బోర్లు వేస్తే నీళ్లు పడవు, పడిన నీళ్ళు ఈ విపరీతమైన ఎండ తీవ్రతకు ఇంకి పోతున్నాయి. చేసేదేముంది అరకోరగా వచ్చే నీటినే జాగ్రత్తగా వాడుకుంటూ ఈ ఎండకాలాన్ని గడిపేయాలని మధ్యప్రదేశ్ లోని జాబువా జిల్లా వాసులు వారి నీళ్ళ డ్రమ్ములకు తాళాలు వేసుకుంటూ బంగారం, వెండి వస్తువులను కాపాడుకున్నట్లు నీటిని కాపాడుకుంటున్నారు.
కరోనా వైరస్ సంక్షోభ సమయంలో తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలని వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు. అయితే ఈ జిల్లాలోని చాలా ప్రాంతాల్లో ప్రజలు గొంతు తడుపుకునేందుకు, చేతులు కడుక్కునేందుకు సైతం చుక్కనీరు లేక అల్లాడిపోతున్నారు. ప్రస్తుత వేసవికాలంలో జిల్లాలోని నీటి వనరులు అడుగంటిపోయాయి. జాబువా జిల్లాలోని జోన్సార్ గ్రామస్తులు మూడు కిలోమీటర్ల దూరం నుండి నీటిని తీసుకువస్తారు. రోజంతా ఇదే పనిలో ఉంటారు. ఆ నీటిని డ్రమ్ముల్లో పోసుకుని, ఎవరూ దొంగిలించకుండా ఆ డ్రమ్ములకు తాళాలు వేస్తారు. ఇక్కడి పరిస్థితులపై పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ విభాగం అధికారి మాట్లాడుతూ.. గ్రామంలో పవర్ పంపులు, హ్యాండ్ పంపులు ఉన్నా వేసవిలోనీటి మట్టం తగ్గిన కారణంగా నీటి ఎద్దడి ఏర్పడుతున్నదని అన్నారు. గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపారు.
తెలంగాణలో కూడా ఎండా కాలంలో నీటి ఎద్దడి ఎక్కువగా ఉంటుంది. నగర, పట్టణాల్లో ఈ నీటి కరువు చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ జాబువా జిల్లా వాసుల విషయం హైద్రాబాద్ వాసులకు తెలిసిందో లేదో తెలియదు కానీ తెలిస్తే తప్పకుండా వాళ్ళ డ్రమ్ములకు కూడా తాళాల వేస్తారేమో అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.