటికి వచ్చి 2015 డిసెంబర్ మూడోవారంలో హాస్టల్‌కు వెళ్లారు. ఆ తర్వాత ఇద్దరూ కనిపించకుండా పోయారు. తల్లిదండ్రులు నల్లబెల్లి పోలీసులకు కంప్లైంట్ చేశారు. డిసెంబర్ 27న చెన్నారావుపేట మండలం ఖాదర్‌పేట శివారు నల్లబోడు తండా గుట్టల్లో ఇద్దరు బాలికల డెడ్‌బాడీలు దొరికాయి. అధికార పార్టీకి చెందిన ఓ లీడర్ కొడుకులే అమ్మాయిలను అఘాయిత్యం చేసి చంపేశారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. కానీ ఆరేండ్లు గడిచినా ఈ కేసులో నిందితులను పోలీసులు పట్టుకోలేకపోయారు.
ఇంటి దగ్గర డ్రాప్ చేస్తామని.. !
హైదరాబాద్‌లోని పాతబస్తీ మొఘల్‌పుర పీఎస్ పరిధిలో గత నెల 31న ఓ బాలిక (11)ను క్యాబ్ డ్రైవర్ షేక్ కలీం(36), అతడి ఫ్రెండ్ మహ్మద్ లుక్మాన్(36) కిడ్నాప్ చేశారు. పహాడీషరీఫ్ షాహిన్ నగర్‌కు నడుచుకుంటూ వెళ్తున్న బాలికను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తామని నమ్మించి, షాద్‌నగర్ సమీపంలోని కొందుర్గుకు తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ నెల 1న సుల్తాన్ షాహిలో వదిలిపెట్టారు. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో మొఘల్‌పుర పోలీసులు కేసు నమోదు చేసి.. నిందితులను ఆదివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు
ఏడు రెట్లు పెరిగిన కేసులు
నేషనల్ క్రైం బ్యూరో రికార్డుల ప్రకారం రాష్ట్రంలో రోజూ ఆరుగురు చిన్నారులు లైంగిక హింసకు గురవుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటివరకు పోక్సో కింద 10 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. వీటిలో 90 శాతానికి పైగా లిక్కర్ మత్తులో జరుగుతున్న ఘటనలేనని పోలీస్ రికార్డులు చెప్తున్నాయి. 2014తో పోలిస్తే చిన్న పిల్లలపై జరిగిన రేప్, లైంగిక వేధింపుల కేసులు రాష్ట్రంలో ఏడు రెట్లు పెరిగాయి. పోక్సో కింద 2014లో 330 కేసులు, 2015లో 721 కేసులు నమోదైతే.. 2020లో 1,934 .. 2021లో 2,356 కేసులు ఫైల్ అయ్యాయి. అంటే రాష్ట్రంలో ప్రతి రోజు సగటున ఇలాంటి కేసులు ఆరు నమోదవుతున్నాయి.
పోక్సో చట్టం ఏం చెప్తున్నది?
చిన్నారులపై లైంగిక దాడులను అరికట్టేందుకు 2012లో ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ (పోక్సో) యాక్ట్‌ను కేంద్రం తెచ్చింది. దీని ప్రకారం.. నేరం రుజువైతే 10 నుంచి 20 ఏండ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. తీవ్ర నేరాల్లో జీవితఖైదు, మరణశిక్ష కూడా విధించే అవకాశం ఉంటుంది. నిజానికి పోక్సో ద్వారా మైనర్ల పై దాడులు, అఘాయిత్యాలు అరికట్టేందుకు గ్రామ స్థాయిలో చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీలు ఉండాలి. కమిటీ చైర్మన్‌గా సర్పంచ్, కన్వీనర్‌గా అంగన్ వాడీ వర్కర్, జీపీ సిబ్బంది ఉండాలి. కానీ రాష్ట్రంలో ఈ కమిటీలు నామమాత్రంగా తయారయ్యాయి. పోక్సో కేసుల దర్యాప్తులో పోలీసులు అలసత్వం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నిరుడు 2వేలకు పైగా పోక్సో కేసులు నమోదైతే 49 మందికి మాత్రమే శిక్షలు పడ్డాయి.
Also Read:Hindus in Pakistan: పాకిస్తాన్ లో హిందువుల పరిస్థితి ఇదీ
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: She has no protection attacks on women continue under the law
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com